తియ్యని కచోరీ తిందామా!

కొత్త ఏడాది వచ్చిందంటే పండగ సీజను మొదలైనట్లే. వచ్చీపోయే అతిథులతో ఇల్లు కళకళలాడుతుంది. ఈ సమయంలో మీరు చేసే పదార్థాల్లో స్వీటూ హాటూ తప్పనిసరిగా ఉండాల్సిందే కాబట్టి వీటినీ ప్రయత్నించి చూడండి.

Published : 26 Jun 2021 15:12 IST

కొత్త ఏడాది వచ్చిందంటే పండగ సీజను మొదలైనట్లే. వచ్చీపోయే అతిథులతో ఇల్లు కళకళలాడుతుంది. ఈ సమయంలో మీరు చేసే పదార్థాల్లో స్వీటూ హాటూ తప్పనిసరిగా ఉండాల్సిందే కాబట్టి వీటినీ ప్రయత్నించి చూడండి.


ఫార్సీ ఖమన్‌ పూరీ

కావలసినవి
మైదా: రెండు కప్పులు, ఉప్పు: తగినంత, కలోంజీ గింజలు: చెంచా, నెయ్యి: రెండు పెద్ద చెంచాలు, ఎండు పుదీనా ఆకుల పొడి: ఒకటిన్నర చెంచా, కారం: చెంచా, ఆమ్‌చూర్‌పొడి: చెంచా, చాట్‌మసాలా: రెండు చెంచాలు, నల్ల ఉప్పు: చెంచా, నూనె: వేయించేందుకు సరిపడా.

తయారుచేసే విధానం
* ఓ పెద్ద గిన్నెలో మైదా, కలోంజీ గింజలు, నెయ్యి తీసుకుని బాగా కలపాలి. తరువాత నీళ్లు పోసుకుంటూ పూరీ పిండిలా కలిపి పెట్టుకోవాలి. అరగంట నానాక.. నిమ్మకాయంత ఉండల్లా చేసుకోవాలి. ఒక ఉండను తీసుకుని మందంగా, చిన్న చపాతీలా వత్తుకుని, ఫోర్కుతో అక్కడక్కడా గాట్లు పెట్టుకోవాలి. దీన్ని మధ్యకు అడ్డంగా, తరువాత నిలువుగా మడిచి అంచులు నొక్కినట్లు చేయాలి. ఇలా మిగిలినవీ చేసుకుని, మూడుచొప్పున కాగే నూనెలో వేసి వేయించి తీయాలి.
* మరో గిన్నెలో ఎండుపుదీనా ఆకుల పొడి, కారం, ఉప్పు, ఆమ్‌చూర్‌పొడి, చాట్‌మసాలా, నల్ల ఉప్పు తీసుకుని అన్నింటినీ కలపాలి. ఈ మసాలాను బిస్కెట్లపై చల్లితే సరిపోతుంది.


షాహీ కచోరీ

కావలసినవి
మైదా: ఒకటిన్నర కప్పు, నెయ్యి: రెండు పెద్ద చెంచాలు, నూనె వేయించేందుకు సరిపడా. ఫిల్లింగ్‌కోసం - కోవా: కప్పు, జీడిపప్పు, పిస్తా, బాదం, వాల్‌నట్లపొడి: కప్పు, చక్కెర: అరకప్పు, యాలకులపొడి: అరచెంచా. పాకంకోసం - చక్కెర: అరకప్పు, నీళ్లు: అరకప్పు.

తయారుచేసే విధానం
* ఓ గిన్నెలో మైదా, నెయ్యి తీసుకుని కలిపి... నీళ్లు పోసుకుంటూ పూరీ పిండిలా కలిపి పెట్టుకుని పావుగంటసేపు నాననివ్వాలి. చక్కెరా నీళ్లూ ఓ గిన్నెలోకి తీసుకుని స్టౌమీద పెట్టాలి. చక్కెర కరిగి తీగ పాకం వచ్చాక దింపేయాలి.
* ఓ గిన్నెలో ఫిల్లింగ్‌ కోసం తీసుకున్న పదార్థాలన్నింటినీ కలుపుకోవాలి. మైదా పిండిని చిన్నచిన్న ఉండల్లా చేసుకోవాలి. ఒకదాన్ని తీసుకుని చిన్న చపాతీలా వత్తి.. మధ్యలో కోవా మిశ్రమాన్ని ఉంచి, అంచులు మూసేయాలి. ఇలా మిగిలిన పిండీ చేసుకోవాలి. రెండు చొప్పున కచోరీలను కాగుతోన్న నూనెలో వేసి వేయించుకుని తీసుకోవాలి.
* ఇలా అన్నీ వేయించుకుని ఒక్కోదాన్నీ చక్కెరపాకంలో ముంచి తీయాలి.


కేసరి లడ్డు

కావలసినవి
బియ్యం: అరకప్పు, మినప్పప్పు: రెండు పెద్ద చెంచాలు, చక్కెర: ఒకటింబావు కప్పు, ఆరెంజ్‌ ఫుడ్‌ కలర్‌: చిటికెడు, ఉప్పు: చిటికెడు, వంటసోడా: పావుచెంచా, నూనె: వేయించేందుకు సరిపడా.

తయారుచేసే విధానం
* బియ్యం, మినప్పప్పును నాలుగుగంటలసేపు నానబెట్టుకుని నీళ్లు వంపేసి ఉప్పు, రెండు పెద్ద చెంచాల నీళ్లు కలిపి మిక్సీలో మెత్తని పిండిలా చేసుకోవాలి. ఇందులో ఆరెంజ్‌ ఫుడ్‌కలర్‌, వంటసోడా కలిపి పెట్టుకోవాలి.
* ఓ గిన్నెలో అరకప్పు నీళ్లూ కప్పు చక్కెరా తీసుకుని స్టౌమీద పెట్టాలి. చక్కెర కరిగి పాకంలా తయారవుతున్నప్పుడు దింపేసి పెట్టుకోవాలి. మిగిలిన పావుకప్పు చక్కెరను పొడిలా చేసుకోవాలి.
* ఇప్పుడు పొయ్యిమీద బాణలి పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక బియ్యప్పిండిని చిన్నచిన్న ఉండల్లా చేసి నూనెలో వేసి ఎర్రగా అయ్యాక తీసేసి చక్కెరపాకంలో వేసుకోవాలి. ఈ ఉండలకు పాకం పట్టాక ఒక్కొక్కటిగా తీసి, చక్కెరపొడిలో ముంచి మరో గిన్నెలో వేసుకోవాలి.


కారం బిస్కెట్లు

కావలసినవి
బియ్యప్పిండి: కప్పు, మైదాపిండి: పావుకప్పు, ఉప్పు: కొద్దిగా, అల్లంతురుము: చెంచా, కరివేపాకు రెబ్బలు: రెండు, కొత్తిమీర తరుగు: రెండు పెద్ద చెంచాలు, పచ్చిమిర్చి: రెండు, పెరుగు: రెండు పెద్ద చెంచాలు, నూనె: వేయించేందుకు సరిపడా.

తయారుచేసే విధానం
* బియ్యప్పిండి, మైదాపిండి, ఉప్పు, అల్లంతురుము, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర, కరివేపాకు ఓ గిన్నెలోకి తీసుకుని అన్నింటినీ బాగా కలపాలి. ఇందులో పెరుగూ కలిపాక నీళ్లు పోస్తూ పూరీపిండిలా చేసుకోవాలి.
* స్టౌమీద బాణలి పెట్టి, వేయించేందుకు సరిపడా నూనె వేయాలి. బియ్యప్పిండిని చిన్నచిన్న చపాతీల్లో వత్తి, బిస్కెట్లలా కోసుకుని కాగుతోన్న నూనెలో వేసి ఎర్రగా వేయించి తీసుకోవాలి. ఇవి రెండుమూడు రోజుల వరకూ నిల్వ ఉంటాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని