ప్రపంచ ర్యాంకుల్లో IIIT-హైదరాబాద్‌కు చోటు.. భారత్‌ నుంచి టాప్‌ యూనివర్సిటీలివే..!

ప్రపంచ వ్యాప్తంగా ఉన్నత విద్యాసంస్థలకు సంబంధించి టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌ విడుదలయ్యాయి. మన దేశం నుంచి అత్యున్నత విద్యాసంస్థగా బెంగుళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc)నిలిచింది.

Updated : 26 Oct 2023 17:43 IST

World University Rankings 2024| దిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థలను పలు అంశాల వారీగా అంచనా వేసే ‘టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్‌’ గురువారం విడుదలయ్యాయి.  2024 ఏడాదికి గాను ఈ ర్యాంకింగ్స్‌లో అమెరికా, యూకేలకు చెందిన ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు టాప్‌లో నిలిచి సత్తా చాటాయి. అమెరికాలోని హార్వర్డ్‌ యూనివర్సిటీ, స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ మొదటి రెండు స్థానాల్లో నిలవగా.. బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌, కేంబ్రిడ్జ్‌ వర్సిటీలు 4, 5 ర్యాంకుల్లో నిలిచాయి.  ఇంపీరియల్‌ కాలేజ్‌ లండన్‌ పదో ర్యాంకులో ఉంది. ఇక భారత్‌ విషయానికి వస్తే..  మన దేశంలో టాప్‌ వర్సిటీగా బెంగుళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc)నిలిచింది. ఫిజికల్ సైన్సెస్, ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, లైఫ్ సైన్స్‌.. మొత్తం నాలుగు సబ్జెక్టుల్లో ఈ విద్యాసంస్థ అగ్రస్థానంలో నిలిచి సత్తా చాటింది. ఫిజికల్‌ సైన్స్‌ విభాగంలో IISc 201-250 ర్యాంకుల కేటగిరీలో నిలవగా.. ఇంజినీరింగ్‌లో  100-125; కంప్యూటర్‌ సైన్స్‌ సబ్జెక్టులో 101-125; లైఫ్‌ సైన్సెస్‌లో 201-250 ర్యాంకుల కేటగిరీలో స్థానం దక్కించుకుంది. తెలంగాణ నుంచి ఐఐఐటీ-హెచ్‌కి ఇంజినీరింగ్‌ విభాగంలో 201-600 ర్యాంకుల కేటగిరీలో స్థానం లభించింది.

ఇంజినీరింగ్‌ కేటగిరీలో అన్నా యూనివర్సిటీ 301-400 ర్యాంకుల కేటగిరీలో చోటు దక్కించుకోగా.. జామియా మిల్లియా ఇస్లామియా, లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీ, శూలిని యూనివర్సిటీ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌ సైన్సెస్‌; శిక్షా ‘ఒ’ అనుసంధాన్‌ డీమ్డ్‌ యూనివర్సిటీలు 401-500 ర్యాంకుల కేటగిరీలో నిలిచాయి. అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ, ఐఐటీ గువాహటి, ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (హైదరాబాద్‌), జేపీ యూనివర్సిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, కేఐఐటీ యూనివర్సిటీ, యూపీఈఎస్‌, సవీత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ మెడికల్‌ అండ్‌ టెక్నికల్‌ సైన్సెస్‌, తాపర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, విట్‌ యూనివర్సిటీలకు 201-600 ర్యాంకుల కేటగిరీలో చోటు లభించింది. 601-800 ర్యాంకుల కేటగిరీలో అమిటీ యూనివర్సిటీ, అమృత విశ్వ విద్యాపీఠం, బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ పిలాని, దిల్లీ టెక్నాలాజికల్‌ యూనివర్సిటీ, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఇండియా స్కూల్‌ ఆఫ్‌ మైన్స్‌) ధన్‌బాద్‌, ఐఐటీ పట్నా ఉన్నాయి. 

ఇకపోతే, ఇంజినీరింగ్‌ కాకుండా ఇతర విభాగాల్లో ప్రతిష్ఠాత్మక దిల్లీ విశ్వవిద్యాలయం, జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీలు ఆర్ట్స్‌, హ్యుమానిటీస్‌ సబ్జెక్టులకు సంబంధించి 501-600 ర్యాంకుల కేటగిరీలో నిలిచాయి. సైకాలజీ సబ్జెక్టులో మన దేశం నుంచి ఈ జాబితాలో చోటుదక్కించుకున్న ఏకైక వర్సిటీ దిల్లీ విశ్వవిద్యాలయం మాత్రమే. దిల్లీ వర్సిటీ 401-500 ర్యాంకుల  కేటగిరీలో స్థానం సంపాదించింది. బిజినెస్‌ అండ్‌ ఎకనమిక్స్‌ సబ్జెక్టులో జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీ 401-500 ర్యాంకుల కేటగిరీలో నిలిచి దేశంలో టాప్‌ విద్యాసంస్థగా నిలిచింది. అలాగే,  క్లినికల్‌ అండ్‌ హెల్త్‌లో మణిపాల్‌ అకాడమీ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ 201-250 ర్యాంకుల కేటగిరీలో నిలవగా..  సోషల్‌ సైన్సెస్‌లో లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీ 401-500 ర్యాంకుల కేటగిరీలో చోటు దక్కించుకున్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని