కెమెరా కంటితో.. పులి వేట!

పులి మనిషిని వేటాడుతుంది...కానీ రాజేశ్‌ కన్నీ పులినే వేటాడతాడు... తన కెమెరా కంటితో దాని ఆనుపానులు పసిగడతాడు... ఆ క్రూర జంతువుకి ఎవరూ చిక్కకుండా అటవీశాఖకు సమాచారం చేరవేస్తాడు... ఇలా ప్రాణాలకు తెగించి, ఎన్నో అరుదైన చిత్రాలు తీసే వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌లు తెలుగు రాష్ట్రాల్లో అతికొద్దిమందే!

Updated : 08 Jun 2024 04:48 IST

పులి మనిషిని వేటాడుతుంది...కానీ రాజేశ్‌ కన్నీ పులినే వేటాడతాడు... తన కెమెరా కంటితో దాని ఆనుపానులు పసిగడతాడు... ఆ క్రూర జంతువుకి ఎవరూ చిక్కకుండా అటవీశాఖకు సమాచారం చేరవేస్తాడు... ఇలా ప్రాణాలకు తెగించి, ఎన్నో అరుదైన చిత్రాలు తీసే వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌లు తెలుగు రాష్ట్రాల్లో అతికొద్దిమందే!

బెబ్బులిని చూస్తేనే ఎవరికైనా ఒంట్లో వణుకు. కనిపిస్తే దాని దరిదాపుల్లో ఎవరూ ఉండరు. రాజేశ్‌ మాత్రం దాన్ని వెతుక్కుంటూ వెళ్తుంటాడు. రక్షిత అభయా రణ్యాలలో సఫారీలో వెళుతూ ఎవరైనా ఫొటోలు తీస్తారు. రహదారులు దాటుతుంటే సెల్‌ఫోన్‌తో క్లిక్‌మనిపిస్తారు. కానీ వ్యాఘ్రాల ఇలాకాలోకే వెళ్లి, చిత్రాలు తీయడం అతడికే సాధ్యం. ఇంతేకాదు.. అంతరించిపోతున్న జీవరాశులు.. అరుదైన ప్రాణులు.. విదేశాలు, రాష్ట్రాల నుంచి వలస వచ్చే పక్షుల చిత్రరాజాలు ఎన్నో రాజేశ్‌ కెమెరా కంటిపాపలో ఒదిగిపోయాయి. ఇటీవలే కుమురంభీం జిల్లాకు వచ్చిన ఏనుగును డ్రోన్‌ కెమెరా ద్వారా అనుసరిస్తూ.. అది రాష్ట్ర హద్దులు దాటి, మహారాష్ట్రకు వెళ్లిపోయిందనే విషయం తెలియజేసి జనమంతా ఊపిరి పీల్చుకునేలా చేశాడు.

ఇలా మొదలైంది..

రాజేశ్‌ నాన్న అడవుల జిల్లా నిర్మల్‌లో ఎస్సై. దాంతో చిన్నప్పట్నుంచీ పచ్చని అడవులన్నా, జంతువులన్నా అమితమైన మమకారం ఏర్పడింది. చిన్నప్పుడే భుజాన కెమెరా తగిలించుకొని అడవుల్లోకి వెళ్లేవాడు. కనిపించిన చెట్టునీ, పిట్టనీ క్లిక్‌మనిపించేవాడు. పెరుగుతున్నకొద్దీ ఆ ఇష్టమూ ఎక్కువ కావడంతో నాన్న ఓ ఖరీదైన కెమెరా కొనిచ్చారు. తర్వాత హైదరాబాద్‌ జేఎన్‌టీయూలో ఫైన్‌ఆర్ట్స్‌లో మాస్టర్స్‌ చేశాడు. డిగ్రీ సమయంలోనే అటవీశాఖలో వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌గా చేరాడు. పచ్చదనంతో పెనవేసుకున్న బంధమే వృత్తిగా మారడంతో మరింత దూసుకెళ్లాడు. అడవుల్లోకి వెళ్లిపోయి అరుదైన జీవరాశిని తన కెమెరాలో బంధించడం మొదలు పెట్టాడు. ఒక్కో పక్షి, జంతువు కోసం గంటలు, రోజుల తరబడి వేచి చూసేవాడు. వన్యప్రాణి నిపుణుల లెక్కల ప్రకారం ఆదిలాబాద్‌ అటవీ ప్రాంతంలో 270 రకాల పక్షి జాతులు, అరుదైన ఔషధ మొక్కలు విరివిగా ఉన్నాయి. వీటిని చిత్రాలు తీస్తూ, పూర్తి వివరాలతో పుస్తకం తయారు చేస్తున్నాడు. పులులు, విషపూరిత సర్పాలు, ఎలుగుబంట్లు, మొసళ్లు, కొండచిలువ లాంటి వన్యప్రాణుల చిత్రాలెన్నో తీశాడు. ఆఫ్రికా ఖండం నుంచి వచ్చిన అమూర్‌ పాల్కన్, రెడ్‌ క్రెస్టెడ్‌ పోచార్డ్, పెయింటెడ్‌ స్టార్స్‌ లాంటి పక్షులను కెమెరాలో బంధించాడు.

అప్రమత్తం చేస్తూ..

కేవలం ఫొటోలు తీయడమే కాదు.. కెమెరాను ఒక భుజాన వేసుకొని, వేటగాళ్ల నుంచి జంతువులను.. క్రూరమృగాల బారి నుంచి జనాలను అప్రమత్తం చేసే పనిని మరో భుజాన మోస్తున్నాడు రాజేశ్‌. ఈ ప్రాంతంలో పులులకు వేటగాళ్ల నుంచి ఎప్పట్నుంచో ముప్పు పొంచి ఉంది. అవి ఎక్కడెక్కడ ఉన్నాయో ఆనవాళ్లు తెలుసుకోవడానికి అటవీశాఖ అధికారులు ట్రాప్‌ కెమెరాలను పెడుతుంటారు. అయినా పులులు కొన్నిసార్లు వాటికి చిక్కవు. ఈ సమయంలో పులి పాదముద్రల ఆధారంగా కెమెరా పట్టుకుని ఒక్కడే వెళ్లిపోతుంటాడు. ఒకసారి.. తప్పిపోయిన ఒక రాయల్‌ బెంగాల్‌ టైగర్‌ ఆచూకీ కోసం ఉదయం, సాయంత్రాలు పది రోజులు తిరిగాడు. కాగజ్‌నగర్‌ అటవీ ప్రాంతంలో అతడికి కేవలం ఇరవై అడుగుల దూరంలో ఆ పులి కనిపించింది. ఆ సమయంలో ఒకవైపు ప్రాణభయం వెంటాడుతున్నా.. చిత్రాలు తీసి అలాగే కదలకుండా ఉండిపోయాడు. తర్వాత ఆ విలువైన సమాచారాన్ని అధికారులకు చేరవేశాడు. వాళ్లు చుట్టుపక్కల ప్రాంతాల జనాల్ని అప్రమత్తం చేశారు. మరోసారి ప్రాణహిత నది దాటి, ఒక ఏనుగు కుమురంభీం జిల్లాకి వచ్చింది. రెండ్రోజుల్లో ఇద్దరు రైతులను తొక్కి చంపేసింది. అధికారులతో కలిసి డ్రోన్‌ కెమెరా ఉపయోగిస్తూ అది ఎక్కడుందో తెలుసుకుంటూ స్థానికులకు విషయం తెలియజేశాడు. చివరకది మహారాష్ట్ర తిరిగి వెళ్లేదాకా సమాచారం చేరవేస్తూనే ఉన్నాడు. ఈ అరుదైన పనికి స్థానికులు, అధికారుల నుంచి ప్రశంసలు దక్కుతూనే ఉన్నాయి.

- చొక్కాల రమేశ్, ఆసిఫాబాద్‌ 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని