రాజంపేటలో నిరసన సెగ

రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లా ఏర్పాటు ప్రతిపాదనపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అధికార వైకాపాతో పాటు తెదేపా, కాంగ్రెస్‌, సీపీఐ, వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో గురువారం భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు.

Published : 28 Jan 2022 02:59 IST

రాయచోటి జిల్లా కేంద్రాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన

ఈనాడు డిజిటల్‌, కడప: రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లా ఏర్పాటు ప్రతిపాదనపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అధికార వైకాపాతో పాటు తెదేపా, కాంగ్రెస్‌, సీపీఐ, వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో గురువారం భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. రాజంపేటను జిల్లా కేంద్రం చేస్తామని దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి గతంలో ఇచ్చిన హామీని నేతలు ప్రస్తావించారు. అన్నమయ్య జన్మస్థలం రాజంపేటలో కాదని రాయచోటిని జిల్లా కేంద్రంగా ఎంపిక చేయడమేంటని ప్రశ్నించారు. రాజంపేటకు చెందిన ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, జడ్పీ ఛైర్మన్‌ ఆకేపాటి అమరనాథరెడ్డి రాజీనామా చేసి ఆందోళనలో పాల్గొనాలని ఉద్యమకారులు డిమాండు చేశారు. లేదంటే సీఎం జగన్‌ వద్దకు వెళ్లి రాజంపేటను జిల్లా కేంద్రంగా చేసేలా ఒప్పించాలని కోరారు. న్యాయం జరగకపోతే ప్రజాప్రతినిధులంతా రాజీనామా చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. జిల్లా కేంద్రంగా రాయచోటి వద్దు... రాజంపేట ముద్దు అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. భారీ ర్యాలీతో పాత బస్టాండు వరకు చేరుకుని భారీ సభను నిర్వహించారు. వైకాపా నేతలే ఆందోళనకు నేతృత్వం వహించారు. రాజంపేట పురపాలక సంఘం ఛైర్మన్‌ శ్రీనివాసులురెడ్డి అధ్యక్షతన పురపాలక సంఘ అత్యవసర సమావేశం నిర్వహించారు. జిల్లా కేంద్రం రాజంపేటకు మార్చకపోతే 30న పాలకవర్గం మొత్తం రాజీనామా చేయాలని తీర్మానించారు. మరోవైపు కడప పేరును తొలగించి వైఎస్‌ఆర్‌ జిల్లాగా ప్రకటించడంపైనా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కడప గడ్డగా చెప్పుకొనే భాగ్యం లేకుండా కుట్ర చేస్తున్నారంటూ తెదేపా కడప పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు లింగారెడ్డి విమర్శించారు.


దేనికైనా సిద్ధమే

రాయచోటికి జిల్లా కేంద్రాన్ని మార్చి రాజంపేటకు తీవ్ర అన్యాయం చేశారు. న్యాయం చేయలేకపోతే ప్రజల్లో తిరగలేం. ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవాలి.

- పోలా శ్రీనివాసులురెడ్డి, ఛైర్మన్‌, రాజంపేట పురపాలక సంఘం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని