PM Modi: పెట్రో ఉత్పత్తులపై వ్యాట్‌ తగ్గించండి

భాజపాయేతర పార్టీలు అధికారంలో ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాల్లో ఇంధన ధరలు అధికంగా ఉన్నాయంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పెదవి విరిచారు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా పెట్రో ఉత్పత్తులపై

Updated : 28 Apr 2022 05:44 IST

తెలంగాణ, ఏపీ సహా పలు రాష్ట్రాలకు ప్రధాని వినతి

పన్ను తగ్గించకపోతే ప్రజలను మోసం చేసినట్లే

6 నెలల్లో ఆర్జించిన అదనపు ఆదాయం చాలు

ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మోదీ కీలక వ్యాఖ్యలు

ఈనాడు, దిల్లీ: భాజపాయేతర పార్టీలు అధికారంలో ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాల్లో ఇంధన ధరలు అధికంగా ఉన్నాయంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పెదవి విరిచారు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా పెట్రో ఉత్పత్తులపై విలువ ఆధారిత పన్ను (వ్యాట్‌) తగ్గించాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. దేశవ్యాప్తంగా కొవిడ్‌ తీవ్రతను సమీక్షించేందుకు ముఖ్యమంత్రులతో బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘గత ఏడాది నవంబర్‌లో కేంద్రప్రభుత్వం పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్‌ పన్ను తగ్గించింది. ఆ మేరకు తమ పరిధిలో వ్యాట్‌ తగ్గించాలని రాష్ట్రాలకు పిలుపునిచ్చింది. ప్రతిపక్ష పార్టీల పాలనలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలు ఆ విన్నపాన్ని పట్టించుకోలేదు. ఇది ఒకరకంగా ఆ రాష్ట్రాల ప్రజలను మోసం చేసినట్లే. ఆయా ప్రభుత్వాలు ఇకనైనా వ్యాట్‌ను తగ్గించి సొంత ప్రజల ప్రయోజనాలను కాపాడాలి. ఈ ఆరు నెలల్లో ఆర్జించిన అదనపు ఆదాయం చాలు’’ అని మోదీ పేర్కొన్నారు. ఉక్రెయిన్‌ సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసు ప్రభావితమైందని ప్రధాని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పరస్పర సహకారం ఇంకా పెరగాలని, సమాఖ్య వ్యవస్థ భావన మరింతగా ఇనుమడించాలని వ్యాఖ్యానించారు. వ్యాట్‌ను తగ్గించకపోవడంతో జైపుర్‌, హైదరాబాద్‌, కోల్‌కతా, ముంబయి వంటి నగరాల్లో లీటరు పెట్రోల్‌ ధర ప్రస్తుతం ఎంత ఎక్కువగా ఉందో ఆయన తెలిపారు.

కరోనాను నిర్లక్ష్యం చేయొద్దు

దేశంలో కరోనా ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కొన్ని రాష్ట్రాల్లో కేసులు మళ్లీ పెరుగుతున్న సంగతిని గుర్తుచేశారు. మహమ్మారిని ఎంతమాత్రమూ నిర్లక్ష్యం చేయొద్దని ముఖ్యమంత్రులకు సూచించారు. ‘‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్నాళ్లూ కలిసికట్టుగా పనిచేసి.. మహమ్మారి విసిరిన సవాళ్లను ఎదుర్కొన్నాయి. అందుకుగాను సీఎంలు, రాష్ట్ర ప్రభుత్వాలు, అధికారులు, కరోనా వారియర్లకు అభినందనలు. మూడో ఉద్ధృతిలో దాదాపు ఏ రాష్ట్రంలోనూ పరిస్థితులు చేజారిపోలేదు. వ్యాక్సినేషన్‌తో మనకు చాలా ఉపశమనం లభించింది. ప్రస్తుతం దేశంలో 96% వయోజనులకు కరోనా టీకా తొలి డోసు లభించింది. సుదీర్ఘకాలం తర్వాత పాఠశాలలు తెరుచుకున్నాయి. )మళ్లీ ఇప్పుడు కేసులు పెరుగుతుండటంతో తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. అయితే చాలామంది పిల్లలకు ఇప్పటికే వ్యాక్సిన్‌ లభించడం సంతోషకరం. మార్చిలో 12-14 ఏళ్ల పిల్లలకు వ్యాక్సినేషన్‌ మొదలుపెట్టాం. తాజాగా 6-12 ఏళ్లవారికీ కొవాగ్జిన్‌ టీకా అనుమతి లభించింది. దీనివల్ల అందరికీ సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్‌ అందుతుంది. మూడో ఉద్ధృతిలో రోజుకు 3 లక్షలకుపైగా కేసులొచ్చినా.. అన్ని రాష్ట్రాలు వాటిని ఎదుర్కొంటూనే సామాజిక, ఆర్థిక కార్యకలాపాలను యథాతథంగా కొనసాగించాయి. ఇదే సమతౌల్యతను మునుముందు కూడా కొనసాగించాలి’’ అని ప్రధాని పేర్కొన్నారు. పెట్రో ఉత్పత్తులపై రాష్ట్రాలు వ్యాట్‌ తగ్గించాలంటూ ప్రధాని మోదీ తాజాగా చేసిన వినతిపై కాంగ్రెస్‌ సహా పలు ప్రతిపక్ష పార్టీల నేతలు తీవ్రంగా స్పందించారు.


కేంద్రం రూ.27 లక్షల కోట్లు వెనకేసుకుంది

కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు ఎక్సైజ్‌ సుంకం లీటరు పెట్రోల్‌పై రూ.9.48గా, డీజిల్‌పై రూ.3.56గా ఉండేది. మోదీ హయాంలో అది పెట్రోల్‌పై రూ.27.90, డీజిల్‌పై రూ.21.80కు పెరిగింది. తద్వారా కేంద్రం రూ.27 లక్షల కోట్లు వెనకేసుకుంది. ముందు ఆ పెంపును మోదీ సర్కారు వెనక్కి తీసుకోవాలి.

- రణదీప్‌ సుర్జేవాలా, కాంగ్రెస్‌ ప్రధాన అధికార ప్రతినిధి


మేం కారణం కాదు

మహారాష్ట్రపై కేంద్రం సవతి ప్రేమ చూపుతోంది. ఇంధన ధరల పెరుగుదలకు మా ప్రభుత్వం కారణం కాదు. ముంబయిలో ఒక లీటరు డీజిల్‌ను విక్రయిస్తే కేంద్రానికి రూ.24.38 అందుతాయి. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేది రూ.22.37 మాత్రమే.

- ఉద్ధవ్‌ ఠాక్రే, మహారాష్ట్ర సీఎం


మీరు చేతులెత్తేసి రాష్ట్రాలపై విమర్శలా?

కొవిడ్‌ మహమ్మారి కానివ్వండి.. మరే ఇతర సంక్షోభమైనా కానివ్వండి. పరిస్థితులను నియంత్రించలేక కేంద్రం చేతులెత్తిన ప్రతిసారీ రాష్ట్రాలపై మోదీ నిందలు వేస్తున్నారు. కేంద్రప్రభుత్వం తొలుత జీఎస్‌టీ బకాయిలు చెల్లించాలి.

- మమతా బెనర్జీ,పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని