బుడత.. భలే ఘనత!

మన దేశ జాతీయగీతం పాడమంటే.. ఎంచక్కా ఆలపించేస్తాం కదా! అయితే ఈ బుడతడ్ని పాడమంటే పక్క దేశాలవి కూడా అలవోకగా పాడేస్తాడు. అంతేనా అలా పాడేస్తూ రికార్డులు సాధించేస్తున్నాడు. తనెవరో తెలుసుకుందాం రండి..

Published : 30 Nov 2021 00:34 IST

మన దేశ జాతీయగీతం పాడమంటే.. ఎంచక్కా ఆలపించేస్తాం కదా! అయితే ఈ బుడతడ్ని పాడమంటే పక్క దేశాలవి కూడా అలవోకగా పాడేస్తాడు. అంతేనా అలా పాడేస్తూ రికార్డులు సాధించేస్తున్నాడు. తనెవరో తెలుసుకుందాం రండి..

బుడతడి పేరు ప్రియం శర్మ. వయసు నాలుగేళ్లు. ఉండేది అస్సాంలో. ప్రియంకు జ్ఞాపకశక్తి ఎక్కువ. ఏది చెప్పినా అట్టే గుర్తుపెట్టుకుంటాడు. చూడ్డానికి అమాయకంగా కనిపిస్తాడు కానీ కదిపిచూస్తే చిచ్చరపిడుగే. అది గమనించిన అమ్మానాన్న, తమ పిల్లాడు భిన్న రీతిలో ప్రతిభ చాటాలనే ఉద్దేశంతో తనకు మొదటగా మన దేశ జాతీయగీతం నేర్పించారు. అది పొల్లుపోకుండా చెప్పేశాడు ప్రియం. అది చూసిన అమ్మానాన్న ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత మిగతా కొన్ని దేశాల జాతీయ గీతాలు కూడా నేర్పించారు.

అలవోకగా ఆలపిస్తాడు..

ఇండియా, నేపాల్‌, భూటాన్‌, జపాన్‌, ఇంగ్లాండ్‌, అమెరికా, శ్రీలంక ఇలా మొత్తం ఏడు దేశాల జాతీయ గీతాలను సాధన చేయించారు. ఆ వయసుకు అన్ని దేశాల భాష పలకడమే కష్టం. అలాంటిది గీతాలను చక్కగా ఆలపించేశాడు మన ప్రియం. ఇక తన ప్రతిభకు ముగ్ధులైన అమ్మానాన్న తమ చిన్నారి గొప్పదనం గురించి రికార్డ్స్‌ కమిటీకి తెలియజేశారు.

కేవలం అయిదు నిమిషాల్లోనే..

ప్రియం శర్మ ఏడుదేశాల జాతీయ గీతాలను కేవలం 5 నిమిషాల్లో పాడేశాడు. ఇంకేం ఎంచక్కా ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో స్థానం సంపాదించేసుకున్నాడు. ఇంత చిన్న వయసులోనే ఈ ఘనత సాధించిన చిన్నారి ప్రియం నిజంగా గ్రేట్‌ కదూ నేస్తాలు.. మరి ప్రియం శర్మ మరిన్ని విజయాలు అందుకోవాలని ఆల్‌ ద బెస్ట్‌ చెప్పేద్దామా.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని