Agnipath Protest: ఇప్పుడు కాకపోతే.. మరెప్పుడూ జవాన్లు కాలేరని!

‘‘కరోనా కారణంగా రెండేళ్లుగా ఉమ్మడి ప్రవేశ పరీక్షను కేంద్ర ప్రభుత్వం నిర్వహించలేదు. ఒకవేళ ‘అగ్నిపథ్‌’ పరీక్షలో ఫెయిలైతే వయసుపరిమితి దాటిపోయి మరోసారి రాసేందుకు

Updated : 21 Jun 2022 08:11 IST

రెచ్చగొట్టిన డిఫెన్స్‌ అకాడమీల ప్రతినిధులు
బిహార్‌, రాజస్థాన్‌లోలా రైళ్లను   దహనం చేద్దామనుకున్నారు
సికింద్రాబాద్‌ స్టేషన్‌లో విధ్వంసం సృష్టించిన యువకుల ప్రణాళిక
ఏ1గా కామారెడ్డి జిల్లాకు చెందిన మధుసూదన్‌

ఈనాడు-హైదరాబాద్‌, న్యూస్‌టుడే-రెజిమెంటల్‌ బజార్‌, గాంధీఆసుపత్రి: ‘‘కరోనా కారణంగా రెండేళ్లుగా ఉమ్మడి ప్రవేశ పరీక్షను కేంద్ర ప్రభుత్వం నిర్వహించలేదు. ఒకవేళ ‘అగ్నిపథ్‌’ పరీక్షలో ఫెయిలైతే వయసుపరిమితి దాటిపోయి మరోసారి రాసేందుకు అవకాశం ఉండదు. ఇప్పుడు కాకపోతే.. మరెప్పుడూ జవాన్లు కాలేం. అందుకే బిహార్‌, రాజస్థాన్‌లలో చేసినట్టు రైళ్లను దహనం చేద్దామని అనుకున్నాం’’ అని సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో విధ్వంసం సృష్టించిన నిందితుల్లో కొందరు రైల్వే పోలీసులతో చెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము దాకా కస్టడీలో ఉన్న నిందితులను పోలీసులు ప్రశ్నించారు. వీరు తెలిపిన వివరాలను రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు పొందుపరిచి న్యాయస్థానంలో సమర్పించారు.

ఎక్కువ మంది 20 ఏళ్లు దాటినవారే..

రైల్వేస్టేషన్‌ విధ్వంసం కేసులో మొత్తం 56 మంది నిందితులు ఉండగా.. వీరిలో 51 మంది 20 ఏళ్లు దాటినవారే. కేసులో ఏ2గా ఉన్న పృథ్వీరాజ్‌ వయస్సు 23 సంవత్సరాలు. ప్రవేశ పరీక్షకు అర్హత సాధించిన 2వేల మందిలో 20 ఏళ్లు దాటినవారంతా అగ్నిపథ్‌ను అడ్డుకోవాలనుకున్నారు. వీరికి కొన్ని డిఫెన్స్‌ అకాడమీలు సహకరించడంతో పాటు విధ్వంసం సృష్టించేలా రెచ్చగొట్టాయని రైల్వే పోలీసులు తెలిపారు. ఇందుకు ఎనిమిది వాట్సప్‌ గ్రూప్‌లను ఏర్పాటు చేశాయని రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు.

అకాడమీల కార్యాచరణ

వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లో ఉన్న డిఫెన్స్‌ అకాడమీల ప్రతినిధులు క్రియాశీలకంగా వ్యవహరించారు. బుధవారం రాత్రి కార్యాచరణ మొదలుపెట్టారు. వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల వారు ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, నల్గొండ జిల్లాలకు చెందినవారికి హైదరాబాద్‌కు రావాలంటూ వాట్సప్‌ సందేశాలు పంపించారు. ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల వారు మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, మెదక్‌ జిల్లాల్లో ఉంటున్నవారిని హైదరాబాద్‌కు తరలించారు. సికింద్రాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు రైల్వేస్టేషన్లలో విధ్వంసం సృష్టించాలని.. నాలుగైదు రోజులపాటు బయటే ఉండేలా ఏర్పాట్లు చేసుకుని రావాలని చెప్పారు. ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల వారి బాగోగులను ఇద్దరు డిఫెన్స్‌ అకాడమీ ప్రతినిధులు చూసుకున్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన 1,500 మంది యువకులకు సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో వసతి కల్పించారు.

రైల్వే పోలీసుల అదుపులో గాంధీ క్షతగాత్రులు

పోలీసు కాల్పులు, ఘర్షణలో గాయపడిన తొమ్మిది మంది నిందితులు మల్లికార్జున్‌, రంజిత్‌, శ్రీకాంత్‌, పరశురాం, కుమార్‌, మోహన్‌, భరత్‌కుమార్‌, విద్యాసాగర్‌, లక్ష్మణ్‌రెడ్డిలను రైల్వే పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. వారిని గాంధీ ఆసుపత్రి నుంచి సోమవారం డిశ్ఛార్జి చేయడంతో నేరుగా రైల్వే పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. మంగళవారం రైల్వే జడ్జి ఎదుట హాజరుపరిచే అవకాశాలున్నాయి. చంచల్‌గూడ జైల్లో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్నవారిని పీటీ వారెంట్‌ ద్వారా విచారించనున్నారు. రైల్వే పోలీసులు నమోదు చేసిన కేసు హైదరాబాద్‌ పోలీసులకు ఇంకా బదిలీ కాలేదు. మరోవైపు బస్సులపై రాళ్లు వేసి అద్దాలు పగులగొట్టిన కేసులో గోపాలపురం పోలీసులు 19 మందిపై కేసు నమోదు చేశారు.

నిందితుల్లో కానిస్టేబుల్‌ శిక్షణ అభ్యర్థులు..

విధ్వంసం కేసులో కామారెడ్డి జిల్లాకు చెందిన మధుసూదన్‌ ప్రధాన నిందితుడని(ఏ1) కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్డులో రైల్వే పోలీసులు పేర్కొన్నారు. ఇతడు క్రీడల్లో శిక్షణ పొందుతున్నాడని తెలిపారు. ఆదిలాబాద్‌ జిల్లా సోనాపూర్‌ గ్రామానికి చెందిన రాథోడ్‌ పృథ్వీరాజ్‌ను ఏ-2గా పేర్కొన్నారు. 56 మంది నిందితుల్లో మహబూబ్‌నగర్‌, జగిత్యాల జిల్లాలకు చెందిన ఇద్దరు హైదరాబాద్‌లో కానిస్టేబుల్‌ పరీక్షకు శిక్షణ పొందుతున్నారు. మరో ఇద్దరు బీటెక్‌ చివరి సంవత్సరం చదువుతుండగా, ముగ్గురు రైతు కూలీలుగా పనిచేస్తున్నారు. ఒక యువకుడు ఫుడ్‌ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. మిగిలినవారు కళాశాలల విద్యార్థులు.

ఆవుల సుబ్బారావు పాత్రపై ఆరా

ఆంధ్రప్రదేశ్‌లోని నరసరావుపేటలో సాయి డిఫెన్స్‌ అకాడమీ నిర్వహిస్తున్న ఆవుల సుబ్బారావు పాత్రపై రైల్వే పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. విధ్వంసం గురించి అతను ఎవరితోనైనా మాట్లాడాడా? అన్న కోణంలో పరిశోధిస్తున్నారు. జూన్‌ 16న 1,500 మంది యువకులు మల్కాజిగిరి, నేరేడ్‌మెట్‌, ఏఎస్‌రావునగర్‌ పరిసర ప్రాంతాల్లో ఉన్నారని సెల్‌ఫోన్‌ సిగ్నళ్ల ద్వారా ఆధారాలు లభించాయి. వీరికి వసతి, భోజనం తదితర సౌకర్యాలు సుబ్బారావే కల్పించాడని పోలీస్‌ ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు.


సాయి డిఫెన్స్‌ అకాడమీలో ఐటీ సోదాలు

ఈనాడు-అమరావతి: నరసరావుపేటలోని సాయి డిఫెన్స్‌ అకాడమీలో సోమవారం ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అకాడమీ నిర్వాహకుడు ఆవుల సుబ్బారావును నరసరావుపేట పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తాజాగా సుబ్బారావు ఇల్లు, కోచింగ్‌ సెంటర్‌, పల్నాడు రోడ్‌లో ఆయనకు చెందిన ఓ లాడ్జీలో ఏకకాలంలో ఐటీ అధికారులు దాడులు జరిపారు. ఆ సమయంలో సుబ్బారావు అధికారులకు అందుబాటులోనే ఉన్నారని తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని