పస్తుల నేపథ్యం నుంచి...రూ.18 వేల కోట్ల టర్నోవర్‌!

కునాల్‌ షా.. పూట గడవడానికి డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా చేశాడు. ఇంట్లో  వెచ్చాలు కొనుక్కోవడానికి డెలివరీ బాయ్‌గా సరుకులు చేరవేశాడు

Updated : 13 Apr 2024 08:53 IST

కునాల్‌ షా.. పూట గడవడానికి డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా చేశాడు. ఇంట్లో  వెచ్చాలు కొనుక్కోవడానికి డెలివరీ బాయ్‌గా సరుకులు చేరవేశాడు. కుటుంబ వ్యాపారం దివాళా తీస్తే.. గట్టెక్కించడానికి చదువుకుంటూనే పని చేశాడు. తర్వాత అతడు సృష్టించిన చరిత్ర మామూలుది కాదు. తన తొలి స్టార్టప్‌ని వేల కోట్లకు అమ్మినప్పుడు దేశమంతా నోరెళ్లబెట్టింది. ‘క్రెడ్‌’ని బిలియన్‌ డాలర్ల కంపెనీగా తీర్చిదిద్దినప్పుడు అంకుర సంస్థల ఔత్సాహి కులకి రోల్‌మోడల్‌ అయ్యాడు. ఈమధ్యే వ్యాపారవేత్త సంజీవ్‌ బిక్‌చందానీ.. కునాల్‌ జీవితంలోని చేదు గతాన్ని వెల్లడించినప్పుడు దేశమంతా హీరోలా మారాడు.

ప్రస్తుతం స్టార్టప్‌ ప్రపంచంలో కునాల్‌ షా పేరు తెలియని వారుండరు. తను మాటల మాంత్రికుడు. సృజనాత్మక ఆలోచనల్ని వేల కోట్ల రూపాయల వ్యాపారంగా మార్చగల మెజీషియన్‌. సాధారణంగా విజయవంతమైన అంకుర సంస్థల వ్యవస్థాపకుల్లో చాలామంది ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలైన ఐఐటీ, ఐఐఎంలలో చదివిన వాళ్లే ఉంటారు. కానీ కునాల్‌ది మామూలు నేపథ్యం. ఫిలాసఫీతో డిగ్రీ చేశాడు. అదీ తనకి ఇంటర్లో అరకొర మార్కులు రావడం వల్లే. పార్ట్‌టైం ఉద్యోగం చేయడానికి అనువుగా ఉండటమూ మరో కారణం. కానీ వ్యాపారం షా రక్తంలోనే ఉంది. ఆలోచనల్ని డబ్బులుగా మలిచే కళ చిన్నతనం నుంచే అబ్బింది. పైగా దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో పుట్టి పెరిగాడు. అయితే కాలం కలిసిరాక కుటుంబ వ్యాపారం దెబ్బతినడంతో కష్టాలు మొదలయ్యాయి. కుటుంబాన్ని ఆదుకోవడానికి రెండు గంటలే కాలేజీకి వెళ్తూ.. మిగతా సమయమంతా డబ్బు సంపాదనకే వెచ్చించేవాడు. ఆ సమయంలో సీడీలు అమ్మాడు. అమ్మాయిల చేతులకు మెహెందీలు పెట్టాడు. సైబర్‌ కెఫెలు నడిపాడు. కంప్యూటర్‌ ఆపరేటర్‌గా, డెలివరీబాయ్‌గా.. ఇలా దాదాపు ఇరవై రకాల పనులు చేశాడు. ఏం చేస్తున్నా మెదడుకి పదును పెట్టే పనిని మాత్రం ఆపేవాడు కాదు.

తొలిసారే సూపర్‌హిట్‌

ఎన్నో డక్కామొక్కీలు తిని, కాస్త స్థిర పడ్డాక 2009లో ‘పైసా బ్యాక్‌’ స్టార్టప్‌ ప్రారంభించాడు. ఇది డిస్కౌంట్‌ కూపన్లు అందించే సంస్థ. తొలి ప్రయత్నమే మంచి సక్సెస్‌ కావడంతో.. తర్వాత ఏడాదే సందీప్‌ టాండన్‌తో కలిసి ‘ఫ్రీఛార్జ్‌’కి ఊపిరులూదాడు. ఆన్‌లైన్‌లో తేలిగ్గా అన్నిరకాల బిల్లులూ చెల్లించడం.. సెల్‌ఫోన్‌ని రీఛార్జ్‌ చేసుకోవడం లాంటి ఆప్షన్లు ఉండేవి ఇందులో. ఇది ఊహించలేనంతగా సక్సెస్‌ సాధించింది. తక్కువ కాలంలోనే మిలియన్లకొద్దీ యూజర్లుగా మారారు. 2015లో ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్రీఛార్జ్‌ని రూ.3.5 వేల కోట్లుకు కొనేసింది. అప్పట్లో వ్యాపారవర్గాల్లో ఈ ఒప్పందం ఒక సంచలనం. ఈ దెబ్బతో కునాల్‌ పేరు దేశమంతా మార్మోగిపోయింది. తర్వాత మంచి అవకాశం కోసం కొన్నేళ్లు ఎదురుచూసి, డిజిటల్‌ పేమెంట్‌ విప్లవాన్ని అందిపుచ్చుకునేలా 2018లో ‘క్రెడ్‌’ని ప్రారంభించాడు. ఇప్పుడు చాలా మందికి క్రెడ్‌ ఫిన్‌టెక్‌ యాప్‌ గురించి తెలిసే ఉంటుంది. బిల్లు కట్టినప్పుడు, రీఛార్జ్‌ చేసినప్పుడు.. మనకి కొద్దిమొత్తంలో క్యాష్‌బ్యాక్‌ అందుతుంటుంది. ఈ రివార్డ్స్‌ బేస్డ్‌ పేమెంట్‌ యాప్‌ కొద్దికాలంలోనే భారత్‌లోని మేటి ఫైనాన్షియల్‌ యాప్‌లలో ఒకటిగా నిలిచింది. దీన్ని దేశంలో కోటి మందికిపైగా యూజర్లు వాడుతున్నారు. మొత్తం క్రెడిట్‌ కార్డు బిల్లుల చెల్లింపుల్లో 20శాతం దీని ద్వారానే జరుగుతున్నాయి. ఇది ప్రస్తుతం 18 వేల కోట్ల రూపాయల విలువైన కంపెనీ. సంస్థ స్థిరపడటానికి తను ఎంతలా కష్టపడతాడంటే.. క్రెడ్‌ని లాభాల బాట పట్టించేవరకూ నెలకు రూ.15 వేల జీతమే తీసుకునేవాడు కునాల్‌.

  • చేదు గతం నుంచి ఎదిగిన కునాల్‌కి సమాజానికి తీపిని పంచడమూ తెలుసూ. వేల కోట్లు పోగేసుకోవడమే కాదు.. అందులోంచి కొంత సామాజిక సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తుంటాడు. ఎంత బిజీగా ఉన్నా.. తీరిక చేసుకొని మరీ యువత కోసం మోటివేషన్‌ ఉపన్యాసాలు ఇస్తుంటాడు. మంచి బిజినెస్‌ మోడల్‌తో వస్తున్న స్టార్టప్‌లు ఎదగాలనే ఉద్దేశంతో 200 వరకు అంకుర సంస్థల్లో పెట్టుబడులు పెట్టాడు. అందులో రేజర్‌పే, అన్‌అకాడెమీ, ఇన్నోవ్‌8 లాంటి ఎన్నో విజయవంతమైన కంపెనీలున్నాయి. గొప్ప గొప్ప విద్యాసంస్థల్లో చదవకున్నా.. వ్యాపార దిగ్గజాల వారసుడు కాకపోయినా.. ఇంతలా వ్యాపార పాఠాలు ఎలా ఒంట పట్టించుకున్నాడు? అంటే కేవలం వినియోగదారుల నాడి పట్టడమే కారణం. ‘బిజినెస్‌ ఈజ్‌ ది అప్లికేషన్‌ ఆఫ్‌ ది నాలెడ్జ్‌. మనకిష్టమైన వ్యాపారం కాకుండా జనం అవసరాలు తీర్చగలిగే వ్యాపారం ఎంచుకోగలగాలి. ఆ సేవల్ని వాళ్లకి తేలిగ్గా అందుబాటులోకి తీసుకురావాలి. దానికోసం వాళ్లు ఎక్కువగా చెల్లించడానికి సిద్ధమవుతారు. అప్పుడు ఏ వ్యాపారమైనా విజయవంతం అవుతుంది’ అంటాడు కునాల్‌.

నువ్వు ఆకలితో కాళ్లను డొక్కలోకి ముడుచుకొని పడుకున్నా పట్టించుకునే నాథుడుండడు. కానీ అతడే శిఖరాన్ని చేరినప్పుడు అంతా జేజేలు పలుకుతారు. ఆకాశానికి ఎత్తేస్తారు. ఈ ప్రపంచానికి కావాల్సింది కునాల్‌లాంటి సిసలైన విజేతలే. అలా ఎదగడానికి నేపథ్యం ఎలాంటిదైనా ఫర్వాలేదని నిరూపించాడు కునాల్‌ షా.

  • ఫోర్బ్స్‌ ఇండియా లీడర్‌షిప్‌ అవార్డు (2015)
  •  ఆంత్రప్రెన్యూర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ (2016)
  • మేటి సృజనాత్మక సీఈవో (2017)
  • యువ వ్యాపారవేత్త (2018)
  • ఇండియాస్‌ మోస్ట్‌ అడ్మైర్డ్‌ ఆంత్రప్రెన్యూరర్‌ (2019)
  • ఇంపాక్ట్‌ఫుల్‌ టెక్‌ లీడర్‌ (2020)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని