Jharkhand: రూ.10వేల లంచం కేసును లాగితే.. బయటపడిన నోట్ల గుట్టలు..!

Jharkhand: ఝార్ఖండ్‌లో బయటపడిన నోట్ల గుట్టల కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏడాది క్రితం నాటి రూ.10వేల లంచం కేసులో తీగ లాగితే కరెన్సీ కొండలు కన్పించాయి.

Published : 07 May 2024 10:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సార్వత్రిక ఎన్నికల వేళ ఝార్ఖండ్‌ (Jharkhand) రాజధాని రాంచీలో గుట్టలుగా డబ్బులు బయటపడటం తీవ్ర కలకలం రేపుతోంది. రాష్ట్ర మంత్రి ప్రైవేటు కార్యదర్శి పనిమనిషి ఇంటి నుంచి ఈడీ (ED) అధికారులు సోమవారం రూ.32కోట్లను స్వాధీనం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ అవినీతి బండారం బయటికొచ్చింది రూ.10వేల లంచం కేసుతోనే..! ఏడాది క్రితం నాటి ఆ వ్యవహారాన్ని దర్యాప్తు చేయగా.. తాజా నోట్ల గుట్టలు వెలుగుచూశాయి.

గతేడాది ఫిబ్రవరిలో ఝార్ఖండ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ చీఫ్‌ ఇంజినీర్‌ వీరేంద్ర కుమార్‌ రామ్‌ను ఈడీ అరెస్టు చేసింది. రూ.10వేల లంచం తీసుకున్నాడన్న ఆరోపణలపై అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, అతడి వెనుక ఓ అవినీతి కొండే ఉందని నాడు దర్యాప్తు అధికారులు ఊహించివుండరు..! వీరేంద్రను విచారించగా ఈ హవాలా నెట్‌వర్క్‌ బయటపడింది. దర్యాప్తులో అతడు కీలక విషయాలను వెల్లడించినట్లు తెలుస్తోంది.

కాంట్రాక్టర్లకు టెండర్ల ఆశ జూపి వారి నుంచి భారీ మొత్తంగా డబ్బులు దండుకున్నట్లు వీరేంద్ర విచారణలో చెప్పినట్లు సమాచారం. ఇందులో తనతో పాటు చాలా మంది పెద్ద స్థాయి అధికారులు కూడా భాగస్వాములైనట్లు చెప్పాడు. మొత్తం టెండర్‌ విలువలో 3.2 శాతం కమిషన్‌ తీసుకోగా.. అందులో తన వాటా 0.3శాతమని వీరేంద్ర పేర్కొన్నాడు. అతడు ఇచ్చిన వాంగ్మూలంతో ఈడీ విస్తృత దర్యాప్తు చేపట్టింది.

ఝార్ఖండ్‌లో గదినిండా నోట్లకట్టలు

ఆ ఈడీ లేఖ.. నేటి సోదాల్లో..

అనంతరం గ్రామీణాభివృద్ధి శాఖలో భారీ ఎత్తున జరుగుతున్న అవినీతి గురించి గతేడాది మే నెలలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ రాంచీ విభాగం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి గోప్యంగా ఓ లేఖ రాసింది. గుత్తేదారుల నుంచి లంచాలు తీసుకోవడానికి సంబంధించి బహిర్గతమైన అంశాలపై స్వతంత్ర దర్యాప్తు చేయాలని, ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ఈడీ అందులో కోరింది. అయితే, దీనికి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఈడీ దర్యాప్తును కొనసాగించింది. ఈ క్రమంలోనే గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆలంగీర్‌ ఆలంపై నిఘా పెట్టి సోమవారం పలు చోట్ల సోదాలు నిర్వహించింది.

ఇందులో ఆలం ప్రైవేటు కార్యదర్శి(పీఎస్‌) సంజీవ్‌ లాల్‌ పనిమనిషి జహంగీర్‌ నివాసంలో జరిగిన తనిఖీల్లో ఈ నోట్ల గుట్టలు బయటపడ్డాయి. ఈ ఇంట్లో రూ.32 కోట్లు, మరో రెండు చోట్ల రూ.3కోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా.. నాడు రాష్ట్ర ప్రభుత్వానికి ఈడీ రాసిన లేఖ కూడా తాజా సోదాల్లో బయటపడటం గమనార్హం. ఈ కేసులో పీఎస్‌ సంజీవ్‌ లాల్‌, పనిమనిషి జహంగీర్‌ను అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలోనే మంత్రి ఆలంగీర్‌ను కూడా ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని