Vaccine: బూస్టర్‌కు సిద్ధంగా ఉండాలి

కేంద్ర మార్గదర్శకాలు అనుసరించి బూస్టర్‌ డోసు (టీకా) పంపిణీకి సిద్ధంగా ఉండాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వృద్ధులకు ఈ డోసు పంపిణీకి తగ్గట్లుగా అవసరమైన

Updated : 28 Dec 2021 04:56 IST

కరోనా చికిత్సలో జాప్యం జరగకూడదు
వైద్య, ఆరోగ్యశాఖలో సాధారణ బదిలీలకు ఆమోదం
కొవిడ్‌ నియంత్రణ చర్యలపై సీఎం జగన్‌ సమీక్ష

ఈనాడు, అమరావతి: కేంద్ర మార్గదర్శకాలు అనుసరించి బూస్టర్‌ డోసు (టీకా) పంపిణీకి సిద్ధంగా ఉండాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వృద్ధులకు ఈ డోసు పంపిణీకి తగ్గట్లుగా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. తాడేపల్లి కార్యాలయంలో సోమవారం కొవిడ్‌ నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్‌, ఇతర అంశాలను ఆయన సమీక్షించారు. ‘కొవిడ్‌ కేసులు పెరిగినా బాధితులకు చికిత్స అందించడంలో జాప్యం జరగకూడదు. ఇందుకు ప్రభుత్వాసుపత్రులతో పాటు ప్రైవేటు ఆసుపత్రులను సిద్ధం చేయాలి. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే వారికి పరీక్షలు తప్పకుండా జరగాలి. ఒకవేళ పాజిటివ్‌ అని తేలితే వారితో సన్నిహితంగా మెలిగిన వారికి వెంటనే పరీక్షలు చేయాలి. రాష్ట్రంలో ఆరు ఒమిక్రాన్‌ కేసులు రాగా... ఎవరూ ఆసుపత్రుల్లో చేరలేదు. ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రానికి రాకపోకలు కొనసాగుతున్నందున పరిస్థితులను నిశితంగా గమనిస్తూ అవసరమైన చర్యలను అధికారులు తీసుకోవాలి. ఫీవర్‌ సర్వేలో భాగంగా ఇంటింటికి వెళ్లినప్పుడు టీకా వేయించుకోని వారి వివరాలను సచివాలయాల వారీగా సేకరించాలి. వారికి టీకా ఇవ్వాలి. దీని పురోగతిపై మళ్లీ వచ్చే వారం సమీక్షిస్తా. నాడు-నేడు కింద కొత్త, ప్రస్తుత ఆసుపత్రుల్లో పనులను వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. జిల్లాల్లో మెడికల్‌ హాబ్స్‌ ఏర్పాటు చర్యలను ముమ్మరం చేయాలి. ఇవి ఏర్పాటైతే ఆధునిక వైద్యం ప్రజలకు అందుబాటులోకి వస్తుంది’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

కొత్త నియామకాలను పూర్తి చేయాలి
వైద్య, ఆరోగ్యశాఖలో సాధారణ బదిలీలకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. ‘వచ్చే ఫిబ్రవరి నాటికి ప్రతి ఆసుపత్రిలో నిర్దేశిత సంఖ్యలో సిబ్బంది ఉండాలి. ఈలోగా కొత్త నియామకాలను పూర్తి చేయాలి’ అని ఆదేశించారు. 13 జిల్లాల్లో కలిపి 98.96% మందికి తొలి డోసు పంపిణీ పంపిణీ పూర్తి చేసినట్లు వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు సీఎంకు వివరించారు. తొలి డోసు పొందిన వారిలో 71.76% మందికి రెండు డోసులు అందించామన్నారు. ‘తొలి డోసు ... నెల్లూరు, విజయనగరం, ప్రకాశం, అనంతపురం, పశ్చిమగోదావరి, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో పూర్తిగా... కడపలో 98.93%, విశాఖపట్నంలో 98.04%, గుంటూరులో 97.58%, తూర్పుగోదావరిలో 97.43, కృష్ణాలో 97.12%, శ్రీకాకుళంలో 96.70% పంపిణీ జరిగింది...’ అని వారు వివరించారు. 15 నుంచి 18 ఏళ్ల వారితో కలిపి రాష్ట్రంలో సుమారు 75 లక్షల మంది ఉన్నారన్నారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి (వైద్యం) ఆళ్లనాని, ఇతర అధికారులు   పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని