Encounter: భారీ ఎన్‌కౌంటర్‌

మహారాష్ట్రలో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గడ్చిరోలి జిల్లా ధనోరా తాలూకాలోని గ్యార్‌పట్టి అడవుల్లో శనివారం మధ్యాహ్నం ఎదురుకాల్పుల్లో కనీసం 26 మంది మావోయిస్టులు మృతి చెందారు.

Updated : 14 Nov 2021 05:18 IST

26 మంది మావోయిస్టుల మృతి
వారిలో కేంద్ర కమిటీ సభ్యుడు తేల్‌తుంబ్డే?
ముగ్గురు జవాన్లకు తీవ్ర గాయాలు

బల్లార్ష-న్యూస్‌టుడే, నాగ్‌పుర్‌, ముంబయి: మహారాష్ట్రలో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గడ్చిరోలి జిల్లా ధనోరా తాలూకాలోని గ్యార్‌పట్టి అడవుల్లో శనివారం మధ్యాహ్నం ఎదురుకాల్పుల్లో కనీసం 26 మంది మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో కేంద్ర కమిటీ సభ్యుడు మిలింద్‌ తేల్‌తుంబ్డే కూడా ఉన్నట్లు భావిస్తున్నారు. పోలీసులు దీనిని ధ్రువీకరించాల్సి ఉంది. కోరేగావ్‌ భీమా-మావోయిస్టుల సంబంధాల కేసులో బలగాలు వెతుకుతున్న నిందితుల్లో తేల్‌తుంబ్డే ఒకరనీ, మృతుల్లో అతను ఉన్నాడా లేదా తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని మహారాష్ట్ర హోం మంత్రి దిలీప్‌ వాల్సే పాటిల్‌ ఒక వార్తాసంస్థకు తెలిపారు. ఈ ఏడాది చేపట్టిన వాటిలో అతిపెద్ద ఆపరేషన్‌ ఇదేనని భావిస్తున్నారు. మృతదేహాలను గుర్తించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.

ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దును ఆనుకుని ఉండే గడ్చిరోలి జిల్లాలో గ్యార్‌పట్టి అడవుల్లో మావోయిస్టు ఏరివేత చర్యల్ని సి-60 కమాండోలు పెద్దఎత్తున చేపట్టారు. ఈ క్రమంలో మావోయిస్టులు తారసపడి, వారిపై కాల్పులకు దిగారని అధికారులు తెలిపారు. సి-60 దళాలు ఎదురు కాల్పులకు దిగడంతో కనీసం 26 మంది మృతి చెందగా కొందరు మాత్రం అడవిలోకి పారిపోయారని చెప్పారు. ఘటన జరిగిన ప్రాంతం దట్టమైన అడవుల్లో ఉండడంతో అక్కడకు చేరుకోవడమూ క్లిష్టతరంగా మారింది. ఘటన స్థలంలో మావోయిస్టుల మృతదేహాలతో పాటు ఆయుధాలను, పేలుడు పదార్థాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతి చెందినవారి వివరాలు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఎదురుకాల్పుల్లో నలుగురు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం నాగ్‌పుర్‌కు హెలికాప్టర్లో తరలించారు.

సి-60 ప్రత్యేకత ఇదీ..

మావోయిస్టులకు పెద్దఎత్తున నష్టం కలిగించిన సి-60 దళం 1992లో ఏర్పాటైంది. మొదట దీనిలో 60 మంది పోలీసులు ఉండేవారు. అప్పటి గడ్చిరోలి ఎస్పీ కె.పి.రఘువంశీకి వచ్చిన ఆలోచన మేరకు ఆయన నేతృత్వంలోనే ఇది ఏర్పాటైంది. హైదరాబాద్‌లోని గ్రేహౌండ్స్‌తో పాటు హజారీబాగ్‌ (బిహార్‌), నాగ్‌పుర్‌లలో ఉన్న శిక్షణ సంస్థల నిపుణుల పర్యవేక్షణలో బలగం రాటుదేలింది. మావోయిస్టులపై పోరుకు స్థానిక గిరిజన ప్రజలనే వాడుకోవడం సి-60 దళాలతో మొదలైంది. గెరిల్లా పోరాట రీతులు సహా వివిధ రూపాల్లో వీరికి శిక్షణ ఇస్తారు. మొదట 15 బృందాలతో సి-60 దళం ఏర్పాటైంది. స్థానికులతో స్థానిక భాషలో మాట్లాడగలగడం, అక్కడి భౌగోళిక స్వరూపంపై పూర్తి అవగాహన ఉండడం వల్ల ఇతర బలగాలతో పోలిస్తే ఈ దళాలు వేగంగా చొచ్చుకుపోతుంటాయి. మావోయిస్టులపై పోరాడడంతో పాటు వారిని లొంగుబాటుకు ఒప్పించే పనిని కూడా ఇదే దళం చూస్తుంటుంది. ఆ క్రమంలో మావోయిస్టుల కుటుంబ సభ్యులతోనూ వీరు మాట్లాడతారు.

అత్యంత సున్నితం.. గ్యార్‌పట్టి

ఛత్తీస్‌గఢ్‌లోని మొహల్లా జిల్లాకు ఆనుకుని ఉండే జిల్లా గడ్చిరోలి. దీనిలో ఒకటైన గ్యార్‌పట్టి పోలీసు స్టేషన్‌.. మావోయిస్టుల కార్యకలాపాల పరంగా అత్యంత సున్నితమైనది. ఎత్తైన కొండలు, దట్టమైన కీకారణ్యం నడుమ ఇది ఉండడం దీనికి కారణం. ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్‌ మొహల్లాలో, ఇటు గడ్చిరోలిలో మావోల కార్యకలాపాలు ముమ్మరంగా సాగుతుంటాయి. మావోల కదలికలు ఎక్కువగా ఉన్నాయన్న సమాచారంతో శుక్రవారం సాయంత్రం నుంచే భద్రత బలగాలు ఆ ప్రాంతాన్ని జల్లెడపట్టాయి. శనివారం మావోలు, బలగాలు పరస్పరం తారసపడినప్పుడు ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఆ వెంటనే అదనపు బలగాలతో హెలికాప్టర్లను జిల్లా కేంద్రం నుంచి ఘటనాస్థలికి పంపించారు. అప్పటికే సి-60 దళాలు పది అక్కడ ఉన్నాయి.


ఎన్‌కౌంటర్‌ మృతుల్లో తెలంగాణ వారున్నారా?

ఈనాడు, హైదరాబాద్‌: గడ్చిరోలి ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టుల్లో తెలంగాణకు చెందిన వారున్నారా? అనే కోణంలో రాష్ట్ర నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. తెలంగాణ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం వద్ద గోదావరి నదిని దాటితే గడ్చిరోలి జిల్లాలోని సిరొంచ తాలూకా ప్రారంభమవుతుంది. తెలంగాణకు చెందిన పడకల్‌స్వామి ప్రస్తుతం గడ్చిరోలి అడవుల్లో కార్యకలాపాలు సాగిస్తున్నాడు. శనివారం ఎన్‌కౌంటర్‌ జరిగిన అడవుల్లోనే ప్లటూన్‌ కమాండర్‌గా పనిచేస్తున్నట్లు నిఘా వర్గాలకు సమాచారముంది. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన స్వామి దాదాపు రెండు దశాబ్దాల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లాడు. అప్పటినుంచి ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్రల్లో కార్యకలాపాలు సాగిస్తున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని