తనకు తానే గురువు..

పట్టుమని పదేళ్లు కూడా రాలేదు. అప్పుడే సంస్కృత శ్లోకాలు గడగడా చెప్పేస్తుంది. అదొక్కటే కాదు శ్లోకాలు చెబుతూనే రూబిక్‌ క్యూబ్స్‌ను సాల్వ్‌ చేస్తుంది. రికార్డులు అందుకుంటూ ‘భళా చిన్నారి’ అనిపించుకుంటోంది.

Published : 17 Nov 2021 01:01 IST

పట్టుమని పదేళ్లు కూడా రాలేదు. అప్పుడే సంస్కృత శ్లోకాలు గడగడా చెప్పేస్తుంది. అదొక్కటే కాదు శ్లోకాలు చెబుతూనే రూబిక్‌ క్యూబ్స్‌ను సాల్వ్‌ చేస్తుంది. రికార్డులు అందుకుంటూ ‘భళా చిన్నారి’ అనిపించుకుంటోంది. మరి తనెవరో ఏంటో ఆ వివరాలన్నీ తెలుసుకుందామా!

చిన్నారి పేరు శ్రీ హంసిక. వయసు ఏడేళ్లు. ప్రస్తుతం రెండో తరగతి చదువుతోంది. ఉండేది కేరళలోని కక్కనాడ్‌.

అమ్మమ్మను చూసి..

హంసిక అమ్మమ్మ వాళ్ల ఊరు ఒంగోలు. ఆమె రోజూ పూజ చేస్తూ శ్లోకాలు చదివేవారు. అక్కడకు వెళ్లిన హంసిక కూడా ఆ శ్లోకాలను విని తనూ సరదాగా చదివేది. తర్వాత తనకు తానుగా టీవీలో శ్లోకాలను వినేది. అలా క్రమక్రమంగా 18 శ్లోకాలను కంఠతా పట్టేసింది. తన ఏకాగ్రత, శ్రద్ధ చూసి అందరూ ఆశ్చర్యపోయారు.  

శ్లోకాలు వల్లెవేస్తోంది

ఒకరోజు బొమ్మల షాపులో రూబిక్‌ క్యూబ్‌ కొనుక్కుంది. అప్పట్నుంచి దాన్ని సాల్వ్‌ చేయడానికి ప్రయత్నించేది. అదెలా సాల్వ్‌ చేయాలో ఎవర్నీ అడగకుండా వాటికి సంబంధించిన ట్రిక్స్‌ ఉన్నాయేమో అని యూట్యూబ్‌లో వెతికేది. అలా తనకు తానుగా రకరకాల రూబిక్‌ క్యూబ్‌లను సాల్వ్‌ చేయడం నేర్చేసుకుంది. ఇంకేముంది మన హంసిక 15 రూబిక్‌ క్యూబ్స్‌ను 18 సంస్కృత శ్లోకాలు పఠిస్తూ 12 నిమిషాల్లో సాల్వ్‌ చేసింది. తన ప్రతిభను చూసిన వారంతా చప్పట్లతో ప్రశంసలు కురిపించారు. ‘కలాం బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’, ‘వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’, ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో స్థానం సంపాదించింది. అన్నట్టు హంసిక ఇంగ్లిష్‌, హిందీ, మలయాళం కూడా మాట్లాడగలదు. అంతేకాదు వాళ్ల అమ్మది ఆంధ్రప్రదేశ్‌ కావడంతో తెలుగు కూడా నేర్చేసుకుంది. మరింకేం ఇంత చిన్న వయసులో ప్రతిభ కనబరుస్తున్న హంసికకు మనసారా అభినందనలు తెలిపేద్దామా!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని