గుండెల్లో రైళ్లు పరుగెత్తాల్సిందే!

మనందరికీ రైలు ప్రయాణం అంటే చాలా ఇష్టం కదూ! కానీ ఈ మార్గంలో వెళ్లాలంటే మాత్రం చాలా ధైర్యం కావాలి. ఎందుకంటే పక్క నుంచి సముద్ర అలలు అంతెత్తున ఎగసి పడుతుంటాయి. వాటి తాకిడికి రైలు కొట్టుకుపోతుందేమో అని గుండె సైతం దడదడలాడుతుంది. ఈ భయంకరమైన రైలు మార్గం ఎక్కడ ఉందో తెలుసుకోవాలని ఉంది కదా!..

Published : 30 Sep 2020 00:53 IST

మనందరికీ రైలు ప్రయాణం అంటే చాలా ఇష్టం కదూ! కానీ ఈ మార్గంలో వెళ్లాలంటే మాత్రం చాలా ధైర్యం కావాలి. ఎందుకంటే పక్క నుంచి సముద్ర అలలు అంతెత్తున ఎగసి పడుతుంటాయి. వాటి తాకిడికి రైలు కొట్టుకుపోతుందేమో అని గుండె సైతం దడదడలాడుతుంది. ఈ భయంకరమైన రైలు మార్గం ఎక్కడ ఉందో తెలుసుకోవాలని ఉంది కదా!.. అయితే పదండి కథనంలోకి..
కూ.. చుక్‌.. కూ.. చుక్‌.. అని శబ్దం చేసుకుంటూ రైలు వస్తుంది కదా.. కానీ ఇంగ్లాండ్‌లోని డెవాన్‌ దక్షిణ తీరంలో ఉన్న ‘దక్షిణ డెవాన్‌ రైల్వే సముద్ర గోడ’ ప్రాంతంలో మాత్రం రైలు కూత అసలు వినిపించదు. ఉవ్వెత్తున ఎగిసిపడే సముద్ర అలల జోరే జోరుగా మన చెవులను హోరెత్తిస్తుంది. ఈ రైల్వే లైను నిర్మాణం 1846 ప్రాంతంలో జరిగింది. ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు 21 కిలోమీటర్లు ఇలాగే సముద్రాన్ని ఆనుకునే ఉంటుంది. ఊహించుకుంటేనే ‘అయ్య బాబోయ్‌’ అనిపిస్తోంది కదూ! ఇప్పటి వరకు కొన్ని వేల సార్లు ఈ రైలు మార్గం మరమ్మతులకు గురైంది. సముద్ర అలల తాకిడికి, తుపానుల సమయంలో దెబ్బతిన్న ప్రతిసారీ దీన్ని ఎంతో శ్రమ, ఖర్చుకోర్చి బాగు చేయిస్తున్నారు.
అలలతో అల్లకల్లోలమే..
ఎప్పుడూ ఏదో ఒక మరమ్మతు ఈ మార్గానికి జరుగుతూనే ఉంటుంది. 2014వ సంవత్సరం ఫిబ్రవరి 4న సముద్రంలో వచ్చిన భీకర అలలు దాదాపు 40 మీటర్ల వరకు డెవాన్‌ గోడ, రైలుపట్టాలను తుడిచిపెట్టుకుపోయేలా చేశాయి. మళ్లీ మరమ్మతులు పూర్తి చేసి అదే సంవత్సరం ఏప్రిల్‌లో ప్రారంభించారనుకోండి. గతంలో 1855లోనూ ఇలానే జరిగిందంట. ఇక చిన్న చిన్న విధ్వంసాలకైతే లెక్కేలేదు. అందుకే దీన్ని ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర రైలు మార్గాల్లో ఒకటిగా చెబుతుంటారు. ఇదంతా చదువుతుంటే మన దేశంలో ఉన్న పంబన్‌ బ్రిడ్జే దీనికన్నా వెయ్యిరెట్లు నయం అనిపిస్తోంది కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని