AP News: ఇంకా అప్పు తెచ్చుకుంటాం అనుమతివ్వరూ..

కొత్త రుణాలకు కేంద్ర ప్రభుత్వ అనుమతుల కోసం రాష్ట్రం నిరీక్షిస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ ఓవర్‌ డ్రాఫ్టులో ఉంది. రూ.1,400 కోట్ల ఓడీ సౌకర్యాన్ని పూర్తిగా వినియోగించుకున్నట్లు సమాచారం. రాష్ట్రానికి నగదు

Updated : 16 Dec 2021 05:11 IST

కేంద్ర అంగీకారం కోసం రాష్ట్రం నిరీక్షణ

ముగిసిన 9 నెలల రుణ పరిమితి

ఓవర్‌ డ్రాఫ్టులో రాష్ట్రం

ఈనాడు - అమరావతి

కొత్త రుణాలకు కేంద్ర ప్రభుత్వ అనుమతుల కోసం రాష్ట్రం నిరీక్షిస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ ఓవర్‌ డ్రాఫ్టులో ఉంది. రూ.1,400 కోట్ల ఓడీ సౌకర్యాన్ని పూర్తిగా వినియోగించుకున్నట్లు సమాచారం. రాష్ట్రానికి నగదు అందుబాటులో లేనప్పుడు బిల్లులు, ఇతరత్రా చెల్లింపులకు వేస్‌ అండ్‌ మీన్స్‌, ప్రత్యేక డ్రాయింగు సదుపాయాలను ప్రభుత్వాలు వినియోగించుకుంటాయి. కరోనా నేపథ్యంలో కేంద్రం ఈ వెసులుబాట్లలో మరింత సడలింపు ఇచ్చింది. వేస్‌ అండ్‌ మీన్స్‌ కింద రూ.2,416 కోట్లు, ప్రత్యేక డ్రాయింగ్‌ సదుపాయం కింద రూ.900 కోట్లు వినియోగించుకున్న తర్వాత ఓడీ సౌలభ్యమూ వాడుకోవచ్చు. వీటన్నింటిపై 4% వడ్డీ చెల్లించాలి. నెలవారీ అవసరాల కోసం రాష్ట్రం బహిరంగ మార్కెట్‌లో రుణాలను సమీకరిస్తుంది. ఆర్థిక సంవత్సరంలో 9 నెలలు ముగియడంతో కేంద్రం నుంచి కొత్త రుణ పరిమితి కోసం ఎదురుచూస్తోంది. ఈ నెలాఖరుకు అది రావచ్చని అంచనా. నెలకు సగటున రూ.4,000 కోట్ల వరకు ప్రభుత్వం రిజర్వు బ్యాంకు నుంచి రుణం పొందుతూ అవసరాలు తీర్చుకుంటోంది. డిసెంబరు నెలాఖరుకు కేంద్రం ఇచ్చిన రుణపరిమితి మేరకు అప్పులు తెచ్చుకుని రాష్ట్రం వాడేసింది.

కార్పొరేషన్ల పేరిట కొత్త రుణాలు

మరోవైపు కార్పొరేషన్ల పేరిట కొత్త రుణాల సమీకరణ ప్రయత్నాలు మొదలయ్యాయి. ప్రభుత్వం తన గ్యారంటీల పరిమితిని చట్ట సవరణ ద్వారా రెవెన్యూ రాబడిలో 90% నుంచి 180%కు పెంచుకుంది. ఈ క్రమంలో పౌర సరఫరాల సంస్థ రూ.5,000 కోట్లు తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. కొత్తగా గ్యారంటీలు రావడంతో ఈ అనుమతులు మంజూరవుతున్నాయి. కిందటి ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర రెవెన్యూ రాబడి రూ.1,18,063 కోట్లు. అందులో 180% అంటే రూ.2.12 లక్షల కోట్ల వరకు కార్పొరేషన్లు అప్పులు చేసుకోవచ్చు.


రూ.31,251.51 కోట్ల రుణం

ఈ ఆర్థిక సంవత్సరంలో రెండు విడతలుగా కేంద్రం రూ.20,751.51 కోట్లకు, రూ.10,500 కోట్లకు బహిరంగ మార్కెట్‌ రుణాలకు అనుమతిచ్చింది. ఈ మొత్తాన్ని ఈ నెల మొదట్లోనే వాడేశాం. బహిరంగ మార్కెట్‌ రుణానికి, మూలధన వ్యయానికి ముడిపెట్టిన కేంద్రం.. రూ.5,309 కోట్ల మేర కోత పెట్టింది. తొలి మూడు నెలల తర్వాత మూలధనం తీరును సమీక్షించి రూ.2,655 కోట్ల మేర ప్రభుత్వానికి రుణ అవకాశం కల్పించింది. ఇప్పుడు కేంద్రం చెప్పినంతగా రాష్ట్రంలో పెట్టుబడి వ్యయం చేయలేదు. దీంతో ఆ మేరకు రుణ పరిమితిని పొందే అవకాశం లేకుండా పోయింది. రాష్ట్ర విభజన- రెవెన్యూ లోటుతో ముడిపెడుతూ ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వాలని రాష్ట్రం కోరుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని