Tesla: నెల క్రితం ప్రమోషన్‌.. ఇప్పుడు లేఆఫ్‌.. టెస్లాలో భారత టెకీ ఆవేదన!

Tesla: టెక్‌ కంపెనీల్లో అనేక మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఇప్పటి వరకు కష్టపడి పనిచేసిన తమను తొలగించడంపై పలువురు సామాజిక మాధ్యమ వేదికల్లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Published : 07 May 2024 11:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టెక్నాలజీ రంగంలో ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతున్నాయి. చాలా మంది తమ ఉద్వాసన పట్ల షాక్‌కు గురవుతున్నారు. తమ ఆవేదనను సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంటున్నారు. ఓ ప్రముఖ నివేదిక ప్రకారం.. ఏప్రిల్‌లో టెక్‌ కంపెనీలు దాదాపు 21,500 మంది ఉద్యోగులను తీసేశాయి. గత నెల తొలగింపులు టెస్లాతో (Tesla) ప్రారంభమయ్యాయి. అందులో ఓ భారత టెకీ కూడా ఉన్నారు. దాదాపు ఏడేళ్ల పాటు పనిచేసిన ఆమె స్టోరీని సోదరుడు జతిన్‌ సైనీ లింక్డిన్‌లో పంచుకున్నారు.

టెస్లాలో (Tesla) తన సోదరిని తొలగిస్తూ పంపిన మెయిల్‌ స్క్రీన్‌షాట్లను జతిన్‌ సైనీ ఓ పోస్ట్‌లో పంచుకున్నారు. ఎలాన్‌ మస్క్‌కు చెందిన ఆ కంపెనీలో తన సోదరి ఏడేళ్ల పాటు కష్టపడి పనిచేసినట్లు చెప్పారు. గత శుక్రవారం తొలగించేసినట్లు వెల్లడించారు. కంపెనీ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా తన రోల్‌ను తీసేస్తున్నట్లు మెయిల్‌లో పేర్కొన్నారు. అయితే, నెల క్రితమే సోదరికి ప్రమోషన్ వచ్చినట్లు సైనీ తెలిపారు. న్యూజెర్సీ నుంచి వాషింగ్టన్‌ను మారేందుకు కూడా సిద్ధమైనట్లు చెప్పారు. ఈ విషయం తెలిసి తమ కుటుంబం చాలా సంతోషించినట్లు చెప్పారు. కానీ, మే 3న ఆఫీసుకు వెళ్తే తన కార్డు పనిచేయకపోవటంతో తన ఆశలన్నీ అడియాసలైనట్లు వాపోయారు. ఆమె టీమ్‌లో దాదాపు 75 శాతం మందిని తొలగించినట్లు వెల్లడించారు. ఏడేళ్లు కష్టపడి పనిచేసిన తర్వాత ఒక్క ఈమెయిల్‌తో బయటకు పంపడం పట్ల తన సోదరి తీవ్ర ఆవేదనకు గురైనట్లు తెలిపారు.

టెస్లా (Tesla) కార్ల విక్రయాలు ఈ మధ్య గణనీయంగా పడిపోయిన విషయం తెలిసిందే. మరోవైపు ప్రత్యర్థి సంస్థల నుంచి పోటీ కూడా ఎక్కువవుతోంది. దీంతో కంపెనీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. విక్రయాలు పెంచడం కోసం ధరలను తగ్గించింది. త్వరలో అందుబాటు ధరలో కొత్త కార్లను తీసుకురానున్నట్లు ప్రకటించింది. మరోవైపు ఖర్చులను తగ్గించుకోవడం కోసం పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తోంది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా తమ కంపెనీలో పనిచేస్తున్న దాదాపు 10 శాతం మంది సిబ్బందికి ఉద్వాసన పలికింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని