విచారణలో జాప్యానికే పిటిషను

జగన్‌ అక్రమాస్తుల కేసుల విచారణ ముందుకు సాగకుండా సమష్టి వ్యూహంలో భాగంగా ఇలాంటి పిటిషన్లు దాఖలు చేస్తున్నారంటూ సీబీఐ సోమవారం హైకోర్టుకు నివేదించింది. 10 ఏళ్లు అయినా డిశ్ఛార్జి పిటిషన్ల దశ దాటకుండా వేస్తున్నారని

Published : 07 Dec 2021 03:05 IST

 హాజరు మినహాయించాలన్న జగన్‌ పిటిషన్‌పై సీబీఐ

తీర్పు వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు

ఈనాడు, హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసుల విచారణ ముందుకు సాగకుండా సమష్టి వ్యూహంలో భాగంగా ఇలాంటి పిటిషన్లు దాఖలు చేస్తున్నారంటూ సీబీఐ సోమవారం హైకోర్టుకు నివేదించింది. 10 ఏళ్లు అయినా డిశ్ఛార్జి పిటిషన్ల దశ దాటకుండా వేస్తున్నారని పేర్కొంది. సీబీఐ నమోదు చేసిన కేసుల్లో సీబీఐ కోర్టు విచారణలో హాజరు మినహాయింపునివ్వాలంటూ ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ విచారణ చేపట్టారు. సీబీఐ తరఫు న్యాయవాది కె.సురేందర్‌ వాదనలు వినిపిస్తూ... ‘ఇలాంటి పిటిషన్లను గతంలో సీబీఐ కోర్టుతో పాటు ఇదే హైకోర్టు కొట్టివేసింది. అప్పట్లో సాక్షులను ప్రభావితం చేస్తారని హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రస్తుతం నిందితుడి హోదా పెరిగింది. ఓ రాష్ట్ర అధినేతగా మరిన్ని అవకాశాలున్నాయి. పిటిషనర్‌పై తీవ్రమైన కేసులున్నాయి. ఆర్థిక నేరాలకు పాల్పడ్డారు. ఒకరి తరువాత ఒకరు పిటిషన్లు దాఖలు చేస్తూ విచారణ జాప్యం చేస్తున్నారు. కేసును నీరుగారుస్తున్నారు. కేసు విచారణ దశలో అప్పటికీ ఇప్పటికీ ఎలాంటి మార్పు లేదు. విచారణలో జాప్యంపై హాజరు మినహాయింపునివ్వాలంటూ ఎలాంటి చట్టం లేదు. 10 ఏళ్ల సుదీర్ఘ కాలం గడిచిపోయింది. గంటల కొద్దీ కోర్టు సమయం వృథా అయింది. కనీసం అభియోగాల నమోదు పూర్తయ్యాక విచారణ ప్రక్రియలో హాజరు మినహాయింపు కోరినా అభ్యంతరంలేదు. అభియోగాలు కూడా నమోదు కాకుండా మినహాయింపు కోరడానికి ఇది సరైన సమయం కాదు. గతంలో సీబీఐ, హైకోర్టులు ఇచ్చిన ఉత్తర్వులను పునఃపరిశీలించడానికి వీల్లేదు. ఈ పిటిషన్‌ దాఖలు చేశాక 40 నుంచి 50 సార్లు విచారణ జరిగినా సీబీఐ కోర్టు హాజరు మినహాయింపునిచ్చింది...’ అని పేర్కొన్నారు. ఇంతకాలం లేని మినహాయింపు ఇప్పుడెందుకని, ఈ దశలో మినహాయింపునివ్వరాదని న్యాయవాది కె.సురేందర్‌ కోరారు. ఈ వాదనతో జగన్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది ఎస్‌.నిరంజన్‌రెడ్డి విభేదిస్తూ అప్పటికీ, ఇప్పటికీ పరిస్థితులు మారాయని, వారానికి ఒక్కరోజు మాత్రమే విచారణ ఉండేదని, ప్రస్తుతం రోజువారీ విచారణ కొనసాగుతోందన్నారు. అప్పుడు హైదరాబాద్‌లో ఉండేవారని, ప్రస్తుతం పొరుగు రాష్ట్రంలో పాలనా బాధ్యతల్లో ఉన్నారన్నారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి తీర్పును వాయిదా వేశారు.

దాల్మియా పిటిషన్‌పై విచారణ 19కి వాయిదా

జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో దాల్మియా సిమెంట్స్‌కు లీజుల కేటాయింపు, జగన్‌ కంపెనీల్లోకి పెట్టుబడులపై సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ దాల్మియా అధినేత పునీత్‌ దాల్మియా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ భూయాన్‌ విచారణ చేపట్టగా పిటిషనర్‌ తరఫున సుప్రీం కోర్టు సీనియర్‌ న్యాయవాది పి.వి.కపూర్‌ వాదనలు ప్రారంభించారు. లీజుల కేటాయింపు నుంచి అన్నీ చట్టప్రకారమే జరిగాయని, అలాంటప్పుడు క్విడ్‌ప్రోకో ఎలా ఉంటుందన్నారు. దీనిపై తదుపరి విచారణ 19వ తేదీకి వాయిదా పడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని