డయాఫ్రం వాల్‌ ఎక్కడైనా నిర్మించాల్సిందేనట!

‘శ్రీశైలం, నాగార్జునసాగర్‌, తుంగభద్ర, భాక్రానంగల్‌ ప్రాజెక్టుల్లో డయాఫ్రం వాల్‌ నిర్మించినా అవి ఎక్కడా ధ్వంసం కాలేదు. ఒక్క పోలవరంలోనే అది ధ్వంసమైంది. అసలు ప్రాజెక్టులు ఎక్కడ నిర్మించినా సరే డయాఫ్రం వాల్‌ నిర్మించాల్సిందే’ ఈ మాటలన్నది ఎవరో కాదు... సాక్షాత్తూ కొత్త జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు.

Updated : 22 Apr 2022 07:35 IST

శ్రీశైలం, నాగార్జునసాగర్‌, తుంగభద్ర, భాక్రానంగల్‌లోనూ కట్టారట
అక్కడ ఎక్కడా ధ్వంసం కాలేదు..  పోలవరంలోనే దెబ్బతింది
కొత్త జలవనరుల మంత్రి  అంబటి రాంబాబు ఆసక్తికర ఉవాచ
ఆ తర్వాత సలహాదారుని అడిగి  సవరించుకున్న వైనం

- ఈనాడు, అమరావతి

విలేకరులతో తొలుత..‘శ్రీశైలం, నాగార్జునసాగర్‌, తుంగభద్ర, భాక్రానంగల్‌ ప్రాజెక్టుల్లో డయాఫ్రం వాల్‌ నిర్మించినా అవి ఎక్కడా ధ్వంసం కాలేదు. ఒక్క పోలవరంలోనే అది ధ్వంసమైంది. అసలు ప్రాజెక్టులు ఎక్కడ నిర్మించినా సరే డయాఫ్రం వాల్‌ నిర్మించాల్సిందే’ ఈ మాటలన్నది ఎవరో కాదు... సాక్షాత్తూ కొత్త జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు. పోలవరం ప్రాజెక్టులో నిర్మించిన డయాఫ్రం వాల్‌ ధ్వంసమైందని, దాన్ని సరిచేయాలా కొత్తగా నిర్మించాలా అన్న విషయమై నిపుణులంతా మేధోమథనం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో డయాఫ్రం వాల్‌లు నిర్మించలేదు అని విలేకరులు చెప్పగా.. ‘లేదు నిర్మించారు... దేశంలో అసలు ఎక్కడ ప్రాజెక్టు కట్టినా డయాఫ్రం వాల్‌ నిర్మించాల్సిందే’ అని ఉద్ఘాటించారు. అలా అవసరం లేదని మళ్లీ కొందరు విలేకరులు అనగా.. కాదు కట్టాల్సిందేనని చెప్పారు. పోలవరంలోనే డయాఫ్రం వాల్‌ నిర్మించారని మళ్లీ చెప్పగా... తాను అధికారులను అడిగి తెలుసుకుంటానన్నారు.

సలహాదారుతో మాట్లాడిన తర్వాత..!
ఇంతలో ఆయన సమీపంలో ఉన్న జలవనరులశాఖ సలహాదారు... మంత్రితో మాట్లాడుతూ సోమశిలలోనూ డయాఫ్రం వాల్‌ కట్టారని చెప్పారు. ఆయన కూడా శ్రీశైలం, నాగార్జునసాగర్‌, భాక్రానంగల్‌, తుంగభద్రలో డయాఫ్రం వాల్‌లు నిర్మించారని చెప్పలేదు. దీంతో తాను ఇంకా అధ్యయనం చేయాల్సి ఉందని మంత్రి సరి చేసుకున్నారు. తాను ఇంజినీరునో.. గుత్తేదారునో కాదని, అన్ని ప్రాజెక్టులపై అధ్యయనం చేస్తానని చెప్పారు. సమాచారశాఖ వారు విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తేనే తాను మాట్లాడుతున్నానన్నారు. ఇంకా తాను ప్రాజెక్టులపై అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. అన్ని ప్రాజెక్టులు తిరిగి చూసి, నేర్చుకుని, ఆ తర్వాత అన్ని అంశాలకు సమాధానం ఇస్తానని మంత్రి చెప్పారు. అసలు పోలవరంలో డయాఫ్రం వాల్‌ దెబ్బతినడానికి చంద్రబాబు, అప్పటి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కారణమని మంత్రి రాంబాబు చెప్పారు. ఈ ప్రాజెక్టులో రీ డిజైన్‌ చేయాల్సిన పరిస్థితి ఇందుకే వచ్చిందన్నారు. పోలవరంలో ఇలా ముందే డయాఫ్రం వాల్‌ నిర్మించడానికి రాజకీయ నిర్ణయాలు కారణమా? అధికారుల నిర్ణయాలు కారణమా? అని విలేకరులు ప్రశ్నించారు. ఏ అధికారులు బాధ్యులని అడిగారు. ఆ అధికారులు ఇప్పుడూ ఉన్నారు కదా... వాళ్లు ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నిస్తే తాను అన్నీ తెలుసుకుని మాట్లాడతానని చెప్పారు. ఈ నెల 21, 22 తేదీల్లో పోలవరంపై నిపుణుల సమావేశం నిర్వహించాల్సి ఉన్నా, అది వాయిదా పడిందని మంత్రి చెప్పారు. దీనికి పరిష్కారం ఏమిటో నిపుణులే తేల్చాల్సి ఉంటుందన్నారు.

గండికోట-పైడితల్లి ఎత్తిపోతలపై తొలి సంతకం
సచివాలయంలో తనకు కేటాయించిన ఛాంబర్‌లో జలవనరుల శాఖ మంత్రిగా అంబటి రాంబాబు గురువారం బాధ్యతలు స్వీకరించారు. గండికోట-పైడిపల్లి ఎత్తిపోతల పథకం నిర్వహణ గ్రాంటు రూ.4.70 కోట్లకు అనుమతిస్తూ తొలి సంతకం చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని మడ్డువలస ప్రాజెక్టు ఫేజ్-2లో ఐదు కిలోమీటర్ల కాల్వ తవ్వడానికి రూ.26.09 కోట్లు మంజూరు చేస్తూ మరో సంతకం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని