SBI Jobs: ఎస్‌బీఐలో 1,031 ఉద్యోగాలు.. వారికే ప్రత్యేకం.. పూర్తి వివరాలివే..!

SBI job notification: ఎస్‌బీఐలో వెయ్యికి పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. బ్యాంకులో పనిచేసిన అనుభవం కలిగిన 60ఏళ్లు కలిగిన వారు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులు.

Updated : 10 Apr 2023 12:57 IST

ముంబయి: ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(SBI)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. విశ్రాంత బ్యాంకు సిబ్బందిని ఒప్పంద ప్రాతిపదికన నియమించుకొనేందుకు ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. వెయ్యికి పైగా ఉద్యోగ నియామకాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. గతంలో బ్యాంకుల్లో పనిచేసిన అనుభవం కలిగి, ఆసక్తి కలిగినవారు ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌https://sbi.co.in/ ను సందర్శించి ఏప్రిల్‌ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.  మొత్తం 1,031 పోస్టులు ఉండగా.. ఛానల్‌ మేనేజర్‌ ఫెసిలిటేటర్‌, ఛానల్‌ మేనేజర్‌ సూపర్‌వైజర్‌, సపోర్ట్‌ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. 

ఎస్‌బీఐ విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం.. అభ్యర్థుల వయసు ఏప్రిల్ 1, 2023 నాటికి కనీసం 60 ఏళ్లు; గరిష్ఠంగా 63 ఏళ్ల  వయస్సు కలిగి ఉండాలి.  రిజర్వేషన్లకు లోబడి అభ్యర్థులకు వయో సడలింపు కల్పిస్తారు. దేశంలో కేటాయించిన చోట ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. విద్యార్హత వివరాలను స్పష్టంగా పేర్కొనకపోయినప్పటికీ.. ఏటీఎం ఆపరేషన్స్‌లో పనిచేసిన అనుభవం కలిగినవారికి ఎక్కువ ప్రాధాన్యం  ఇవ్వనున్నట్టు పేర్కొంది. వచ్చిన దరఖాస్తులను షార్ట్‌లిస్ట్‌ చేసి.. వాటిలో మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేయనున్నారు. ఆ తర్వాత ఎంపికైన అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి పోస్టింగ్‌ ఇస్తారు. 

వేతనం ఇలా..

  • ఛానెల్ మేనేజర్ ఫెసిలిటేటర్- నెలకు ₹ 36,000
  • ఛానెల్ మేనేజర్ సూపర్‌వైజర్- నెలకు ₹ 41,000
  • సపోర్ట్ ఆఫీసర్- నెలకు ₹ 41,000

పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని