Supreme Court: చట్టసభల సభ్యులపై కేసుల్లో.. సత్వర విచారణ చేపట్టాలి

చట్టసభల సభ్యులపై నమోదైన క్రిమినల్‌ కేసుల్లో విచారణను వేగవంతం చేయాలంటూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్‌ దాఖలైంది. దీన్ని అత్యవసరంగా పరిశీలించేందుకు... ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం

Updated : 10 Feb 2022 03:57 IST

సుప్రీంలో ప్రజాప్రయోజన వ్యాజ్యం
అత్యవసర పరిశీలనకు అంగీకరించిన సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ధర్మాసనం

దిల్లీ: చట్టసభల సభ్యులపై నమోదైన క్రిమినల్‌ కేసుల్లో విచారణను వేగవంతం చేయాలంటూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్‌ దాఖలైంది. దీన్ని అత్యవసరంగా పరిశీలించేందుకు... ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం అంగీకరించింది. సీనియర్‌ న్యాయవాది, కోర్టు సహాయకులు విజయ్‌ హన్సారియా ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రస్తుత, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై నమోదైన కేసుల వివరాలతో కూడిన తాజా నివేదికను దీనికి జత చేశారు. వీటిని పరిష్కరించేందుకు తక్షణ, కఠిన చర్యలు అవసరమని; సీబీఐ తదితర ఏజెన్సీల ద్వారా దర్యాప్తును వేగవంతం చేయాలని పిటిషనర్‌ అభ్యర్థించారు. ఈ వ్యాజ్యాన్ని పరిశీలిస్తామని ధర్మాసనం పేర్కొంది. జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్న, జస్టిస్‌ హిమా కోహ్లిలు కూడా ఈ ధర్మాసనంలో ఉన్నారు. తాజా నివేదిక ప్రకారం- చట్టసభల సభ్యులపై మొత్తం 4,984 కేసులు అపరిష్కృతంగా ఉన్నాయి. వీటిలో 1,899 కేసుల విచారణ ఐదేళ్లు దాటింది.చట్టసభల సభ్యులపై నమోదైన కేసులను, సీబీఐ తదితర ఏజెన్సీల ద్వారా దర్యాప్తును వేగవంతం చేయాలని కోరుతూ... న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ దాఖలుచేసిన కేసులో సుప్రీంకోర్టు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీచేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని