సేకరించిన భూమిని తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు

నిర్దిష్ట అవసరం కోసం ప్రభుత్వం సేకరించిన భూమిని అందుకోసం వినియోగించకుండా ఖాళీగా ఉంచిన కారణంగా తిరిగి తనకు ఇచ్చేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టేసింది. బోర్డు స్టాండింగ్‌ ఆర్డర్స్‌ ప్రకారం.

Published : 25 May 2022 03:53 IST

పరిహారం తీసుకున్నాక భూ యజమాని దానిని కోరలేరు

ఈనాడు, అమరావతి: నిర్దిష్ట అవసరం కోసం ప్రభుత్వం సేకరించిన భూమిని అందుకోసం వినియోగించకుండా ఖాళీగా ఉంచిన కారణంగా తిరిగి తనకు ఇచ్చేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టేసింది. బోర్డు స్టాండింగ్‌ ఆర్డర్స్‌ ప్రకారం.. దానిని ప్రభుత్వం ఇతర అవసరాలకు, భూమి లేని నిరుపేదలకు ఇవ్వొచ్చని తెలిపింది. ప్రభుత్వం ఆ భూమికి యజమానిగా.. నిబంధనలకు లోబడి ఇతర ప్రజాప్రయోజనాలకు వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. ఓ సారి భూసేకరణ ప్రక్రియ పూర్తయి, పరిహారం అందుకున్నాక, ప్రభుత్వం స్వాధీనంలోకి ఆ భూమి వెళ్లాక, భూ యజమాని దానిని వెనక్కి ఇవ్వాలని కోరలేరని తేల్చి చెప్పింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి ఇటీవల ఈ మేరకు తీర్పు ఇచ్చారు. బలహీనవర్గాలకు ఇంటి స్థలాలు ఇచ్చేందుకు కర్నూలు జిల్లా మిడ్తూరు మండలం దేవనూరులో తనకు చెందిన 2.57 ఎకరాలను భూసేకరణ కింద తీసుకున్నారని, ఆ భూమిని ఖాళీగా ఉంచినందున తనకు ఇచ్చేలా ఆదేశించాలని కోరుతూ పి.సుంకిరెడ్డి 2015లో హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల ఈ వ్యాజ్యం విచారణకు వచ్చినప్పుడు భూసేకరణ సహాయ ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ బోర్డు స్టాండింగ్‌ ఆర్డర్స్‌ను పరిగణనలోకి తీసుకొని దీనినికొట్టేయాలని కోరారు. వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి వినియోగించడం లేదనే కారణంతో పిటిషనర్‌కు తిరిగి అప్పగించాలని ఆదేశించలేమని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని