ప్రేమ ఇంత మధురం!

నోరూరించే  రెడ్‌ వెల్వెట్‌ కేక్‌... తేనెలూరే చికెన్‌ వింగ్స్‌... మధురమైన ఆప్రికాట్‌ డిలైట్‌... యమ్మీ యమ్మీ కాజు చాక్లెట్‌... ప్రేమికుల పండగ నాడు మీ  ప్రేమను తెలపడంతోపాటు...

Updated : 13 Feb 2022 03:26 IST

నోరూరించే  రెడ్‌ వెల్వెట్‌ కేక్‌... తేనెలూరే చికెన్‌ వింగ్స్‌... మధురమైన ఆప్రికాట్‌ డిలైట్‌... యమ్మీ యమ్మీ కాజు చాక్లెట్‌... ప్రేమికుల పండగ నాడు మీ  ప్రేమను తెలపడంతోపాటు... మనసైన వారికి తియ్యటి రుచులను తినిపించేయండి మరి. వీటిని అవెన్‌ తదితర ప్రత్యేక పరికరాలు లేకుండా అందరూ చేసుకోవచ్చు.

రెడ్‌ వెల్వెట్‌ కేక్‌...

కావాల్సినవి:  వెన్న- అర కప్పు, చక్కెర పొడి (ఐసింగ్‌ షుగర్‌)- ఒకటిన్నర కప్పు, గుడ్లు- రెండు, కోకో పొడి- రెండు పెద్ద చెంచాలు, రెడ్‌ ఫుడ్‌ కలర్‌- పెద్ద చెంచా, ఉప్పు, వెనిల్లా ఎస్సెన్స్‌- చెంచా చొప్పున; చిక్కటి మజ్జిగ- కప్పు, మైదా- రెండున్నర కప్పులు, వంట సోడా- ఒకటిన్నర కప్పు, వెనిగర్‌- పెద్ద చెంచా. అలంకరణకు... చక్కెర పొడి- రెండు పెద్ద చెంచాలు, స్ట్రాబెర్రీలు- పన్నెండు.

తయారీ: కుక్కర్‌లో రెండు అంగుళాల వరకు ఉప్పు వేసి ముందుగా వేడి (ప్రీ హీట్‌) చేసుకోవాలి. గాజు పాత్రలో వెన్న, చక్కెర పొడి, గుడ్లు వేసి బాగా కలపాలి. ఇందులో కోకో పొడి, వంటసోడా రెడ్‌ ఫుడ్‌ కలర్‌, తగినంత ఉప్పు, వెనిల్లా ఎస్సెన్స్‌, మజ్జిగ వేసి మరోసారి బాగా కలపాలి. మైదాని జోడించి అన్ని పదార్థాలు చక్కగా కలిసిపోయేలా చూడాలి. చివరగా వెనిగర్‌ను కేక్‌ మిశ్రమంలో కలిపి మెత్తగా చేసుకుని బేకింగ్‌ పాన్‌లోకి తీసుకోవాలి. ఆ తర్వాత కదిలించొద్దు. దీన్ని కుక్కర్‌లో ఉంచి, గాస్కెట్‌ లేకుండా మూత పెట్టి 45 నుంచి 50 నిమిషాల వరకు బేక్‌ చేసుకోవాలి. కేక్‌ను పూర్తిగా చల్లార్చుకోవాలి. కేక్‌ పైన చక్కెర పొడి, చెర్రీలు లేదా స్ట్రాబెర్రీలతో అలంకరించి వడ్డించాలి.


ఆప్రికాట్‌ డిలైట్‌...

కావాల్సినవి: డ్రై ఆప్రికాట్‌లు- 200 గ్రా., చక్కెర- కప్పు, పాలు- 500 మి.లీ., కస్టర్డ్‌ పౌడర్‌- మూడు పెద్ద చెంచాలు, విప్డ్‌ క్రీమ్‌- అర కప్పు, వెనిలా ఎసెన్స్‌- అర చెంచా, చెర్రీలు- పన్నెండు, పుదీనా ఆకులు- గుప్పెడు.

తయారీ: ఆప్రికాట్లను ఏడెనిమిది గంటలు నీటిలో నానబెట్టుకోవాలి. ఆ తర్వాత పండ్ల నుంచి విత్తనాలను తీసేయాలి. వాటిని నానబెట్టిన నీళ్లలోనే ఉడికించాలి. అవి మెత్తగా మారాక చక్కెర జత చేయాలి. కాసేపయ్యాక చట్నీలా చిక్కగా అవుతుంది. దీన్ని చల్లార్చి పక్కన పెట్టాలి.

వెనిల్లా రుచి ఉన్న కస్టర్డ్‌ కోసం... పాలను ముప్పావు వంతు వచ్చే వరకు మరిగించాలి. మంట తగ్గించి చక్కెర వేయాలి. కొన్ని చల్లని పాలలో కస్టర్డ్‌ పౌడర్‌ కలపాలి. ఈ మిశ్రమాన్ని మరిగించిన పాలలో వేసి బాగా కలపాలి. వెనిల్లా ఎసెన్స్‌ను జోడించి మరికాసేపు కలియబెట్టాలి. ఆ తర్వాత చల్లార్చాలి. ఇప్పుడు చిన్న సర్వింగ్‌ గ్లాసులు తీసుకుని దాంట్లో ఆప్రికాట్‌ పేస్ట్‌ను మొదట పొరగా, ఆ తర్వాత కస్టర్డ్‌ను ఉంచాలి, దానిపై విప్డ్‌ క్రీమ్‌, చెర్రీ, పుదీనా ఆకులతో అలంకరించుకుని చల్లగా సర్వ్‌ చేసుకుంటే సరి


జీడిపప్పు చాక్లెట్‌...

కావాల్సినవి: జీడిపప్పు- అర కప్పు, డార్క్‌ చాక్లెట్‌ బార్‌- ఒకటి.

తయారీ: పాన్‌లో జీడిపప్పు వేసి లేత బంగారు రంగు వచ్చే వరకు మంటను మధ్యస్థంగా పెట్టి మూడు నుంచి అయిదు నిమిషాలు వేయించి గిన్నెలోకి తీసుకోవాలి. మరుగుతున్న నీళ్లపై డబుల్‌ బాయిలర్‌పైన చాక్లెట్‌ బార్‌ను కరిగించాలి. ఇందుకోసం దాదాపు అయిదు నిమిషాలు కలుపుతూనే ఉండాలి. ఈ మిశ్రమాన్ని బయటకు తీసి జీడిపప్పులో పోయాలి. సమానంగా కోటింగ్‌ జీడిపప్పునకు పట్టేలా కలపాలి. బటర్‌ పేపర్‌పై చాక్లెట్‌- జీడిపప్పు మిశ్రమాన్ని చెంచా సాయంతో ముద్దగా వేసుకుని చల్లార్చి, పది నిమిషాలు ఫ్రిజ్‌లో పెట్టాలి. అంతే తియ్యటి, రుచికరమైన జీడిపప్పు చాక్లెట్లు రెడీ. తినడమే తరువాయి.


హనీ చికెన్‌ వింగ్స్‌...

కావాల్సినవి:  చికెన్‌ వింగ్స్‌- అర కిలో, అల్లంవెల్లుల్లి ముద్ద, పసుపు, గరంమసాలా- చెంచా చొప్పున; ఉల్లిపాయ ముద్ద, కారం, మిరియాల పొడి- అర చెంచా చొప్పున; నిమ్మరసం- నాలుగు చెంచాలు, వెనిగర్‌- మూడు పెద్ద చెంచాలు.

వేయించడానికి... ఆలివ్‌ నూనె- మూడు పెద్ద చెంచాలు, తేనె- రెండు చెంచాలు, ఉప్పు- రుచికి సరిపడా.

తయారీ: వేయించే పదార్థాలు తప్ప గిన్నెలో చికెన్‌ వింగ్స్‌తోపాటు పై పదార్థాలన్నింటినీ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని రెండు గంటలపాటు ఫ్రిజ్‌లో పెట్టాలి. ఆ తర్వాత బాణలిలో నూనె పోసి చికెన్‌ వింగ్స్‌ని వేసి నిమిషంపాటు వేయించాలి. దీనికి నిమ్మరసం, తేనె జోడించి బాగా కలిపి పది నిమిషాలు ఉడికించాలి. వేడిగా తింటే చాలా బాగుంటాయి.


వాటర్‌మెలన్‌ మోజిటో...

కావాల్సినవి: పుచ్చకాయ ఒకటి (300 గ్రా.,) పుదీనా ఆకులు- పావు కప్పు, నిమ్మరసం- అర కప్పు, చక్కెర- నాలుగు పెద్ద చెంచాలు, చిల్డ్‌ క్లబ్‌ సోడా, ఐస్‌ క్యూబ్స్‌ (కావాలనుకుంటే), లైమ్‌ రిండ్‌- నాలుగు.

తయారీ: పెద్ద జ్యూసర్‌ జార్‌లో పుచ్చకాయ ముక్కలు వేసి రసం తీసి వడగట్టుకుని పక్కన పెట్టుకోవాలి. గాజు పాత్రలో పుదీనా వేసి చెక్క చెంచాతో గుజ్జుగా చేసుకోవాలి. ఆ తర్వాత చక్కెర, నిమ్మరసం వేసి కరిగే వరకు కలపాలి. నాలుగు పొడవాటి గ్లాసులను తీసుకుని వాటిలో ప్రతిదాంట్లో రెండు మూడు ఐస్‌ క్యూబ్‌లు, కొన్ని పుదీనా ఆకులను వేయాలి. సగం గ్లాసును పుచ్చకాయ రసంతో, మిగతా సగం క్లబ్‌ సోడాతో నింపి పుచ్చకాయ ముక్క, పుదీనా ఆకులు, లైమ్‌ రిండ్‌ (నిమ్మ తొక్క) అలంకరించుకోవాలి. అంతే పుచ్చకాయ మోజిటో సిద్ధం. దీన్ని వెంటనే సర్వ్‌ చేసుకోవాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని