శాంటాకీ నోరూరిద్దాం

రాబోయే క్రిస్మస్‌ రోజుల్లో.. తియ్యని కేకులు, పెప్పర్‌మెంట్‌ బార్‌లు.. చవులూరించే చికెన్‌... ప్రత్యేకమైన పుడ్డింగ్‌లతో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకు కమ్మని రుచులను పంచండి... ఈ వేడుకలను మరింత సంతోషభరితం చేసుకోండి...

Updated : 19 Dec 2021 06:47 IST

రాబోయే క్రిస్మస్‌ రోజుల్లో.. తియ్యని కేకులు, పెప్పర్‌మెంట్‌ బార్‌లు.. చవులూరించే చికెన్‌... ప్రత్యేకమైన పుడ్డింగ్‌లతో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకు కమ్మని రుచులను పంచండి... ఈ వేడుకలను మరింత సంతోషభరితం చేసుకోండి...


క్రిస్మస్‌ పుడ్డింగ్‌...

కావాల్సినవి: కరంట్‌ ఫ్రూట్స్‌- 150 గ్రా., రెసిన్స్‌, సుల్తానాస్‌- ముప్పావు కప్పు (ముక్కలుగా కోయాలి) చొప్పున, నారింజ తొక్కల పొడి- రెండు పెద్ద చెంచాలు, నిమ్మతొక్కల పొడి, బాదం/వాల్‌నట్‌ పొడి- రెండు చెంచాల చొప్పున, బ్రాందీ- అర కప్పు, ఉప్పు- తగినంత, బ్రెడ్‌ పొడి- రెండు కప్పులు, మైదా- 70 గ్రా., బేకింగ్‌ పౌడర్‌- అర చెంచా, డార్క్‌ బ్రౌన్‌ షుగర్‌- 165 గ్రా., దాల్చిన చెక్క, పొడి, మిక్స్‌డ్‌ స్పైస్‌- చెంచా చొప్పున, గుడ్లు- రెండు, పార్చ్‌మెంట్‌ పేపర్స్‌- కొన్ని.

తయారీ: పెద్ద గాజు పాత్రలో కిస్‌మిస్‌, కరంట్స్‌, రెసిన్స్‌, సుల్తానాస్‌, తరిగిన బాదం పలుకులు, నిమ్మతొక్కల పొడి...దాల్చిన చెక్క పొడి.. ఇలా అన్నింటినీ వేసి కలపాలి. ఈ మిశ్రమంలో బ్రాందీని జత చేయాలి. ఇలా ఒక రోజు ఉంచిన తర్వాత వైట్‌ బ్రెడ్‌ పొడి, మైదా, బేకింగ్‌ పౌడర్‌, దాల్చిన చెక్క, పొడి, మిక్స్‌డ్‌ స్పైస్‌, డార్క్‌ బ్రౌన్‌ షుగర్‌... వీటన్నింటినీ గిన్నెలో వేసి బాగా కలపాలి. మరో గిన్నెలో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్‌, చిన్న యాపిల్‌ పండు తురుము నిమ్మ, నారింజ తొక్కల తురుము, గుడ్లు వేసి బాగా కలపాలి. పై రెండు మిశ్రమాలను ఒకదాంట్లో మరొకటి బాగా కలపాలి. పుడ్డింగ్‌ మౌల్డ్‌లో  వెన్నను కాస్త ఎక్కువగానే రాయాలి. వీటిలో పై మిశ్రమాన్ని వేసి బాగా ఒత్తుతూ, గాలి బుడగలు లేకుండా చూసుకోవాలి. పార్చ్‌మెంట్‌ పేపర్‌కి వెన్న రాసి, దానిపై మిశ్రమం ఉంచాలి. ఈ సమయంలో కదలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

పెద్ద పాత్రలో నీళ్లు వేడి చేసి అందులో పుడ్డింగ్‌ మౌల్డ్స్‌ని ఉంచాలి. వీటికి పాత్రకి మధ్య ఒక వస్త్రపు ముక్కను మడిచి ఉంచాలి. ఇలా చేస్తే పుడ్డింగ్‌ మౌల్డ్‌ నీళ్లున్న పాత్ర తాకకుండా ఉంటుంది. కిందిభాగం మాడే అవకాశం ఉండదు. పాత్రపై మూత పెట్టి ఎనిమిది గంటలు సన్నని మంటపై నీళ్లు సరిచూసుకుంటూ వేడి చేయాలి. పూర్తిగా తయారైన పుడ్డింగ్‌ని నీళ్ల పాత్రలో నుంచి తీసి చల్లారనివ్వాలి. దీన్ని మరొక పాత్రలోకి మార్చుకోవాలి.


క్రిస్మస్‌ కేక్‌...

కావాల్సినవి: డ్రైఫ్రూట్స్‌ (కిస్‌మిస్‌, సుల్తానాస్‌, చెర్రీస్‌, క్రాన్‌ బెర్రీస్‌, కరంట్స్‌  ప్రూన్స్‌), కమలాపండు, పండు తొక్కల తురుము- రెండూ, నిమ్మకాయ, నిమ్మతొక్కల తురుము- రెండూ, బ్రాందీ- 150 ఎం.ఎల్‌., బటర్‌- 250 గ్రా., బ్రౌన్‌ షుగర్‌- 200 గ్రా., మైదా- 175 గ్రా., బాదంపొడి- 100 గ్రా., వెనిల్లా ఎస్సెన్స్‌- చెంచా, బేకింగ్‌ పౌడర్‌- అర చెంచా, లవంగం పొడి- పావు చెంచా, గుడ్లు- నాలుగు, మిక్స్‌డ్‌ స్పైస్‌, దాల్చినచెక్క పొడి- చెంచా, సన్నగా తరిగిన బాదంపప్పు- 100 గ్రా.,

తయారీ: డ్రైఫ్రూట్స్‌, కమలాపండు రసం, తొక్కల తురుము, నిమ్మరసం, ఆల్కహాల్‌, వెన్న, బ్రౌన్‌ షుగర్‌... ఇలా అన్నింటినీ పెద్ద పాన్‌లో వేసి సన్నని సెగ పై వేడి చేయాలి. నెమ్మదిగా ఐదు నిమిషాలు మరిగించాలి. ఆ తర్వాత మరో పెద్ద గిన్నెలోకి మార్చి చల్లార్చాలి.

అవెన్‌ని 150 డిగ్రీల సెంటిగ్రేడ్‌ వరకు వేడి చేయాలి. లోతుగా ఉన్న బేకింగ్‌ ట్రే (20 సెం.మీ. లోతు)లో డబుల్‌ లేయర్‌ పార్చ్‌మెంట్‌ పేపర్‌ వేయాలి. ఇప్పుడు మైదా, బాదంపిండి, బేకింగ్‌ పౌడర్‌, మిక్స్‌డ్‌ స్పైస్‌, దాల్చిన చెక్క పొడి, లవంగాల పొడి, బాదం పలుకులు, గుడ్లు, వెనిల్లా ఎసెన్స్‌పైన చెప్పిన ఫ్రూట్‌ మిక్చర్‌కి కలపాలి. పిండి పూర్తిగా కలిసేలా చూడాలి. మిశ్రమం బేకింగ్‌ ట్రేలో సమానంగా వచ్చేలా స్పాట్యూలాతో సర్ది ట్రేని అవెన్‌ మధ్యభాగంలో పెట్టి బేక్‌ చేయాలి. దీనికి రెండు గంటలు పడుతుంది. పూర్తిగా బేక్‌ అయిన తర్వాత ట్రేని బయటకు తీసి స్కీవర్‌తో రంధ్రాలు చేసి ఆల్కహాల్‌ని రెండు చెంచాలు వేసి కేక్‌ చల్లారడానికి పక్కన పెట్టాలి. పార్చ్‌మెంట్‌ పేపర్‌ చల్లారిన తర్వాత కేక్‌ నుంచి వేరు చేయాలి. ప్రతి వారం కేక్‌కి ఆల్కహాల్‌ కలపొచ్చు. కేక్‌పై ఐసింగ్‌ వేయడానికి వారం ముందు ఆల్కహాల్‌ కలపడం ఆపేయాలి. 


పెప్పర్‌మెంట్‌ బార్క్‌..

కావాల్సినవి: సన్నగా తరిగిన చాక్లెట్‌ (సెమీస్వీట్‌), వైట్‌ చాక్లెట్‌ ముక్కల తరుగు- 340 గ్రా., చొప్పున, పెప్పర్‌ మెంట్‌ ఎక్స్‌ట్రాక్ట్‌- అర చెంచా, క్రష్డ్‌ క్యాండీస్‌- కొన్ని.

తయారీ: బేకింగ్‌ షీట్‌పై పార్చ్‌మెంట్‌ పేపర్‌ని ఉంచాలి. పెద్ద పాత్రలో మూడు అంగుళాల వరకు నీళ్లు నింపి చిన్నమంటపై వేడిచేయాలి. హీట్‌ప్రూఫ్‌ పాత్రని దానిపై ఉంచాలి. ఆ పాత్రలో సెమీస్వీట్‌ చాక్లెట్‌ వేసి నెమ్మదిగా కలుపుతూ కరిగించాలి. కరిగిన చాక్లెట్‌ను బేకింగ్‌ షీట్‌పైన ఉన్న పార్చ్‌మెంట్‌ షీట్‌పై వేసి పలుచగా సమానంగా వచ్చేలా స్ప్రెడ్‌ చేసి ఫ్రిజ్‌లో 20 ని., పెట్టాలి. ఇప్పుడు మళ్లీ నీళ్లు వేడిచేసి మరోపాత్ర దానిపై ఉంచి వైట్‌ చాక్లెట్‌ వేసి  కరిగించాలి. కరిగిన చాక్లెట్‌లో పెప్పర్‌మెంట్‌ ఎస్సెన్స్‌ కలిపి సెమీస్వీట్‌ చాక్లెట్‌ లేయర్‌పై సమానమైన లేయర్‌గా వేసుకోవాలి. మళ్లీ రిఫ్రిజిరేటర్‌లో ఇరవై నిమిషాలు పెట్టాలి. మొదటి పొరపై క్రష్డ్‌ క్యాండీ కేన్స్‌ని కూడా వేసుకోవాలి. పదునైన చాకుతో చక్కటి ఆకారంలో కోసుకుంటే బాగుంటుంది.


క్లాసిక్‌ రోస్టెడ్‌ చికెన్‌

కావాల్సినవి: చికెన్‌- కిలోన్నర (మొత్తం కోడి), ఉల్లిపాయలు, క్యారెట్లు, సెలెరీ, బంగాళాదుంప, వెల్లుల్లి- పావు కప్పు చొప్పున, నూనె- తగినంత, థైమ్‌- కొద్దిగా, బటర్‌- పావు కప్పు.

తయారీ: చికెన్‌ను శుభ్రంచేసి ఉప్పు, మిరియాల పొడి రుద్దాలి. కోడి కాళ్లను దగ్గరగా దారంతో కట్టి రెక్కలు కిందికి వచ్చేవిధంగా చేసుకోవాలి. వీలైతే ఈ చికెన్‌ని రాత్రంతా ఫ్రిజ్‌లో పెట్టాలి. లేదా కనీసం రెండు మూడు గంటలైనా ఉంచాలి. ముందుగా అవెన్‌ని 425 డిగ్రీల వరకు ప్రీహీట్‌ చేసుకోవాలి. 9 ఇంచులు బై 13 ఇంచులున్న బేకింగ్‌ పాత్ర తీసుకుని దాంట్లో ఉల్లిపాయలు, క్యారెట్లు, సెలెరీ, బంగాళాదుంప, వెల్లుల్లి వేసి నూనెతో కలపాలి. ఉప్పును జత చేయాలి. ఆ తర్వాత చికెన్‌ని కూరగాయల ముక్కలపై ఉంచాలి. చికెన్‌పై కరిగించిన వెన్నని బ్రష్‌తో పూర్తిగా  రాయాలి. చికెన్‌ లోపలికి థైమ్‌ని ఉంచాలి. దీన్ని అవెన్‌లో జ్యూస్‌ వచ్చేవరకు రోస్ట్‌ చేయాలి. చికెన్‌ మధ్యలో 160 డిగ్రీలు వచ్చేవరకు రోస్ట్‌ చేయాలి. దీనికి దాదాపు గంట పడుతుంది.రోస్ట్‌ చేసిన చికెన్‌ని అవెన్‌ నుంచి తీసి ఫాయిల్‌తో కప్పి ఉంచాలి. 15 నుంచి 20 నిమిషాల తర్వాత ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. దీన్ని కూరగాయ ముక్కలతోపాటు సర్వ్‌ చేసుకోవాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని