మనసు చీజైపోతుంది!

మళ్లీ మళ్లీ కావాలనిపించే క్రిస్పీ చీజ్‌ రోల్స్‌... వన్స్‌ మోర్‌ అనిపించే చీజ్‌ బాల్స్‌, కప్‌ కేక్స్‌... పోషకాల స్టఫ్‌... చీజ్‌ స్టఫ్డ్‌ మష్రూమ్‌ .. ఈ వారం మెనూ... చీజ్‌మయం! ఈ క్రీమీ క్రీమీ... యమ్మీ యమ్మీ వంటకాలను  రుచి చూస్తే  మీ నోరూరి పోతుంది. చీజ్‌లో మాంసకృత్తులు, పిండిపదార్థాలు, కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. వీటిలోని ప్రొటీన్లు ఎముకలు ఆరోగ్యంగా, దృఢంగా ఉండేందుకు, కొవ్వులు శరీరంలో మంచి కొవ్వు పెరుగుదలకు తోడ్పడతాయి.

Updated : 27 Feb 2022 06:19 IST

మళ్లీ మళ్లీ కావాలనిపించే క్రిస్పీ చీజ్‌ రోల్స్‌...
వన్స్‌ మోర్‌ అనిపించే చీజ్‌ బాల్స్‌, కప్‌ కేక్స్‌...
పోషకాల స్టఫ్‌... చీజ్‌ స్టఫ్డ్‌ మష్రూమ్‌ ..
ఈ వారం మెనూ... చీజ్‌మయం!
ఈ క్రీమీ క్రీమీ...యమ్మీ యమ్మీ వంటకాలను రుచి చూస్తే  మీ నోరూరి పోతుంది.

లాభాలేంటి?

* చీజ్‌లో మాంసకృత్తులు, పిండిపదార్థాలు, కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. వీటిలోని ప్రొటీన్లు ఎముకలు ఆరోగ్యంగా, దృఢంగా ఉండేందుకు, కొవ్వులు శరీరంలో మంచి కొవ్వు పెరుగుదలకు తోడ్పడతాయి. వేపుళ్లతో పోలిస్తే పాల ద్వారా వచ్చే చీజ్‌లోని కొవ్వులు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. దీంట్లో గుడ్డు కంటే తక్కువ కొలెస్ట్రాల్‌ ఉంటుంది. అయితే మోతాదు మించి తీసుకోవద్దు.
* విటమిన్‌ ఎ కంటి ఆరోగ్యాన్ని కాపాడితే బి12 గుండెను రక్షిస్తుంది.
* క్యాల్షియం ఎముకలు, కండరాల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఫాస్ఫరస్‌... శరీర కణాలు మరింత సమర్ధంగా పనిచేయడానికి, జింక్‌.. మెదడు చురుగ్గా ఉండటానికి, ఇమ్యూనిటీని పెంచడంలో తోడ్పడతాయి. దీంట్లో ప్రొబయోటిక్‌ సమృద్ధిగా ఉంటుంది. ఇది జీర్ణాశయానికి మేలు చేస్తుంది.
* చీజ్‌ను ఆవు, గేదె, మేకపాల నుంచి తయారు చేస్తారు.
* చీజ్‌లో కాటేజ్‌, చెద్దర్‌, పారమేసన్‌, మొజరెల్లా.... ఇలా బోలెడు రకాలున్నాయి. ఎక్కువగా వాడే రకం మొజరెల్లా...
* ఇన్ని పోషకాలున్న చీజ్‌ను వంటకాలుగానే కాకుండా చపాతీ, ఆమ్లెట్‌, మరెన్నింటిలోనో వేసి పిల్లలకు పెడితే ఇష్టంగా తింటారు. ఆరోగ్యానికీ, ఎదుగుదలకూ మంచిది. కొవ్వుశాతం కాస్త ఎక్కువే అయినా మితంగా తీసుకుంటే మంచిదంటున్నారు పోషకాహార నిపుణులు.


చిల్లీ చీజ్‌ టోస్ట్‌...

కావాల్సినవి: బ్రెడ్‌ స్లైస్‌లు- నాలుగు, చీజ్‌- 100 గ్రా., అన్‌సాల్టెడ్‌ బటర్‌- మూడు పెద్ద చెంచాలు, వెల్లుల్లి రెబ్బలు- మూడు(తరగాలి), పచ్చిమిర్చీ- రెండు(తరగాలి), చిల్లీ ఫ్లేక్స్‌- కొన్ని, అరిగానో- చిటికెడు (కావాలనుకుంటే).

తయారీ: గిన్నెలో బటర్‌, వెల్లుల్లి తరుగు, గింజలు తీసేసిన పచ్చిమిర్చి తరుగు వేసి బాగా కలపాలి. బటర్‌ను గది ఉష్ణోగ్రత వద్ద పూర్తిగా కరిగే వరకు కలపాలి. బ్రెడ్‌ స్లైస్‌లపై ఈ మిశ్రమాన్ని రాయాలి. వీటిపై చీజ్‌ను సన్నగా తురమాలి. ఆపై చిల్లీ ఫ్లేక్స్‌ను చల్లుకోవాలి. అందుబాటులో ఉంటే అరిగానోను కూడా వేసుకోవచ్చు. పొయ్యి మీద పాన్‌ పెట్టి ఈ బ్రెడ్‌ స్లైస్‌లను అందులో పెట్టి మూత పెట్టాలి. చిన్న మంటపై చీజ్‌ కరిగే వరకు వేడి చేయాలి. అంతే నోరూరించే యమ్మీ చిల్లీ చీజ్‌ టోస్ట్‌ రెడీ. ఒక్కో    స్లైస్‌ను త్రికోణాకారంలో రెండు ముక్కలుగా కోసి టొమాటో కెచప్‌తో తింటే బాగుంటాయి.


పరాఠా...

కావాల్సినవి: తురిమిన మొజరెల్లా చీజ్‌- కప్పు, తురిమిన చెద్దర్‌ చీజ్‌- అర కప్పు, ఉల్లిపాయ- ఒకటి (తరగాలి), పచ్చిమిర్చీ- నాలుగు, (తరగాలి), వెలుల్లి రెబ్బలు- మూడు (తరగాలి), అల్లం, కొత్తిమీర తరుగు- చెంచా చొప్పున; పుదీనా- కొద్దిగా, మిరియాల, జీలకర్ర పొడి- చెంచా చొప్పున; నెయ్యి, ఉప్పు- తగినంత, చపాతీపిండి- కావాల్సినంత.

తయారీ: పెద్ద గిన్నెలో తురిమిన మొజరెల్లా చీజ్‌, చెద్దర్‌ చీజ్‌లతోపాటు మిగతా పదార్థాలన్నీ వేసి బాగా కలిపి ముద్ద చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీలను చేసుకోవాలి. ఒక చపాతీపై తయారుచేసి పెట్టుకున్న చీజ్‌ మిశ్రమం పరిచి మరో చపాతీతో మూసేయాలి. అంచులను జాగ్రత్తగా ఒత్తుకోవాలి. దీన్ని పెనంపై వేసి రెండు వైపులా చిన్నమంటపై నెయ్యి వేస్తూ చక్కగా కాల్చుకోవాలి.


క్రిస్పీ చీజ్‌ రోల్స్‌...

కావాల్సినవి: ఉడికించిన బంగాళాదుంపలు- నాలుగు, క్యాప్సికమ్‌, పచ్చిమిర్చి, క్యారెట్‌, ఉల్లిపాయ, నిమ్మకాయ- ఒక్కోటి చొప్పున, నూనె- సరిపడా, ఉప్పు- తగినంత, చీజ్‌ తరుగు- అర కప్పు, కొత్తిమీర తరుగు- రెండు చెంచాలు, అరిగానో- అర చెంచా, చిల్లీ ఫ్లేక్స్‌- కొన్ని, గరంమసాలా, మిరియాల పొడి- పావు చెంచా చొప్పున, పసుపు- చిటికెడు, మొక్కజొన్న పిండి- రెండు చెంచాలు, మైదా- ముప్పావు కప్పు, బ్రెడ్‌ క్రంబ్స్‌- కప్పు.

తయారీ: ఆలూను సన్నగా తురిమి పెద్ద గిన్నెలో తీసుకోవాలి. దీంతోపాటు, క్యాప్సికమ్‌, క్యారెట్‌, పచ్చిమిర్చీ తురుము, చిన్నగా కోసిన ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. ఇందులోనే కాస్తంత అరిగానో, చిల్లీఫ్లేక్స్‌, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, మసాలా, కొత్తిమీర తరుగు, చెంచా నూనె వేసి పక్కన పెట్టుకోవాలి. మరో చిన్న గిన్నెలో కొద్దిగా మొక్కజొన్న పిండి (ఈ పిండి లేకపోతే మైదాని వాడుకోవచ్చు), మిరియాల పొడి, సరిపడా ఉప్పు, కాసిన్ని నీళ్లు పోసి ఉండలు లేకుండా చక్కగా కలిపి పక్కన పెట్టుకోవాలి. చీజ్‌ను చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. ఇందాక తయారుచేసిపెట్టుకున్న ఆలూ, కూరగాయల తరుగు మిశ్రమంలో ముప్పావు కప్పు మైదా పిండి వేయాలి. (కావాలనుకుంటే సగం కప్పు చొప్పున మైదా, బియ్యప్పిండి రెండింటినీ వేసుకోవచ్చు.) తగినన్ని నీళ్లు పోస్తూ చపాతీ పిండిలా కలిపి పెట్టుకోవాలి. చేతికి నూనె రాసుకుని తయారుచేసి పెట్టుకున్న చపాతీపిండిని వడల్లా చేసి, అందులో చీజ్‌ను పెట్టి అంచులు మూసేయాలి. వాటిని స్తూపాకార ముద్దల్లా చేసుకుని.. మొదట కార్న్‌ఫ్లోర్‌ ద్రవంలో ముంచి, బ్రెడ్‌ పొడిలో దొర్లించాలి. ఆ తర్వాత కాగే నూనెలో వేసి మంటను మధ్యస్థంగా పెట్టి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. సాయంకాలం చేసిపెడితే చిన్నారులు ఇష్టంగా తింటారు.


చీజ్‌ కప్‌ కేక్స్‌...

కావాల్సినవి: బిస్కెట్‌ పొడి- కప్పు, బటర్‌- పెద్ద చెంచా, తురిమిన చీజ్‌- కప్పు, కండెన్స్‌డ్‌ మిల్క్‌- రెండు చెంచాలు, పంచదార పొడి- పెద్ద చెంచా, గడ్డ పెరుగు- అర కప్పు, తేనె- పావు కప్పు, అరటిపండు, కివీ, సపోటా, ద్రాక్ష, యాపిల్‌ ముక్కలు- కొన్నేసి.

తయారీ: పొయ్యి మీద పాన్‌ పెట్టి బటర్‌ వేసి, వేడయ్యాక బిస్కెట్‌ పొడి వేసి వేయించాలి. ఈ పొడిని చిన్న గాజు కప్పుల్లో రెండు చెంచాల చొప్పున వేసి గట్టిగా అదమాలి. మరో పెద్ద గిన్నెలో తరిగిన చీజ్‌ను వేసి బాగా కలపాలి. దీంట్లో గడ్డపెరుగును కలపాలి. కండెన్స్‌డ్‌ మిల్క్‌, పంచదార పొడి, చక్కెర వేసి మరోసారి బాగా కలిపి పక్కన పెట్టాలి. చిన్న గిన్నెలో పండ్ల ముక్కలన్నీ తీసుకోవాలి. తేనె చేర్చి కలపాలి. తయారుచేసి పెట్టుకున్న బిస్కెట్‌ పొరపై చీజ్‌ మిశ్రమాన్ని (రెండు చెంచాల చొప్పున) వేసుకోవాలి. పై పొరగా పండ్ల ముక్కలను వేసి కొంచెం లోపలికి అదమాలి. చివరగా దానిమ్మ గింజలతో అలంకరించుకోవాలి. తింటే ఆరోగ్యం, రుచి రెండూ అందుతాయి.


చీజ్‌ స్టఫ్డ్‌ మష్రూమ్‌...

కావాల్సినవి: బటన్‌ మష్రూమ్స్‌- 100 గ్రా., చీజ్‌- అర కప్పు, జీలకర్ర- సగం చెంచా, పచ్చిమిర్చీ, అల్లం, వెల్లుల్లి తరుగు- చెంచా చొప్పున; ఉల్లిపాయ ముక్కలు- కప్పు, టొమాటో ముక్కలు- అర కప్పు, కారం- చెంచా, పసుపు- పావు చెంచా, ఉప్పు- తగినంత, నూనె- పావు కప్పు, మిరియాల పొడి- కొద్దిగా.

తయారీ: పుట్టగొడుగుల కాడలు తీసేసి, లోపలి భాగాన్ని పూర్తిగా తొలగించి చిన్న గిన్నెల్లా చేసుకోవాలి. కాడలను చిన్న ముక్కలుగా తరగాలి. పొయ్యి మీద కడాయి పెట్టి నూనె వేసి జీలకర్ర, పచ్చిమిర్చీ, అల్లం, వెల్లుల్లి తరుగు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలను జత చేయాలి. ఉప్పు వేస్తే త్వరగా ఉడుకుతాయి. వీటిని బాగా కలిపి, టొమాటో ముక్కలు, కారం, పసుపును జత చేయాలి. వీటితోపాటు పుట్టగొడుగుల ముక్కల తరుగునూ వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర జత చేయాలి. ప్రాసెస్డ్‌ చీజ్‌ను తురిమి, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం బాగా ఉడికిన తర్వాత కొద్దిగా తీసుకుని బటన్‌ మష్రూమ్స్‌లో నింపాలి. ఇప్పుడు మరోసారి పొయ్యి వెలిగించి కడాయి పెట్టి కొద్దిగా నూనె వేసుకోవాలి. పుట్టగొడుగులన్నింటినీ వేసి మూత పెట్టి మంటను మధ్యస్థంగా పెట్టి పుట్టగొడుగులను ఉడికించాలి. అంతే చీజ్‌మయమైన మష్రూమ్స్‌.. తినడానికి సిద్ధం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని