ఈ పాలన కరోనా కంటే భయంకరం

‘రాష్ట్రంలో వైకాపా కార్యకర్తలు సహా అందరూ ధరల బాదుడు బాధితులే. ఎక్కడా లేని ధరలు మనవద్ద ఉన్నాయి. ఈ బాధలు చూస్తే గుండె తరుక్కుపోతోంది. కరోనాకంటే భయంకరంగా

Published : 20 May 2022 03:31 IST

ప్రజలను వేధించి పైశాచిక ఆనందం పొందుతున్నారు

ధరల బాదుడులో వైకాపా కార్యకర్తలూ బాధితులే

రాష్ట్రానికి మరో ప్రజాఉద్యమం అవసరం

తెదేపా అధినేత చంద్రబాబు

ఈనాడు, కర్నూలు: ‘రాష్ట్రంలో వైకాపా కార్యకర్తలు సహా అందరూ ధరల బాదుడు బాధితులే. ఎక్కడా లేని ధరలు మనవద్ద ఉన్నాయి. ఈ బాధలు చూస్తే గుండె తరుక్కుపోతోంది. కరోనాకంటే భయంకరంగా జగన్‌ పాలన ఉంది’ అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. గురువారం కర్నూలులో తెదేపా విస్తృతస్థాయి సమావేశం, డోన్‌ పరిధిలోని జలదుర్గంలో ‘బాదుడే బాదుడు’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘తెలంగాణ, కర్ణాటక సరిహద్దుల్లో ఇంధన ధరలు తక్కువ. మరోవైపు రాష్ట్రంలో ఇసుక ధరలకు రెక్కలొచ్చి 45లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. రోజుకు ఇద్దరు ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. రైతులకు తెలుగుదేశం ఏం చేసింది? వైకాపా ఏం చేసిందో చర్చకు సిద్ధం. రాష్ట్రంలో మరో ప్రజా ఉద్యమం అవసరం. ఇందులో భాగంగా తెదేపాను గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. తెదేపా సైనికులపై తప్పుడు కేసులు పెడితే ఖబడ్దార్‌. వారు కన్నెర్ర చేస్తే పోలీసులేమీ చేయలేరు. నా జీవితంలో ఇలాంటి విధ్వంసకారుడిని, ప్రజలను వేధించి పైశాచికానందం పొందే వ్యక్తిని చూడలేదు’ అని జగన్‌పై మండిపడ్డారు.

బస్సు యాత్ర.. ఆపై గాలియాత్ర
‘బాదుడే బాదుడు ఆందోళనతో తెదేపా ముందుకెళితే వైకాపా గడపగడపకు వైకాపా అని.. మళ్లీ జనాలు రారని దానిని ‘గడప గడపకు మన ప్రభుత్వం’ అని మార్చింది. ఇంటింటా ప్రజలు ప్రశ్నించేసరికి ఇప్పుడు బస్సు యాత్ర అంటోంది. బస్సు యాత్ర పక్కనపెట్టి త్వరలో గాలియాత్ర చేస్తారు’ అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ‘చేసిన తప్పులు సరిదిద్దుకోకపోతే శ్రీలంకకు పట్టిన గతే ఏపీకి పడుతుంది. ఐదేళ్లు పాలించే సత్తా జగన్‌కు లేదు. ముఖ్యమంత్రి చెప్పులరిగేదాకా తిరుగుతున్నా అప్పు పుట్టని పరిస్థితి ఉంది’ అని విమర్శించారు. ‘పరిపాలన తెలియని దద్దమ్మ జగన్‌. తెలిసిందల్లా విధ్వంసమే. వైకాపావారు లూటీలో సిద్ధహస్తులు. మధ్యతరగతి వారికి ఇళ్లు కట్టిస్తామని నందికొట్కూరులో రూ.6 లక్షల ఎకరా ఉన్న భూమిని    రూ.కోటికి రిజిస్ట్రేషన్‌ చేశారు. మీరు దోచిన డబ్బులను కక్కిస్తా. చుక్కల, అసైన్డ్‌ భూములు ఇలా వేల ఎకరాలు కబ్జా చేస్తున్నారు. రాబోయేది తెదేపా ప్రభుత్వం. అడ్డదిడ్డంగా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న వారిని వదిలిపెట్టేది లేదు. ప్రజా రక్షణ విషయంలో ఎవరైనా అడ్డం వస్తే తొక్కుకుంటూ పోతాం తప్ప ఎవరినీ వదిలిపెట్టం’ అని హెచ్చరించారు.

ఏ2కు రాజ్యసభ టికెట్‌ ఇవ్వకపోతే ఏ1 అవుట్‌
‘రాజ్యసభ టికెట్‌ ఏ2కు కొనసాగించారు. ఆయన్ని సరిగా చూసుకోకపోతే ఏ1 అవుట్‌. ఏ2 అప్రూవర్‌గా మారితే తాను జైలుకు వెళతానని భయం. తన తరఫున సీబీఐ కేసులు వాదించే వ్యక్తికి, లాబీయింగ్‌ చేయడానికి మరొకరికి రాజ్యసభ అవకాశమిచ్చారు. కర్నూలు జిల్లాలో అప్పుల హరికథలు చెప్పే మంత్రి, బెంజి మంత్రి అవినీతిలో పోటీ పడుతున్నారు. పేకాట ఆడిస్తున్నారు. గనులు కొల్లగొడుతున్నారు’ అని చంద్రబాబు విమర్శించారు.

మీ పనే రక్ష
‘భేషజాలు వదిలి అందరం దూసుకెళదాం. ఇలాంటి వారిని గుర్తించే బాధ్యత నాది. ప్రజలను వదిలి నా చుట్టూ తిరిగేవారికి, అధికారమున్న చోటికి వెళ్లే వలస పక్షులకు గుర్తింపు ఉండదు. మీ పనే మీకు శ్రీరామరక్ష. పార్టీ కమిటీలు పూర్తి చేసి ఓటరు మేనేజ్‌మెంట్‌కు యూనిట్‌, బూత్‌, స్పెషల్‌ కమిటీలు వేస్తాం. వేల పదవులను సృష్టించి మిమ్మల్ని గుర్తిస్తాం. పార్టీ అధికారంలోకి వచ్చాక మీ సేవలను దృష్టిలో పెట్టుకుని ఆర్థికంగా నిలబెడతాం. పార్టీ కార్యకర్తల సంక్షేమానికి ఇప్పటివరకు 1.0 వర్షన్‌ తీసుకున్నాం. ఇకపై 2.0 వర్షన్‌ తీసుకుంటాం. ఆహారం-ఆరోగ్యం భావనతో కార్యకర్తల సంక్షేమంపై మహానాడులో యాప్‌ పెడుతున్నాం. చదువుకున్న యువత ముందుకు రావాలి. వచ్చే ఎన్నికల్లో 40 శాతం సీట్లు వారికి కేటాయిస్తాం’ అని పేర్కొన్నారు. ‘అచ్చెన్నాయుడు మొదలు గ్రామస్థాయి కార్యకర్తల వరకు అందరిపై తప్పుడు కేసులు పెడుతున్నారు. నాపైనా కేసులు పెట్టారు. భవిష్యత్తులో కార్యకర్తలపై కేసులుంటే చూసుకుంటా. తప్పు చేయను. అందుకే ఎవరూ నా జోలికి రారు. జగన్‌రెడ్డి నా జోలికి వచ్చారు. ప్రజల్లోనూ ఆయనపై చాలా వ్యతిరేకత ఉంది. వచ్చే ఎన్నికల్లో తప్పక తిప్పికొడతారు’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ‘ఈ రాష్ట్రాన్ని పునర్‌నిర్మించి నమ్ముకున్న మిమ్మల్ని కాపాడుకుని రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత నాది. 2014 విభజన తర్వాత ఆర్థిక ఇబ్బందులున్నప్పుడు రాష్ట్రాన్ని గాడిలో పెట్టా. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవస్థలు నాశనమయ్యాయి. అయితే ఆశ వదులుకోలేం. మన ప్రయత్నం చేయాలి. మీరు ఆశీర్వదించండి. మీ భవిష్యత్తును ఆశాజనకంగా తీర్చిదిద్దే బాధ్యత నాది. కార్యకర్తలు సీఎం.. సీఎం అంటున్నారు. సీఎం పదవి నాకేం కొత్త కాదు. 2029కి భారతదేశంలో ఏపీని అగ్రస్థానంలో నిలపాలన్న కల దెబ్బతిన్నదనే నా ఆవేదన. అమరావతిని స్థాపించి రూ.లక్ష కోట్ల ఆస్తిని భూమి రూపంలో సంపద చూపిస్తే జగన్‌ నిర్వీర్యం చేశారు’ అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

తెదేపా మంజూరు చేస్తే వైకాపా నిలిపేసింది..
‘33వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్న ఓర్వకల్లును ఇండస్ట్రియల్‌ టౌన్‌షిప్‌గా తీర్చిదిద్దాలని భావించాం. తంగెడంచలో ఆయోవా వర్సిటీ భాగస్వామ్యంతో విత్తన హబ్‌ ఏర్పాటుచేస్తే ఈ ప్రభుత్వంలో అతీగతీ లేదు. గుండ్రేవుల, ఆర్డీఎస్‌, వేదవతి ప్రాజెక్టుల పురోగతి లేదు. పోలవరం పూర్తి చేసి గోదావరి, పెన్నా నదులను అనుసంధానించి నాగార్జునసాగర్‌ నుంచి నేరుగా బనకచర్లకు నీళ్లు తెచ్చి రాయలసీమలో ప్రతి ఎకరాకు నీళ్లివ్వాలని కలలుగన్నాం. అవన్నీ కల్లలవుతున్నాయి. పులివెందులలో బస్టాండు కట్టలేని వ్యక్తి మూడు రాజధానులు కడతారా? కర్నూలుకు హైకోర్టును తెస్తామని మోసం చేస్తున్నారు’ అని తెదేపా అధినేత విమర్శించారు. మహానాడును తలదన్నేలా కర్నూలు సమావేశం జరిగిందని అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని