Updated : 03 Dec 2021 06:06 IST

నాయకత్వం మీకు దేవుడిచ్చిన హక్కా!

కాంగ్రెస్‌పై ప్రశాంత్‌ కిశోర్‌ వ్యాఖ్య

దిల్లీ, కోల్‌కతా: కాంగ్రెస్‌ పార్టీని, రాహుల్‌ గాంధీ నాయకత్వాన్ని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ గురువారం మరోసారి విమర్శించారు. విపక్ష కూటమికిగానీ, కాంగ్రెస్‌కుగానీ అధ్యక్షత వహించడం ఒక వ్యక్తికి ‘దేవుడు ఇచ్చిన హక్కు’ ఏమీ కాదని వ్యాఖ్యానించారు. గురువారం  ఆయన ట్వీట్‌ చేస్తూ ‘‘బలమైన ప్రతిపక్షం ఉండాలంటే కాంగ్రెస్‌ సిద్ధాంతాలు, ఉనికి చాలా అవసరం. అయితే కాంగ్రెస్‌ నాయకత్వం ఒక వ్యక్తికి ఉన్న ‘దైవ దత్త హక్కు’ ఏమీ కాదు. గత పదేళ్లలో 90 శాతం ఎన్నికలు ఓడిపోయిన దృష్ట్యా ఇలాంటి హక్కు ఉందని భావించలేరు. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రతిపక్ష నాయకత్వాన్ని నిర్ణయించుకోవాలి’’ అని పేర్కొన్నారు. తృణమూల్‌ కాంగ్రెస్‌కు రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న ఆయన ప్రస్తుతం ఆ పార్టీని జాతీయ స్థాయిలో విస్తరించడంపై దృష్టి సారించారు. అందులో భాగంగానే కాంగ్రెస్‌పై ఈ వ్యాఖ్య చేశారు.

కాంగ్రెస్‌ ఘాటు స్పందన

ప్రశాంత్‌ కిశోర్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ ఘాటుగానే స్పందించింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి పవన్‌ ఖేరా ట్వీట్‌ చేస్తూ ‘‘సిద్ధాంతాల పట్ల ఎలాంటి నిబద్ధత లేకుండా రాజకీయమే వృత్తిగా గల ఓ వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేసే విషయాలపై ఎవరికైనా సలహాలు ఇచ్చుకోవచ్చు. మన రాజకీయాలు ఎలా ఉండాలో ఆయన నిర్ణయించలేరు. ‘ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు రాహుల్‌గాంధీ ‘దైవిక కర్తవ్యా’న్ని నిర్వహిస్తున్నారు’’ అని వ్యాఖ్యానించారు. మమతా బెనర్జీ చేసిన విమర్శలపైనా స్పందించారు. ఆ ప్రాంతీయ నాయకురాలు యూపీఏలో భాగస్వామి కారని, అలాంటప్పుడు యూపీఏ లేదని ఎలా అనగలుతారని ప్రశ్నించారు.

మేము లేకుంటే ఆత్మ లేనట్టే: సిబల్‌

మమత వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కపిల్‌ సిబల్‌ స్పందించారు. ‘‘కాంగ్రెస్‌ లేకుంటే ఆత్మలేని శరీరంలా యూపీఏ ఉంటుంది. ప్రతిపక్షాలు ఐక్యతను ప్రదర్శించాల్సిన సమయమిది’’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా దిల్లీలో గురువారం విలేకర్లతో మాట్లాడుతూ.. రాజకీయ అవకాశవాదంతో దేశానికి, ప్రజాస్వామ్యానికి, సౌభ్రాతృత్వానికి ముప్పు వాటిల్లుతుందని పేర్కొన్నారు. వచ్చే ఏడాది గోవా, ఉత్తరాఖండ్‌ అసెంబ్లీలకు జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి కాకుండా.. పోటీగా బరిలో దిగాలని తృణమూల్‌ నిర్ణయించుకోవడంపై సుర్జేవాలా విమర్శలు గుప్పించారు. అలాంటి నిర్ణయాలు ప్రధాని మోదీకి సాయం చేసేవి కావా అని ప్రశ్నించారు. మోదీ తరహాలోనే మమత చట్టసభ్యులను కొనుగోలు చేస్తున్నారని, పార్టీలను విభజిస్తున్నారని ఆరోపించారు.


హస్తానికి 300 సీట్లు కష్టమే : ఆజాద్‌

చ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి ఆశాజనకంగా ఉండే అవకాశాలు కనిపించడం లేదని ఆ పార్టీ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ అన్నారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 300కు పైగా సీట్లు సాధించే అవకాశాలపైనా ఆయన సందేహం వ్యక్తం చేశారు. కానీ, తమ పార్టీ మూడొందల స్థానాలు గెలుచుకోవాలని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. ఈ మేరకు జమ్మూ-కశ్మీర్‌లోని పూంఛ్‌లో గురువారం నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. ‘‘ఆర్టికల్‌-370పై సుప్రీంకోర్టు మాత్రమే నిర్ణయం తీసుకోగలదు. ప్రస్తుత ప్రభుత్వమే దాన్ని రద్దు చేసినందున, మళ్లీ దాన్ని ఎలా తీసుకొస్తుంది? సాధారణంగా కేంద్రపాలిత ప్రాంతాలను రాష్ట్రాలుగా మార్చుతారు. మోదీ ప్రభుత్వం మాత్రం రాష్ట్రాన్ని యూటీ స్థాయికి దిగజార్చింది. ఈ పరిణామం.. డీజీపీని స్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్‌ పోస్టుకు బదిలీ చేసినట్టు ఉంది’’ అని ఆజాద్‌ ఎద్దేవా చేశారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని