Inspirational story: ఏడు వైఫల్యాల ‘ఐఎఫ్‌ఎస్‌’

లవకుమార్‌ నాన్న అటవీశాఖలో చిరుద్యోగి. ఉద్యోగరీత్యా ఆయన చాలా ప్రాంతాలు తిరిగేవారు. ఉన్నతాధికారులను కలిసేవారు. వాళ్ల దర్పం, హోదా చూసినప్పుడు ‘నా కుమారుడు సైతం ఆ స్థాయికి చేరితే బాగుండు అని ఆశ పడేవారు.

Updated : 25 May 2024 08:26 IST

మొదటి రెండు ప్రయత్నాలు అట్టర్‌ ఫ్లాప్‌...
మూడోదీ మొదటి అడుగులోనే విఫలం...
నాలుగో దాంట్లో మెయిన్స్‌లో చతికిలపడ్డాడు...
ఐదోది మళ్లీ ప్రిలిమ్స్‌ కూడా దాటలేదు...
ఆరో అటెంప్ట్‌ మెయిన్స్‌ ముందు బోల్తా పడ్డాడు...
ఏడో ప్రయత్నంలో ఇంటర్వ్యూ వరకు వెళ్లినా సర్వీసు రాలేదు...
అయినా.. అలసిపోలేదు. నావల్ల కాదని పుస్తకం వదల్లేదు పోరిక లవకుమార్‌. ఈసారి ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ (ఐఎఫ్‌ఎస్‌)కి గురి పెట్టాడు...ఆ కష్టం, ఓపిక ఊరికే పోలేదు. 130 ర్యాంకుతో జాతీయ స్థాయిలో మెరిశాడు.
 

లవకుమార్‌ నాన్న అటవీశాఖలో చిరుద్యోగి. ఉద్యోగరీత్యా ఆయన చాలా ప్రాంతాలు తిరిగేవారు. ఉన్నతాధికారులను కలిసేవారు. వాళ్ల దర్పం, హోదా చూసినప్పుడు ‘నా కుమారుడు సైతం ఆ స్థాయికి చేరితే బాగుండు అని ఆశ పడేవారు. ఆ విషయం పదేపదే లవకుమార్‌కి చెబుతుండటంతో.. ఎప్పటికైనా నేను పెద్ద ఉద్యోగం సాధించాలనే కోర్కె, ఆ పిల్లాడి మనసులో నాటుకుపోయింది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గుర్రంపేట రామునాయక్‌ తండా లవకుమార్‌ సొంతూరు. ఇంట్లో ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులే. ఎన్ని కష్టాలున్నా పిల్లలిద్దర్నీ బాగా చదివించే వారు లవకుమార్‌ నాన్న. ఆయన ఆశయానికి తగ్గట్టే వాళ్లూ బాగా చదివేవారు. మంచి మార్కులతో పాసయ్యేవారు. ఇంటర్‌ తర్వాత, ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ఐఐటీ ఖరగ్‌పూర్‌ నుంచి ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు లవకుమార్‌.

ఉద్యోగం కాదనుకొని..

బీటెక్‌ పూర్తవగానే విప్రోలో ఉద్యోగం వచ్చింది. ఆరంకెల జీతం. కొలువులో చేరడానికి ముందు హనుమకొండలోని ఇంటికొచ్చాడు. ఓ ధ్రువీకరణపత్రం కోసం నాన్నతో కలిసి ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లాడు. అక్కడ ఒక ఐఏఎస్‌ అధికారి ప్రజల సమస్యలు వింటూ, అక్కడికక్కడే పరిష్కరించే వైనం కళ్లారా చూశాడు. ఆయనకు జనం నుంచి దక్కే గౌరవం ప్రత్యక్షంగా అర్థమైంది. చేస్తే.. అలాంటి ఉద్యోగమే చేయాలని అప్పటికప్పుడే నిర్ణయించుకున్నాడు. కొలువుకి రావడం లేదంటూ సంస్థకి లేఖ రాశాడు. ‘సివిల్స్‌ సాధించడం చాలా కష్టం. లక్షల్లో ఒకరికి సర్వీసు వస్తుంది. మంచి జాబ్‌ వదులుకొని రిస్కు తీసుకోవడం అవసరమా?’ అని స్నేహితులు, బంధువులు హెచ్చరించారు. అయినా తన నిర్ణయం మార్చుకోలేదు.

నవ్వినచోటే..

సాధించాలనే కసి ఉందిగానీ ఎలా సన్నద్ధమవ్వాలో తెలియదు. వెంటనే దిల్లీ వెళ్లి ఒక కోచింగ్‌ సెంటర్‌లో చేరాడు. అక్కడే ఉండి రెండుసార్లు యూపీఎస్సీ పరీక్ష రాశాడు. కానీ ప్రిలిమ్స్‌ కూడా పాసవలేదు. స్థలం మారితేనైనా సిలబస్‌పై పట్టు దొరుకుతుందేమోనని హైదరాబాద్‌ తిరిగొచ్చి ప్రయత్నించాడు. అప్పుడూ అదృష్టం కలిసిరాలేదు. మూడేళ్లు వ్యర్థమైనా తొలి అడుగు కూడా దాటలేదని బాధ పడ్డాడు. ఇంట్లోవాళ్లు ఓదార్చి, వెన్ను తట్టారు. నాలుగో ప్రయత్నంలో మెయిన్స్‌ దాకా వెళ్లడంతో నమ్మకం కుదిరింది. ఐదోసారి మొదటి అడుగులోనే విఫలం. కొందరు నవ్వారు, ఇంకొందరు మొహమ్మీదే ‘నీవల్ల కాద’న్నారు. ప్రయత్న లోపం ఎక్కడుందో అర్థమయ్యేది కాదు. అప్పుడే ఓ అటవీశాఖ అధికారి ‘ఐఎఫ్‌ఎస్‌కి కూడా ప్రయత్నించు’ అని సలహా ఇచ్చారు. మరోవైపు సీనియర్‌ ఐఏఎస్, ఐపీఎస్‌లనూ కలిసి సూచనలు తీసుకున్నాడు. ఈసారి మెయిన్స్‌లో పోయింది. అదేసమయంలో స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ పరీక్ష రాసి, టెలీ కమ్యూనికేషన్స్‌ విభాగంలో జూనియర్‌ అకౌంటెంట్‌ ఉద్యోగం సంపాదించాడు. వరుస వైఫల్యాల్లో ఉన్న లవకుమార్‌కి అది కొండంత నమ్మకం ఇచ్చింది. రెట్టించిన ఉత్సాహంతో ఏడోసారి 2023లో పట్టుబట్టి రాశాడు. ప్రిలిమ్స్, మెయిన్స్‌ దాటి ఇంటర్వ్యూ దాకా వెళ్లినా బోర్డు సభ్యులను మెప్పించలేకపోయాడు. చివరి మెట్టుపై బోల్తా పడ్డా కుంగిపోలేదు. ఈసారి ఐఎఫ్‌ఎస్‌కి సీరియస్‌గా ప్రయత్నించాడు. మొదటి ప్రయత్నంలోనే రెండు దశలు దాటి ఇంటర్వ్యూ వరకు వెళ్లాడు. ముఖాముఖికి పదిరోజుల సమయమే ఉండటంతో ఓ అటవీశాఖ అధికారిని కలిశాడు. క్షేత్రస్థాయి నుంచి పైవరకు అన్ని వివరాలూ తెలుసుకున్నాడు. దిల్లీలో జరిగిన ఇంటర్వ్యూలో బోర్డు సభ్యులను మెప్పించాడు. జాతీయస్థాయిలో 130 ర్యాంకు సాధించాడు. అయినా తన లక్ష్యం ఐఏఎస్‌ కావడంతో.. చివరి ప్రయత్నంలో తప్పకుండా దాన్ని చేరతానని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నాడు లవకుమార్‌.

స్ఫూర్తి పాఠాలు

  • వ్యతిరేకంగా ఫలితం వచ్చిన ప్రతిసారీ నిరాశకు గురయ్యా. కానీ నాన్న పడిన కష్టం, అమ్మ చెప్పిన మాటలు.. గుర్తొస్తుంటే మరింత కసిగా ముందుకెళ్లా. 
  • ఫెయిలైనప్పుడు వెక్కిరించేవాళ్లు, వెనక్కిలాగేవాళ్లే కాదు.. వెన్నుతట్టి ప్రోత్సహించినవాళ్లూ ఉన్నారు. ముఖ్యంగా అధ్యాపకులు, శిక్షకులు, స్నేహితులు అండగా నిలిచారు. 
  • ఎన్ని వైఫల్యాలు ఎదురైనా వాటిని మనసులోంచి తుడిచేసి, ప్రతిసారీ మొదటి ప్రయత్నంగానే భావించాలి. ఇది మనకు మరింత ఉత్సాహాన్నిస్తుంది. 
  • నేర్చుకోవాలనే కసి మనలో ఉంటే.. మంచి మనసుతో నేర్పించడానికి అనుభవజ్ఞులు, నిపుణులు, సీనియర్‌ ఉద్యోగులు చాలామంది ఉన్నారు. అలాంటివాళ్లని వెతికి పట్టుకోవాలి.
  • ఎంతసమయం చదివాం అన్నది కాదు.. ఎంత ప్రణాళికాబద్ధంగా చదివాం అన్నది ముఖ్యం. అంతర్జాలంలో బోలెడంత సమాచారం ఉంటుంది. విజేతల బ్లాగులున్నాయి. ఆన్‌లైన్‌ క్లాసులు చెబుతున్నారు. వీటన్నింటినీ ఉపయోగించుకోవచ్చు. 
  • అన్ని ప్రయత్నాలూ విఫలమైనా నిరాశ వద్దు. అత్యంత ప్రతికూల ఫలితాల్ని సైతం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఈ లక్ష్యం చేరకపోయినా ప్రత్యామ్నాయం ఏంటో ముందే నిర్ణయించుకోవాలి.
  • లక్ష్యం చేరినప్పుడు మనం పొందే గౌరవం, హోదా, అధికార దర్పం, సౌకర్యాలు, వేతనం.. ఇవి తరచూ ఊహించుకుంటుంటే..మనకు మనమే స్ఫూర్తి పొందుతాం.

సోగాల స్వామి, జయశంకర్‌ భూపాలపల్లి 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని