ఆశయం తెరకెక్కింది

కళకి సమాజహితం ఉండాలనేది వినోద్‌ రాజేంద్ర అభిమతం. తాను తీస్తున్న లఘుచిత్రాలు, డాక్యుమెంటరీలన్నింటికీ అదే ఆశయం జోడిస్తున్నాడు. వీటికి రికార్డులు సృష్టించడంతోపాటు.. అవార్డులూ అందుకున్నాడు.

Updated : 20 Apr 2024 00:26 IST

కళకి సమాజహితం ఉండాలనేది వినోద్‌ రాజేంద్ర అభిమతం. తాను తీస్తున్న లఘుచిత్రాలు, డాక్యుమెంటరీలన్నింటికీ అదే ఆశయం జోడిస్తున్నాడు. వీటికి రికార్డులు సృష్టించడంతోపాటు.. అవార్డులూ అందుకున్నాడు. ఈమధ్యే తను తీసిన ‘ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్‌’ ఎనిమిదో ఇండియన్‌ వరల్డ్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో బెస్ట్‌ డాక్యుమెంటరీగా నిలిచింది.

 వినోద్‌ది సత్యసాయి జిల్లా హిందూపురం. బడిలో మాస్టార్లు చెప్పే పుస్తకాల్లోని కథలతో ఆసక్తి మొదలైంది. కాలేజీకొచ్చేసరికి రోజుకో సినిమా చూస్తూ.. వెండితెర కల స్థిరపడింది. తన చదువు పూర్తయ్యేసరికి లఘు చిత్రాల హవా ఎక్కువగా నడుస్తోంది. సినిమా పెద్దల దృష్టిలో పడటానికి షార్ట్‌ఫిల్మ్‌లను చాలామంది ఒక మార్గంగా ఎంచుకునేవారు. తనూ అదే బాట పట్టాడు. మొదటిసారి ‘యాజ్‌ ఫర్‌ యాజ్‌’ అనే మూకీ లఘుచిత్రం తీశాడు. అది మంచి పేరు తెచ్చిపెట్టడంతో ఇక వెనుదిరిగి చూసుకోలేదు. ఇప్పటివరకు 9 లఘుచిత్రాలు, 7 డాక్యుమెంటరీలు, 13 యానిమేటెడ్‌ యాడ్స్‌ తీశాడు. ప్రేమ, నేరాలు, రిలేషన్‌షిప్స్‌, వినోదం.. ప్రేక్షకులకు చేరువ కావాలంటే ఫిల్మ్‌మేకర్లు ఎంచుకునే కథాంశాలివి. వినోద్‌ మాత్రం, తన ప్రతి చిత్రం సమాజానికి ఎలా ఉపయోగ పడుతుందా? అని ఆలోచిస్తాడు. అటువంటి కథాంశాన్నే ఎంచుకుంటాడు. ప్రస్తుతం తను రైళ్లలో సురక్షిత ప్రయాణం, భద్రత గురించి జనాల్లో చైతన్యం తీసుకురావడానికి నైరుతి రైల్వే, ఐసీఐసీఐ ఫౌండేషన్‌ సంయుక్తంగా చేపట్టిన ‘ది ఫస్ట్‌ జర్నీ’ ప్రాజెక్టులో భాగంగా ‘పాయింట్స్‌ మ్యాన్‌’ తీశాడు. ఇందులోనే యానిమేటెడ్‌ యాడ్స్‌ రూపొందించాడు. ఇవి ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, గోవాలోని అనేక రైల్వేస్టేషన్లలో ఇప్పటికీ ప్రదర్శితం అవుతున్నాయి. మూడు షార్ట్‌ఫిల్మ్స్‌తోపాటు ఫీచర్‌ ఫిల్మ్‌ కథా చర్చల్లో ఉన్నాడు.

  • భరతనాట్యాన్ని కెరియర్‌గా ఎంచుకున్న ఒక యువ నాట్యకారిణి అంత:సంఘర్షణతో తెరకెక్కించిన ‘అరంగేట్రం’.. ప్యారిస్‌ ప్లే ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో అవార్డు గెల్చుకుంది.
  • చారిత్రక విశిష్టత కలిగిన ప్రదేశం లేపాక్షిపై తీసిన డాక్యుమెంటరీకి నాలుగు అవార్డులందాయి.
  • ‘లేపాక్షి’ డాక్యుమెంటరీ 11 భాషల్లో అనువాదమై, ‘మోస్ట్‌ డబ్బ్‌డ్‌ షార్ట్‌ డాక్యుమెంటరీ’గా గిన్నిస్‌ బుక్‌ రికార్డుల్లోకి ఎక్కింది.
  • కిందిస్థాయి రైల్వే ఉద్యోగుల జీవితాల నేపథ్యంతో మలిచిన ‘పాయింట్స్‌ మ్యాన్‌’ దిల్లీ అంతర్జాతీయ లఘుచిత్రోత్సవాల్లో పురస్కారం దక్కింది.
  • ఇరవై దేశాల నుంచి వచ్చిన లఘుచిత్రాలతో పోటీ పడి ‘ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్‌’ ఉత్తమ డాక్యుమెంటరీగా నిలిచింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని