ఎంత చిన్న పార్కో!

కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవి గురించి వినే ఉంటారు. కానీ.. పాదం కూడా మోపలేని పార్కు విషయం విన్నారా?! ఇలాంటి ఉద్యానవనాలు కూడా ఉంటాయా? అనే అనుమానం

Published : 08 Feb 2021 00:34 IST

కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవి గురించి వినే ఉంటారు. కానీ.. పాదం కూడా మోపలేని పార్కు విషయం విన్నారా?! ఇలాంటి ఉద్యానవనాలు కూడా ఉంటాయా? అనే అనుమానం వస్తుందా? చదువుతుంటే ఆశ్చర్యంగా ఉంది కదూ!
మిల్‌ ఎండ్స్‌ పార్క్‌ అమెరికాలోని పోర్ట్‌ల్యాండ్‌ అనే ప్రాంతంలో ఉంది. దీనికి ప్రపంచంలోనే అతి చిన్న పార్కుగా గుర్తింపు దక్కింది. గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లోనూ నమోదైంది. ఈ పార్క్‌ వృత్తాకారంలో ఉంటుంది. దీని వైశాల్యం కేవలం రెండండే రెండే అడుగులు! 1948 నుంచే మిల్‌ఎండ్స్‌ పార్క్‌ ఉనికిలో ఉంది. నిజానికి ఇది ఓ విద్యుత్తు స్తంభం పాతడానికి ఉద్దేశించిన ప్రాంతం. కానీ అక్కడ కలుపు మొక్కలు మొలిచాయి. ఓ పత్రికకు వ్యాసాలు రాసే రచయిత ఇక్కడ పూలమొక్కల విత్తనాలు చల్లారు. తర్వాత పూలతో ఆ ప్రాంతం చాలా అందంగా తయారైంది. దీనిమీద పత్రికలోనూ వ్యాసం ప్రచురితమైంది. అప్పటి నుంచి ఆయన చనిపోయేంత కాలం అంటే 1969 వరకు దాని బాగోగులు ఆయనే చూసుకున్నారు. 1976లో దీనికి ‘అఫీషియల్‌ సిటీ పార్క్‌’ అనే పేరు వచ్చింది. తర్వాత దీని పేరు ‘మిల్‌ ఎండ్స్‌ పార్క్‌’గా రూపాంతరం చెందింది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. 2013 మార్చిలో ఈ చిన్న పార్కులోని చెట్టును ఎవరో దొంగిలించారు. తర్వాత దీని స్థానంలో మరో మొక్కను నాటారనుకోండి. 2019లోనూ ఎవరో మొక్కను నరికేశారంట! దాని స్థానంలోనూ మరో దాన్ని ఏర్పాటు చేశారు. మొత్తానికి ఇవండీ ప్రపంచంలోనే అతి చిన్న పార్కుకు సంబంధించిన విశేషాలు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని