పీఆర్సీపై సర్కారుకు సహాయ నిరాకరణ

కొత్త పీఆర్సీ ప్రకారం జనవరి నెల జీతాలు చెల్లించేందుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి తాము సహకరించబోమని ఖజానా ఉద్యోగులు తేల్చి చెప్పేశారు. ‘‘చీకటి జీవోలు ఉపసంహరించుకునే వరకు మేం కొత్త

Published : 21 Jan 2022 05:21 IST

కొత్త జీతాల బిల్లుల ప్రక్రియలో పాల్గొనలేం
ట్రెజరీ సర్వీసు అసోసియేషన్ల స్పష్టీకరణ
మేం ఉద్యమిస్తుంటే బిల్లులు చేయాలని ఒత్తిళ్లా?
ఆర్థికశాఖ ఉన్నతాధికారుల ఆదేశాలపై మండిపాటు
మరోవైపు సీఎఫ్‌ఎంఎస్‌లో పని చేయని పాత విధానం
జనవరి జీతాల చెల్లింపులో గందరగోళమే

ఈనాడు, అమరావతి: కొత్త పీఆర్సీ ప్రకారం జనవరి నెల జీతాలు చెల్లించేందుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి తాము సహకరించబోమని ఖజానా ఉద్యోగులు తేల్చి చెప్పేశారు. ‘‘చీకటి జీవోలు ఉపసంహరించుకునే వరకు మేం కొత్త పీఆర్‌సీ బిల్లుల ప్రక్రియలో పాల్గొనబోం’’ అని ఖరాఖండిగా తేల్చేశారు. ఈ మేరకు తమ నిర్ణయాన్ని అన్ని జిల్లాల్లోని ఖజానా డిప్యూటీ డైరెక్టర్లకు తెలియజేశారు. ప్రభుత్వానికి సైతం వర్తమానం అందించారు. రాష్ట్రంలో ఉన్న రెండు ట్రెజరీ సర్వీసు అసోసియేషన్లు ఈ విషయాన్ని స్పష్టంగా ప్రకటించాయి. ఒకవైపు పాత విధానం ప్రకారం జీతాల బిల్లులను సిద్ధం చేసేందుకు వీలు లేకుండా సీఎఫ్‌ఎంఎస్‌లో మార్పులు చేసేశారు. కొత్త మాడ్యుల్‌ను రూపొందించారు. మరోవైపు కొత్త పీఆర్సీ ప్రక్రియలో పాల్గొనబోమని ఖజానా ఉద్యోగులు తేల్చేశారు. ఫలితంగా జనవరి వేతనాల చెల్లింపునకు సంబంధించి గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.

తక్షణమే కొత్త జీతాల బిల్లులకు ఆదేశాలు

రాష్ట్ర ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్‌ గురువారం ఉదయం రాష్ట్రంలోని ఖజానా శాఖ డిప్యూటీ డైరెక్టర్లు అందరితో సమావేశం నిర్వహించారు. జనవరి 25కల్లా కొత్త పీఆర్‌సీ ఉత్తర్వుల ప్రకారం వేతనాల బల్లులను సమర్పించాలని మౌఖికంగా ఆదేశించారు. ఆ తర్వాత డీడీలంతా సబ్‌ ట్రెజరీ, పే అండ్‌ అకౌంట్స్‌ అధికారులకు ప్రభుత్వ ఆదేశాలను వివరించారు. నిజానికి డీడీవోలు కొత్త స్కేళ్ల ప్రకారం బిల్లులను సమర్పించాలని, ఖజానా అధికారులు వాటిని సరి చూడాలని, తప్పులు వస్తే ఖజానా అధికారులు, ఉద్యోగులు బాధ్యత వహించాల్సి ఉంటుందని ప్రభుత్వం మార్గదర్శకాలతో జీవో ఇచ్చింది. మార్చి నెలాఖరుకు ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు అవకాశం ఇచ్చింది. దానికి విరుద్ధంగా గురువారం మౌఖిక ఆదేశాలు ఇవ్వడం గమనార్హం.

మేం బిల్లుల ప్రక్రియలో సహకరించబోం

‘‘రాష్ట్రంలోని అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ, ఫించనుదారుల సంఘాలు ఉద్యమబాట పట్టి, సమ్మె నోటీసు ఇస్తున్నాయి. ఇదేసమయంలో ఈ చీకటి జీవోలను అమలు చేయాలంటూ ట్రెజరీ ఉద్యోగులపై ఒత్తిడి తీసుకురావడాన్ని ఖండిస్తున్నాం’’ అని ట్రెజరీ సర్వీసు అసోసియేషన్‌ అమరావతి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.శోభన్‌బాబు, ప్రధాన కార్యదర్శి పి.కిరణ్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ‘‘ఈ చీకటి జీవోలు రద్దయ్యేవరకు ట్రెజరీ ఉద్యోగులు ఎవరూ పీఆర్సీ అమలు ప్రక్రియలో పాలుపంచుకోకూడదని నిర్ణయించాం. ఉద్యోగులకు సంబంధించిన డేటాను సైట్‌లో పొందుపరచాలని, డీడీవోలు సమర్పించిన డేటాను ఖరారు చేయాలని మాపై ఉన్నతాధికారులు ఒత్తిడి చేయడాన్ని ఖండిస్తున్నాం’’ అని వారు పేర్కొన్నారు. ట్రెజరీ ఉద్యోగుల సర్వీసు అసోసియేషన్‌ మరో సంఘం నాయకులు జి.రవికుమార్‌, దేవిరెడ్డి రమణారెడ్డిలు సైతం ఇదే విషయం పేర్కొన్నారు. ‘‘బిల్లులను ప్రాసెస్‌ చేయాలని ఆర్థికశాఖ ఉన్నతాధికారులు ట్రెజరీ ఉద్యోగులపై ఒత్తిడి చేయడాన్ని ఖండిస్తున్నాం. జీవోలు ఉపసంహరించుకుని ఇంటిఅద్దె భత్యం విషయంలో కొత్త శ్లాబ్‌లు నిర్ణయించే వరకు పీఆర్‌సీ బిల్లులు ప్రాసెస్‌ చేయాలని మాపై ఒత్తిడి తేవద్దు’’ అని వారు మరో ప్రకటనలో కోరారు.

గెజిటెడ్‌ అధికారులూ వ్యతిరేకమే

కొత్త పీఆర్సీ బిల్లులు పరిశీలించి సమర్పించాల్సింది డీడీవోలే. వారంతా గెజిటెడ్‌ అధికారులు. రాష్ట్ర గెజిటెడ్‌ అధికారుల సంఘం సైతం ఈ పీఆర్సీని వ్యతిరేకిస్తోంది. కొత్త పీఆర్సీ జీవోలు రాష్ట్ర విభజన చట్టానికి వ్యతిరేకమని, ఈ విషయంపై రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించి పిటిషన్‌ దాఖలు చేశామని గెజిటెడ్‌ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.ఆర్‌.కృష్ణయ్య తెలిపారు. దీంతో డీడీవోలు కూడా బిల్లుల ప్రాసెస్‌ విషయంలో సందేహంతో ఉన్నారు. డీడీవోలు సమర్పించాలన్నా కిందిస్థాయి ఉద్యోగులే వాటిని సిద్ధం చేయాలి. ఉద్యోగులంతా ఉద్యమ కార్యాచరణలో ఉన్న నేపథ్యంలో కొత్త బిల్లులు ప్రాసెస్‌ చేయడం కష్టమే అవుతుంది. సీఎఫ్‌ఎంఎస్‌లో పాత నెల బిల్లుల ప్రకారం కొత్త స్కేళ్లతో జీతాలు చెల్లించేలా ఒక ప్రోగ్రాం సిద్ధం చేసి ఉంచారని, ఆ ప్రకారం కొత్త వేతనాలు చెల్లించేందుకు అంతర్గతంగా ఏర్పాట్లు చేస్తున్నారని, డీడీవోలు బిల్లులు సమర్పించకపోయినా, ఖజానా అధికారులు పాస్‌ చేయకపోయినా రాష్ట్ర స్థాయిలోనే సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా చెల్లింపులు చేసే ఏర్పాట్లు సాగుతున్నాయని చెబుతున్నారు. అయితే సీఎఫ్‌ఎంఎస్‌ రెండో భాగంలో ఉన్న ఆర్థికశాఖలోని నాలుగు విభాగాల ఉద్యోగులకు, అధికారులకు మాత్రమే అలా చెల్లించే అవకాశం ఉందని మిగిలిన వారికి అలా చెల్లింపులు జరపలేరని ఖజానా శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.

పీఆర్సీ కొత్త జీతాలు చేయొద్దు: ఏపీ ఐకాస

రాష్ట్రంలోని జీతాల డ్రాయింగ్‌ అధికారులు(డీడీఓ) కొత్త జీతాల ప్రక్రియను చేయొద్దని, పాత జీతాలను మాత్రమే చేయాలని ఏపీ ఐకాస ఛైర్మన్‌, ప్రధాన కార్యదర్శులు బండి శ్రీనివాసరావు, హృదయరాజు సూచించారు. ‘‘పీఆర్సీ ఉత్తర్వుల ప్రకారం జనవరి నుంచి కొత్త జీతాలను డీడీఓల ద్వారా బలవంతంగా వేలిముద్ర వేయించి, అనుమతించేలా అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. కొత్త పీఆర్సీ వద్దు.. పాత జీతాలే ముద్దు. ఫ్యాప్టో పిలుపుతో కలెక్టరేట్ల ముట్టడిలో పాల్గొన్న ఉపాధ్యాయులు, ఉద్యోగులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలి’’ అని డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని