ఫాలోయర్లు @ 27,00,00,000

నలుగురిలో కలవలేడు.. నోరు తెరిచి మాట్లాడాలంటేనే సిగ్గు...కనీసం కాలేజీ చదువు పూర్తి చేయలేదు... అయితే ఏంటట? ఒక్కో వీడియోకి కోట్ల వీక్షణలు... సంపాదనేమో రూ.వేల కోట్లలోనే ఉంటుంది! అతగాడే అత్యధిక యూట్యూబ్‌ సబ్‌స్క్రైబర్ల ‘మిస్టర్‌ బీస్ట్‌’.

Published : 08 Jun 2024 00:53 IST

నలుగురిలో కలవలేడు.. నోరు తెరిచి మాట్లాడాలంటేనే సిగ్గు...కనీసం కాలేజీ చదువు పూర్తి చేయలేదు... అయితే ఏంటట? ఒక్కో వీడియోకి కోట్ల వీక్షణలు... సంపాదనేమో రూ.వేల కోట్లలోనే ఉంటుంది! అతగాడే అత్యధిక యూట్యూబ్‌ సబ్‌స్క్రైబర్ల ‘మిస్టర్‌ బీస్ట్‌’. ఈమధ్యే ‘టీ-సిరీస్‌’ని వెనక్కి నెట్టి ప్రపంచంలోనే నెంబర్‌వన్‌గా నిలిచాడు.

  • ‘మిస్టర్‌ బీస్ట్‌’ సృష్టికర్త అసలు పేరు జేమ్స్‌ స్టీఫెన్‌ డొనాల్డ్‌సన్‌. అమెరికాలోని కన్సాస్‌లో పుట్టాడు. నెలకి వందల కోట్లు కూడబెట్టే ఇతగాడి వయసు పాతికేళ్లే. 
  • పదమూడేళ్ల వయసులో ‘మిస్టర్‌ బీస్ట్‌ 6000’ పేరుతో ఛానెల్‌ ప్రారంభించి, తొలి వీడియో అప్‌లోడ్‌ చేశాడు. వింతైన వీడియోలు చేయాలనే పిచ్చిలో పడి కాలేజీని కూడా మధ్యలోనే వదిలేశాడు. ఈ పని చేస్తున్నాని తెలిస్తే అమ్మ తిడుతుందనే భయంతో గుట్టుగా వీడియోలు చేసేవాడు. 
  • 2016, 17 సంవత్సరాల్లో అతడి పాపులారిటీ అమాంతం పెరిగింది. అయితే ఇతడి వీడియోల ప్రారంభంలో వచ్చే ‘ఇంట్రో’లు.. ‘యూట్యూబ్‌ వరస్ట్‌ ఇంట్రో’లుగా నిలిచేవి. ఆ ప్రచారమూ కలిసొచ్చేవి. అదే ఏడాది తొలిసారి అతడి వీడియోకి లక్ష వీక్షణలు వచ్చాయి. 2018లో యాభై లక్షల సబ్‌స్క్రైబర్లు, 2022లో కోటికిపైగా సబ్‌స్క్రైబర్లను సంపాదించుకున్నాడు.
  • నోరు తెరిచి పెద్దగా మాట్లాడ్డం చేతకాదుగానీ.. యూట్యూబ్‌లో ఇతగాడి వీడియోలు చూస్తే ఎవరైనా నోరెళ్లబెట్టడం ఖాయం. ఒళ్లు గగుర్పొడిచే సాహసాలు, భారీ సెట్టింగ్‌లతో హాలీవుడ్‌ సినిమాలను తలపిస్తాయి. ఒక వీడియో తయారీ కోసం కోట్ల రూపాయలు వెచ్చిస్తాడు. హెలికాప్టర్లు, స్టీమర్లులాంటివి ఉపయోగించడం సాధారణం. ఫిరంగులు, భారీ ఆయుధాలు తరచూ వాడుతుంటాడు. వారం పదిరోజులు ఒంటరిగా ద్వీపంలో గడుపుతాడు. ఐదు, ఏడు నక్షత్రాల హోటళ్లలో ఉంటాడు. కామెంట్రీ చెబుతూ ఇతడు ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌కి కూడా అంతా ఫిదాలే. ఇక ఒక వీడియోకి కనీసం పదికోట్ల వీక్షణలు, 40-50లక్షల లైక్స్‌ వస్తుంటాయి.  
  • ఇబ్బడిముబ్బడిగా సంపాదించడమే కాదు.. చేతికి ఎముక లేదన్నట్టుగా దానం చేయడమూ మిస్టర్‌ బీస్ట్‌కి తెలుసు. ఆపదల్లో ఉన్నవారికి భారీ మొత్తం ఇచ్చేస్తాడు. వందల స్వచ్ఛంద సంస్థల తరఫున ప్రచారం చేస్తున్నాడు. ఆఫ్రికా ఖండంలో వందలకొద్దీ మంచినీటి బావులు తవ్వించాడు. లక్షలమంది చిన్నారులకు ఆటబొమ్మలు కొనివ్వడం, వేలమందికి కంటి ఆపరేషన్లు చేయించడం, వేల మంది విద్యార్థులకు ఫీజులు చెల్లించడం.. గేమ్స్‌ పెట్టి రూ.కోట్ల ప్రైజ్‌మనీ ఇవ్వడం.. అంతా భారీగానే ఉంటుంది. ప్రకటనల ఆదాయం, యూట్యూబ్‌ నుంచి వచ్చిన మొత్తం లెక్కేస్తే.. ఇతగాడి సంపాదన రూ.వేల కోట్లలోనే ఉంటుంది. 
  • ఈ యూట్యూబ్‌ మొనగాడికి ఇతర సామాజిక మాధ్యమాల్లోనూ పిచ్చ ఫాలోయింగ్‌ ఉంది. అతడ్ని ఇన్‌స్టాగ్రామ్‌లో 4.5కోట్లు, ఎక్స్‌లో 2.6కోట్ల మంది అనుసరిస్తున్నారు. 
  • నాణ్యమైన వీడియో కంటెంట్‌ కారణంగా ‘2020 క్రియేటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’, ‘బెస్ట్‌ లైవ్‌ స్పెషల్‌’, ‘సోషల్‌ గుడ్‌ క్రియేటర్‌’, ‘సోషల్‌ గుడ్‌: నాన్‌ ప్రాఫిట్‌’ ఇలా ఎన్నో అవార్డులు అందుకున్నాడు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని