Updated : 24 Nov 2021 05:11 IST

AP Legislative Council: మండలి రద్దుపై మడమ తిప్పిన సర్కారు

గతంలో చేసిన రద్దు తీర్మానాన్ని ఉపసంహరించుకున్న ప్రభుత్వం
సభ్యుల్లో అనిశ్చితి తొలగించేందుకేనని వెల్లడి
తీర్మానాన్ని ప్రవేశ పెట్టిన మంత్రి బుగ్గన
ఈనాడు - అమరావతి

శాసన మండలి రద్దుకు గతంలో చేసిన తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. మండలిని కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. మండలిని రద్దు చేయాలని శాసనసభలో చేసిన తీర్మానం కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నందున సభ్యుల్లో నెలకొన్న అనిశ్చితి, సందిగ్ధత తొలగించేందుకే కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. వివిధ స్థాయుల్లో ప్రయత్నాలు చేసినా, శాసనసభ తీర్మానంపై చర్య తీసుకోవడంలో భారత ప్రభుత్వం విఫలమైందని పేర్కొంది. ఈ మేరకు 2020 జనవరి 27న చేసిన ‘శాసన మండలి రద్దు’ తీర్మానం ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మంగళవారం శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టారు. దీన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.

ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ..‘‘2019లో ప్రభుత్వం తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయాలు వెంటనే చట్ట రూపంలో అమలు కావాలనే ఉద్దేశం ఉండగా.. వివిధ కారణాలతో ఆలస్యమయ్యాయి. వీటిపై శాసనసభలో చర్చించాం. ప్రజాస్వామ్యంలో ప్రజలతో ఎన్నికైన వారే సుప్రీం ప్రజాప్రతినిధులు. శాసన మండలి సలహాలు ఇచ్చేందుకు అదనంగా మాత్రమే ఉంటుంది. ఇది ప్రజాస్వామ్యానికి ప్రయోజనంగా ఉంటుంది. 2020 జనవరి 27న అప్పటి పరిస్థితులను అనుసరించి మండలి రద్దుకు తీర్మానం చేశాం. శాసన సభలో విద్యావంతులు ఉన్నందున మండలి అవసరం లేదని చర్చించిన తర్వాత తీర్మానం చేసి, కేంద్ర ప్రభుత్వానికి పంపించాం. అది అక్కడ పెండింగ్‌లో ఉంది. ప్రస్తుతం శాసనమండలి కొనసాగుతున్నందున సభ్యుల పదవీకాలం ఎప్పటి వరకు ఉంటుందనే దానిపై అనిశ్చితి ఏర్పడుతోంది. అనిశ్చితిలో జరిగే సమావేశాల్లో సానుకూల నిర్ణయాలు రాకపోవచ్చు. హోం మంత్రిత్వ శాఖ వద్ద మండలి రద్దు తీర్మానం పెండింగ్‌లో ఉన్నందున పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్తగా వచ్చేవారు విద్యావంతులు, ప్రజలకు సేవ చేసేవారు వస్తున్నారు. మండలి ఛైర్మన్‌గా దళిత వర్గానికి చెందిన వ్యక్తి ఎన్నికయ్యారు. కొత్త సభ్యులు సూచనలు, సలహాలు ఇస్తూ ప్రతి ఒక్కటీ రాజకీయం చేయకూడదనే ఆలోచనతో ఉంటారనే ఉద్దేశంతో శాసనమండలిని కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నాం’’ అని వెల్లడించారు.


14 బిల్లులకు శాసనసభ ఆమోదం

శాసనసభలో మంగళవారం అసైన్డ్‌ భూముల బదలాయింపు నిషేధ చట్ట సవరణ -2021 బిల్లును ఆమోదించారు. ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ సవరణ బిల్లు-2021కి కూడా సభ ఆమోదం తెలియజేసింది. వీటితో పాటు మొత్తం 14 బిల్లులను మంగళవారం శాసనసభ ఆమోదించింది. సినిమా నియంత్రణ చట్ట సవరణ, మోటారు వాహనాల పన్నుల చట్ట సవరణ బిల్లులతో పాటు విద్యాసంస్థల్లో టీచర్ల క్యాడర్‌కు సంబంధించిన రిజర్వేషన్ల బిల్లును, వ్యవసాయ, వ్యవసాయేతర జోన్ల సవరణ బిల్లును ప్రవేశపెట్టారు.

 

 

Read latest Ap top news News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని