Published : 04/12/2021 02:57 IST

పెన్నా పొర్లుకట్టకు రూ. 100 కోట్లు

నెల్లూరు పర్యటనలో ముఖ్యమంత్రి జగన్‌

వరద బాధితులను ఆదుకుంటామని హామీ

తిరుపతిలోనూ పలు ప్రాంతాల్లో పర్యటన


నెల్లూరు జిల్లా పెనుబల్లిలో వరద బాధితుల సమస్యలు వింటున్న సీఎం జగన్‌

ఈనాడు డిజిటల్‌, నెల్లూరు: ‘నెల్లూరు బ్యారేజీ దిగువ ప్రాంతాలు ముంపునకు గురికాకుండా.. పెన్నా పొర్లుకట్ట నిర్మాణానికి రూ.100 కోట్లు మంజూరు చేస్తున్నాను. పండగల తర్వాత నేనే వచ్చి శంకుస్థాపన చేస్తా. దీంతోపాటు నెల్లూరు, సంగం బ్యారేజీలను ప్రారంభిస్తాను’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం నెల్లూరు జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన.. నెల్లూరు భగత్‌సింగ్‌ కాలనీలో మాట్లాడారు. వరద బాధితులకు ఇంటికి రూ.2వేలతో పాటు రేషన్‌ కూడా ఇచ్చామని, రాని వాళ్లు ఈ నెల అయిదో తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పెన్నా వరద నివారణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దెబ్బతిన్న సోమశిల జలాశయ యాప్రాన్‌ నిర్మాణానికి రూ.120 కోట్లు మంజూరుచేసినట్లు తెలిపారు. వరద బాధితులను ఆదుకోవడంలో కలెక్టర్‌ చక్రధర్‌బాబు, నగర కమిషనర్‌ దినేష్‌కుమార్‌ పనితీరును ప్రశంసించారు. మధ్యాహ్నం 1.30కు నెల్లూరు పోలీసు కవాతు మైదానానికి చేరుకున్న సీఎం.. అక్కడి నుంచి నెల్లూరు గ్రామీణ మండలం దేవరపాళేనికి వెళ్లారు. వరదలతో దెబ్బతిన్న రహదారులు, పంటలు, కోతకు గురైన కరకట్టను పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంట నష్టం తెలుసుకుని.. ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పెనుబల్లిలో దెబ్బతిన్న రోడ్లు, పాఠశాల, పంట పొలాలను సందర్శించారు. భగత్‌సింగ్‌నగర్‌ కాలనీలో కోతకు గురైన పెన్నా నదిని పరిశీలించి.. బాధితులను పరామర్శించారు.

నెల్లూరు జిల్లాలో వరద బాధితులను ఆదుకునేందుకు మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు సీఎం సహాయనిధికి రూ.కోటిని అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రి హెలికాప్టర్‌లో రేణిగుంట విమానాశ్రయానికి వెళ్లారు. ఈ కార్యక్రమంలో మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, మేకపాటి గౌతమ్‌రెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్‌, నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి, జడ్పీ ఛైర్‌పర్సన్‌ ఆనం అరుణమ్మ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

మహిళను పలకరిస్తున్న సీఎం

రోడ్లు మంచిగా వేస్తాం

తిరుపతిలో వరద ప్రభావిత ప్రాంతాలైన శ్రీకృష్ణనగర్‌, సరస్వతినగర్‌, గాయత్రినగర్‌లలో ముఖ్యమంత్రి జగన్‌ శుక్రవారం పర్యటించి ప్రజలను కలుసుకున్నారు. సరస్వతినగర్‌లో నగరపాలకసంస్థ ఏర్పాటుచేసిన చిత్ర ప్రదర్శనను తిలకించారు. స్థానికులు కొందరు ‘రోడ్లు వేయండి సర్‌’ అని కోరారు. ఈ మాటలను విన్న సీఎం.. మంచిగా రోడ్లు వేస్తామంటూ హామీ ఇచ్చారు. అనంతరం తిరుచానూరు వద్ద పాడిపేట మార్గంలో కొట్టుకుపోయిన స్వర్ణముఖి నది వంతెనను పరిశీలించారు. ఇక్కడ వరదల నుంచి పలువురిని కాపాడిన ఐదుగురు వ్యక్తులను సన్మానించారు. సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గౌతమ్‌రెడ్డి ఉన్నారు.


నర్సు ఇంటికి వెళ్లి పరామర్శ


హెడ్‌ నర్సు విజయకుమారిని ఆమె ఇంటికి వెళ్లి పరామర్శిస్తున్న సీఎం జగన్‌

తిరుపతి శ్రీకృష్ణనగర్‌లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రికి.. ప్రమాదంలో గాయపడి ఇంటికే పరిమితమైన స్విమ్స్‌ హెడ్‌నర్సు విజయకుమారి గురించి ఆమె కుమార్తె విన్నవించారు. దాంతో ఆయన అదే ప్రాంతంలో ఉన్న వారి ఇంట్లోకి వెళ్లి బాధితురాలిని  పరామర్శించారు. అక్కడకు సమీపంలోనే అనారోగ్యంతో బాధపడుతున్న మరో మహిళ రహదారి పక్కన కుర్చీలో కూర్చొని ఉండగా.. గమనించిన సీఎం ఆమె వద్దకు వెళ్లి మోకాళ్లపై కూర్చొని ఆమెతో మాట్లాడారు.మెడపట్టి తోసేస్తున్న పోలీసులు

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం పెనుబల్లిలో పర్యటించిన సీఎం జగన్‌ను కలిసి తన గోడు విన్నవించేందుకు వేళాంగిణి అనే మహిళ పడిన కష్టం అందరినీ అయ్యో అనిపించేలా చేసింది. సీఎంను కలవాలని ఆమె వేడుకున్నా.. పోలీసులు మెడపట్టి నెట్టేశారు. ముఖ్యమంత్రి సమీపిస్తున్న సమయంలో ‘అయ్యా.. ముఖ్యమంత్రి గారూ’ అంటూ గట్టిగా అరవడంతో అక్కడికి చేరుకొన్న ఆయన.. ఆమె సమస్యను విన్నారు. తన భర్త రైల్వేల్లో పనిచేసి మరణించారని, తన కుమారుడికి ఆ ఉద్యోగం ఇప్పించాలని ఆమె కోరారు. అయితే రాష్ట్ర ప్రభుత్వంలో ఏమైనా అవకాశం ఉంటే చూద్దామని ఆమెను అనునయించిన సీఎం.. వెంటనే ఆ విషయం చూడాలని నెల్లూరు కలెక్టర్‌ను ఆదేశించారు. ‘అధైర్యపడకు.. నేనున్నా’ అని ఆమెను అనునయించారు.

నేనున్నానంటూ భరోసా ఇస్తున్న సీఎం

- ఈనాడు, నెల్లూరు

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని