దేశ ఔన్నత్యానికి ప్రతిబింబం న్యాయవ్యవస్థ పనితీరు!

భారత న్యాయవ్యవస్థ ఏకీకృత న్యాయవ్యవస్థను కలిగి ఉంది. భారతదేశంలో సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. భారత రాజ్యాంగంలోని 5వ భాగంలో 124 నుంచి 147 వరకు ఉన్న నిబంధనలు సుప్రీంకోర్టు గురించి తెలుపుతాయి.

Published : 28 Apr 2024 00:02 IST

టీఎస్‌పీఎస్సీ, ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకం
ఇండియన్‌ పాలిటీ

భారత న్యాయవ్యవస్థ ఏకీకృత న్యాయవ్యవస్థను కలిగి ఉంది. భారతదేశంలో సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. భారత రాజ్యాంగంలోని 5వ భాగంలో 124 నుంచి 147 వరకు ఉన్న నిబంధనలు సుప్రీంకోర్టు గురించి తెలుపుతాయి. ఏకీకృత న్యాయవ్యవస్థ విధానాన్ని బ్రిటిష్‌ రాజ్యాంగం నుంచి స్వీకరించగా, స్వతంత్య్ర న్యాయవ్యవస్థ విధానాన్ని అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించారు.

సుప్రీంకోర్టు

భారత రాజకీయ వ్యవస్థలోని రెండు కారణాల రీత్యా సుప్రీంకోర్టు ఏర్పడింది.

1) సమాఖ్య రాజ్యాంగ భావన కారణంగా కేంద్ర, రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించడానికి

2) లిఖిత రాజ్యాంగ ఆధిక్యతను కాపాడటానికి పై రెండు కారణాల వల్ల సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానంగా గుర్తింపు పొందింది.

ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడటం సుప్రీంకోర్టు బాధ్యత.

  • గతంలో సుప్రీంకోర్టును ప్రీవీ కౌన్సిల్‌ అని పిలిచేవారు.
  • ఇది ఈస్ట్‌ ఇండియా కంపెనీ పరిపాలనా కాలంలో రెగ్యులేటింగ్‌ చట్టం ఆధారంగా ఏర్పడింది.
  • వారెన్‌ హేస్టింగ్స్‌ కాలంలో 1774లో కలకత్తా కేంద్రంగా దీన్ని ప్రారంభించారు.
  • మొదట ఇందులో ఒక ప్రధాన న్యాయమూర్తి, ముగ్గురు న్యాయమూర్తులు ఉండేవారు.
  • ప్రీవీ కౌన్సిల్‌ తొలి ప్రధాన న్యాయమూర్తిగా సర్‌ ఎలిజా ఇంపే బాధ్యతలు నిర్వర్తించారు.
  • భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారం, ప్రీవీ కౌన్సిల్‌ను ఫెడరల్‌ కోర్ట్‌గా మార్చారు. దీని కార్యకలాపాలు 1937 ఏప్రిల్‌ 1న ప్రారంభమయ్యాయి.
  • ఇందులో ఒక ప్రధాన న్యాయమూర్తి, ఆరుగురు న్యాయమూర్తులు ఉండేవారు. దీని తొలి ప్రధాన న్యాయమూర్తి సర్‌ మారిస్‌ గ్వైర్‌.
  • ఫెడరల్‌ కోర్టు 1950 జనవరి 28న సుప్రీంకోర్టు ఆఫ్‌ ఇండియాగా మారింది.
  • దీనిలో ఒక ప్రధాన న్యాయమూర్తి, ఏడుగురు న్యాయమూర్తులు ఉండేవారు.
  • దీని తొలి ప్రధాన న్యాయమూర్తి - జస్టిస్‌ హరిలాల్‌.జె.కానియా (1950 జనవరి 28 - 1951)
  • అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు దిల్లీలో ఉంది.
  • ప్రస్తుతం ఇందులో ఒక ప్రధాన న్యాయమూర్తి, 33 మంది న్యాయమూర్తులున్నారు.
  • ప్రస్తుత (50వ) ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్‌.
  • 124 (2) ఆర్టికల్‌ ప్రకారం సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది.
  • వీరి సంఖ్య 1956లో 11, 1960లో 14, 1977లో 18, 1986లో 26, 2008లో 31గా ఉండేది. 2019 సెప్టెంబరు 18 నుంచి 34 మంది న్యాయమూర్తులు ఉంటున్నారు. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల నియామకం కొలీజియం సిఫార్సుల మేరకు జరుగుతుంది.
  • కేసు పూర్వాపరాలు పరిశీలించి కోర్టు ఇచ్చిన తీర్సు నచ్చకపోతే అప్పీలు చేసుకోవచ్చు. అయితే ఈ ప్రక్రియకు న్యాయమూర్తి అనుమతి తప్పనిసరి.
  • జిల్లా కోర్టులోని సెషన్‌ కోర్టు ఒక వ్యక్తికి మరణశిక్ష విధించవచ్చు.

సుప్రీంకోర్టు జడ్జీల తొలగింపు/ అభిశంసన తీర్మానం

124 (4) ఆర్టికల్‌ ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించే విధానాన్ని అభిశంసన ప్రక్రియ అంటారు. దీనికి రెండు కారణాలుంటాయి.
1) అసమర్థత    2) అక్రమ ప్రవర్తన

  • జడ్జీలను తొలగించే తీర్మానాన్ని ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు.
  • ఈ తీర్మానంపై లోక్‌సభలో 100 మంది, రాజ్యసభలో 50 మంది ఎంపీలు సంతకాలు చేసి స్పీకర్‌కు /ఛైర్మన్‌కు నోటీసు ఇవ్వాలి. వారు దీన్ని అంగీకరించవచ్చు లేదా తిరస్కరించవచ్చు.
  • ప్రధాన న్యాయమూర్తిని తొలగించడానికి మహాభియోగ తీర్మానాన్ని అనుసరించవచ్చు. ఇప్పటివరకు ఏ ప్రధాన న్యాయమూర్తిని ఈ విధంగా తొలగించలేదు.
  • న్యాయమూర్తుల్లో అభిశంసన తీర్మానాన్ని ఎదుర్కొన్నది జస్టిస్‌ వి.రామస్వామి (1993 మే)
  • న్యాయమూర్తిపై వచ్చిన అభియోగాలను విచారించడానికి ఒక అధ్యక్షుడు, ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని పార్లమెంట్‌ నియమిస్తుంది.
  • ఈ కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సుప్రసిద్ధ న్యాయ కోవిదులు సభ్యులుగా ఉంటారు.
  • విచారణలో అభియోగాలు రుజువైనట్లయితే తొలగించే తీర్మానాన్ని ఉభయ సభలు వేర్వేరుగా ప్రత్యేక మెజార్టీతో అంటే హాజరై ఓటు వేసిన సభ్యుల్లో 2/3వ వంతు మెజారిటీ సభ్యులు, మొత్తం సభ్యుల్లో సాధారణ మెజారిటీకి తగ్గకుండా ఆమోదించాల్సి ఉంటుంది.
  • ఈ తీర్మానం మేరకు ఆ న్యాయమూర్తిని తొలగిస్తూ రాష్ట్రపతి ఆదేశాలు జారీ చేస్తారు.

ప్రధాన న్యాయమూర్తి నియామకం

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియామకానికి రాజ్యాంగంలో ప్రత్యేక అర్హతలను పేర్కొనలేదు.

  • సాధారణంగా సీనియర్‌ న్యాయమూర్తిని ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తారు.
  • అయితే సీనియర్‌ను కాదని ఇప్పటివరకు ఇద్దరిని ప్రధాన న్యాయమూర్తులుగా నియమించారు.

వారు జస్టిస్‌. ఎ.ఎన్‌.రే (1973 - 77), జస్టిస్‌ ఎం.హెచ్‌. బేగ్‌ (1977 - 78)
న్యాయమూర్తి పదవికి కావాల్సిన అర్హతలు
124(3) ఆర్టికల్‌ ప్రకారం. ఎ) భారత పౌరుడై ఉండాలి
బి) 65 సంవత్సరాల లోపు వయసు ఉండాలి.
సి) ఏదైనా హైకోర్టులో అయిదేళ్లు న్యాయమూర్తిగా పనిచేసిన అనుభవం లేదా పదేళ్లు న్యాయవాదిగా పనిచేసి ఉండాలి.
డి) రాష్ట్రపతి దృష్టిలో ప్రఖ్యాత న్యాయ శాస్త్రవేత్త అయి ఉండాలి.

సుప్రీంకోర్టు న్యాయమూర్తి నియామకానికి కనిష్ఠ వయసు పేర్కొనలేదు.

పదవీ ప్రమాణ స్వీకారం

124 (6) ఆర్టికల్‌ ప్రకారం 3వ షెడ్యూల్‌లో పేర్కొన్న విధంగా రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణస్వీకారం చేస్తారు.
రాజ్యాంగానికి అనుగుణంగా దేశ ఐక్యతను, సమగ్రతను కాపాడుతూ విధేయత, సమర్థతతో, ఎలాంటి పక్షపాతం లేకుండా నిర్భయంగా విధులను నిర్వహిస్తూ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని ప్రమాణం చేస్తారు.

పదవీకాలం

పదవీ ప్రమాణ స్వీకారం చేసిన న్యాయమూర్తులు 65 సంవత్సరాల వయసు వరకు పదవిలో ఉంటారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వయసుకు సంబంధించిన వివాదాలను పార్లమెంట్‌ ఏర్పాటు చేసిన అథారిటీ పరిష్కరిస్తుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు 124(2ఎ) ఆర్టికల్‌ ప్రకారం రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి సమర్పిస్తారు.


న్యాయమూర్తుల జీతభత్యాలు - సౌకర్యాలు

125వ నిబంధన ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలను పార్లమెంటు ఒక చట్టం ద్వారా నిర్ణయిస్తుంది.

  • వీటిని సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు.
  • ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో మినహా ఇతర సందర్భాల్లో వీటిని తగ్గించడానికి వీలులేదు.
  • వీరి జీతభత్యాల గురించి 2వ షెడ్యూల్‌లో పేర్కొన్నారు.
  • 2018 ఫిబ్రవరి 14న వీరి జీతభత్యాలు పెంచారు.
  • సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వేతనాన్ని లక్ష రూపాయల నుంచి రూ.2,80,000కు పెంచారు.
  • సుప్రీంకోర్టు సాధారణ న్యాయమూర్తులకు రూ.90,000 నుంచి రూ.2,50,000కు పెంచారు.
  • వీరికి జీతంతో పాటు ఉచిత నివాస వసతి, ఇతర సౌకర్యాలు, పదవీ విరమణ తర్వాత పెన్షన్‌ సౌకర్యం కల్పిస్తారు.

ప్రముఖులు - వారి వ్యాఖ్యలు

  • న్యాయ పీఠాన్ని దైవ పీఠంగా భావించాలి - మహవీర్‌త్యాగి
  • ఒకదేశ అత్యున్నత ఔన్నత్యాన్ని, నాగరికతను ఆ దేశ న్యాయవ్యవస్థ పనితీరులో చూడవచ్చు - లార్డ్‌ బ్రైస్‌
  • వాస్తవికంగా పరిశీలించినట్లయితే న్యాయవ్యవస్థ అధికార బదిలీ విషయంలో కామన్వెల్త్‌ దేశాల్లోని న్యాయస్థానాల కంటే, అమెరికన్‌ సుప్రీంకోర్టు అధికార పరిధి కంటే, ప్రపంచంలో ఏ న్యాయవ్యవస్థలో లేని అధికార పరిధి మన న్యాయవ్యవస్థకు ఉంది. - ఎం.సి. సెతల్వాడ్‌

సుప్రీంకోర్టు నినాదం: Whence Law, Thence Victory ధర్మమే జయిస్తుంది.


తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి

తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి గురించి 126వ నిబంధన వివరిస్తుంది.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి ఖాళీ ఏర్పడినా లేదా అనివార్య కారణాల వల్ల తన విధులు నిర్వర్తించలేని సందర్భంలో రాష్ట్రపతి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిని నియమిస్తారు.

తాత్కాలిక న్యాయమూర్తులు

తాత్కాలిక న్యాయమూర్తుల గురించి 127వ నిబంధన వివరిస్తుంది.

  • సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల కోరం లేనప్పుడు రాష్ట్రపతి పూర్వానుమతితో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, కొంతమంది తాత్కాలిక న్యాయమూర్తులను నియమించవచ్చు.
  • తాత్కాలిక న్యాయమూర్తిగా నియమితులయ్యే వ్యక్తికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి నియామకానికి కావాల్సిన అర్హతలన్నీ ఉండాలి.
  • సుప్రీంకోర్టులో పదవీ విరమణ చేసిన జడ్జీలను కేసులు ఎక్కువగా ఉన్నప్పుడు పదవిలో కొనసాగమని 128వ నిబంధన ప్రకారం రాష్ట్రపతి అనుమతితో ప్రధాన న్యాయమూర్తి కోరవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని