సీబీఐ అధికారుల ప్రాణాలకు ముప్పు

మాజీ మంత్రి, సీఎం జగన్‌మోహన్‌రెడ్డి బాబాయ్‌ వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారుల ప్రాణాలకు ముప్పుందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ఆందోళన

Published : 24 Feb 2022 04:26 IST

దస్తగిరి వాంగ్మూలంతో నిందితులెవరో తేలిపోయింది

తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: మాజీ మంత్రి, సీఎం జగన్‌మోహన్‌రెడ్డి బాబాయ్‌ వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారుల ప్రాణాలకు ముప్పుందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. వారికి ఏ క్షణంలో ఏమైనా జరగొచ్చని హెచ్చరించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. సొంత బాబాయ్‌ హత్య కేసు నిందితులను కాపాడటానికి స్వయంగా సీఎం జగనే రంగంలోకి దిగడం దారుణమన్నారు. ‘వివేకా హత్యకేసును సీబీఐ ఛేదిస్తున్న తరుణంలో విచారణలో కీలకంగా వ్యవహరిస్తున్న సీబీఐ అధికారి రాంసింగ్‌పై తప్పుడు కేసులు పెట్టించి, సీబీఐనే బెదిరిండానికి జగన్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఏపీ పోలీసుల సాయంతో సీబీఐ అధికారుల ఫోన్లు ట్యాప్‌ చేయిస్తున్నారు. గతంలో తమిళనాడు సీఎం జయలలితపై వచ్చిన ఆరోపణలను ఆ రాష్ట్రంలో కాక సీబీఐ కర్ణాటక నుంచి దర్యాప్తు చేసింది. అవే పరిస్థితులు ఇప్పుడు ఏపీలోనూ ఉన్నాయి. వివేకానందరెడ్డి మరణించినప్పుడు ఎంపీ అవినాష్‌రెడ్డి ఆదేశాలతో తన తండ్రి మృతదేహానికి కుట్లు వేసిన ఉదయ్‌కుమార్‌రెడ్డిని హత్యకేసులో ప్రధాన నిందితుడిగా పరిగణించాలని వైఎస్‌ వివేకా కుమార్తె డాక్టర్‌ సునీత గతంలోనే హైకోర్టులో పిటిషన్‌ వేశారు. అలాంటి ఉదయ్‌కుమార్‌రెడ్డితో సీబీఐ అధికారులపై తప్పుడు కేసులు పెట్టించారు. నాడు సిట్‌ బృందంలో అధికారిగా ఉన్న అభిషేక్‌ మహంతి.. ఉదయ్‌కుమార్‌రెడ్డిని అరెస్టు చేసి తీసుకెళుతుంటే తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి అతడిని వదిలేయాలని ఆదేశాలు వచ్చాయి. వైకాపా అధికారంలోకి వచ్చాక అడిషనల్‌ డీజీ స్థాయి అధికారి నేతృత్వంలోని సిట్‌ను, ఎస్పీ స్థాయికి దిగజార్చింది. సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో తనను అవినాష్‌రెడ్డి ఎలా ప్రలోభపెట్టింది దస్తగిరి వివరించారు.  దీన్ని బట్టే అసలు దోషులెవరో అర్థమవుతోంది. దస్తగిరి అప్రూవర్‌గా మారగానే అతన్ని లొంగదీసుకోవడానికి అవినాష్‌రెడ్డి ప్రయత్నించారు. ఇక అవినాష్‌రెడ్డికి హత్య కేసుతో సంబంధం లేదని ప్రభుత్వ పెద్దలు ఎలా చెబుతారు’ అని బొండా ఉమా ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని