భలే భలే.. మట్టి ఏసీ!

హాయ్‌ నేస్తాలూ! మీకు ఏసీల గురించి తెలుసు కదా! వీటివల్ల గది ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. వేసవిలో ఎండలు, ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అంతవరకు బాగానే ఉంది కానీ.. ఈ ఏసీల వల్ల పర్యావరణానికి చాలా ఇబ్బంది.

Published : 16 Oct 2022 00:12 IST

హాయ్‌ నేస్తాలూ! మీకు ఏసీల గురించి తెలుసు కదా! వీటివల్ల గది ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. వేసవిలో ఎండలు, ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అంతవరకు బాగానే ఉంది కానీ.. ఈ ఏసీల వల్ల పర్యావరణానికి చాలా ఇబ్బంది. ఈ సమస్యకు పరిష్కారంగా.. దిల్లీకి చెందిన ఓ సంస్థ మట్టితో ఏసీని తయారు చేసింది. ‘మట్టితో ఏసీ ఏంటబ్బా?’ అని తెగ ఆలోచిస్తున్నారు కదా... ఈ కథనం చదివేయండి. మీకే తెలుస్తుంది.

మన దేశంలో వేసవిలో చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదవుతుంటాయి. దీని నుంచి బయటపడేందుకు జనాలు ఏసీలను ఆశ్రయిస్తుంటారు. కానీ ఇవి విడుదల చేసే కొన్ని రకాల వాయువులు పర్యావరణానికి ఎంతో కీడు చేస్తున్నాయి. ముఖ్యంగా ఓజోన్‌ పొర పలుచబడడానికీ కారణం అవుతున్నాయి. దీనికి పరిష్కారంగా దిల్లీకి చెందిన యాంట్‌ స్టూడియో అనే ఆర్కిటెక్‌ కంపెనీ వాళ్లు ఈ మట్టి ఎయిర్‌కండీషన్‌ను తక్కువ ఖర్చుతో తయారు చేశారు.

టెర్రకోటతో...

వీళ్లు ప్రత్యేకమైన కొలతల్లో టెర్రకోటతో గొట్టాల్లాంటి నిర్మాణాలు చేయించారు. వీటిని ఓ ఫ్రేమ్‌లో అమర్చారు. వీటిపైన నిత్యం నీళ్లు పడేలా ఏర్పాటు చేశారు. ఆ నీళ్లను ఈ టెర్రకోట గొట్టాలు పీల్చుకుంటాయి. తర్వాత వీటి గుండా ప్రవహించే వేడిగాలి, నీటి ప్రభావంతో చల్లగా మారుతుంది. దీంతో కొన్ని నిమిషాల్లోనే ఆ చుట్టుపక్కల ప్రాంతమంతా చల్లబడుతుంది.

డిగ్రీలకు డిగ్రీలే...

ఈ చల్లగాలి వల్ల గది ఉష్ణోగ్రత 6 నుంచి 7 డిగ్రీల వరకు తగ్గుతుంది. మామూలుగా కుండల్లో, కూజాల్లో ఉంచిన నీరు చల్లబడుతుంది అనే విషయం మనకు తెలిసిందే కదా. ఇక్కడ మాత్రం ఈ టెర్రకోట ఏసీ, గాలిని చల్లబరుస్తుందన్నమాట. దీంతో వేడి నుంచి ఉపశమనం దొరుకుతుంది. అందుబాటులో ఉన్న స్థలాన్ని బట్టి ఈ ఏసీని వివిధ పరిమాణాల్లో తయారు చేయించుకోవచ్చు.


పర్యావరణానికి ఎంతో మేలు..

ఓ అంచనా ప్రకారం 2050కల్లా మన దేశంలో ఉత్పత్తి అయిన విద్యుత్తులో దాదాపు 45శాతం ఏసీల కోసమే వినియోగిస్తారట. ఇది పర్యావరణానికి చాలా కీడు చేస్తుంది. ఏసీలు గదిని చల్లబరుస్తాయి కానీ, గ్లోబల్‌ వార్మింగ్‌కు, ఓజోన్‌ పొర క్షీణించడానికి కారణమవుతాయి. అదే ఈ టెర్రకోట ఏసీలనుకోండి... పర్యావరణానికి ఏ మాత్రం హాని చేయవు. ఇవి పూర్తిగా సంప్రదాయబద్ధమైన, పర్యావరణహితమైన మెటీరియల్‌తో తయారవుతాయి. దీంతో విద్యుత్తు వినియోగమూ భారీగా తగ్గుతుంది. విద్యుత్తు వినియోగం తగ్గిందంటే గాల్లోకి విడుదలయ్యే కార్బన్లూ తగ్గుతాయన్నమాట. మొత్తానికి ఈ మట్టి ఏసీ భలే ఉంది కదూ నేస్తాలూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని