కల్తీ తేనె అనుభవం నాకూ ఎదురైంది

గిరిజన సహకార సంస్థ (జీసీసీ) విక్రయించే తేనెలో కల్తీ జరిగిన మాట వాస్తవమేనని గిరిజన శాఖ మంత్రి పీడిక రాజన్నదొర వెల్లడించారు. తనకూ కల్తీ తేనె అనుభవం ఎదురైందన్నారు.

Published : 25 Jun 2022 04:25 IST

గిరిజనులకు మాతృ భాషలోనే విద్యా బోధన: మంత్రి రాజన్నదొర

ఈనాడు, అమరావతి: గిరిజన సహకార సంస్థ (జీసీసీ) విక్రయించే తేనెలో కల్తీ జరిగిన మాట వాస్తవమేనని గిరిజన శాఖ మంత్రి పీడిక రాజన్నదొర వెల్లడించారు. తనకూ కల్తీ తేనె అనుభవం ఎదురైందన్నారు. సచివాలయంలోని పబ్లిసిటీ సెల్‌లో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ..‘రెండుమూడు కన్‌సైన్‌మెంట్లలో ఇలా జరిగింది. దీనిపై ఇప్పటికే చర్యలు తీసుకున్నాం. స్వచ్ఛమైన తేనె సేకరణ ప్రారంభించాం. గతంలో జీసీసీలో అధికారిగా పనిచేశా. ఇప్పటికీ నేను ఆ ఉత్పత్తులనే ఉపయోగిస్తా’ అని మంత్రి పేర్కొన్నారు.

గిరిజన భాషల్లో పాఠ్యపుస్తకాలు: ‘గిరిజనులను విద్యావంతులుగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతో ఆరు గిరిజన భాషల్లో పాఠ్య పుస్తకాలను ప్రత్యేకంగా తయారు చేయించాం. గిరిజనులు ఎక్కువగా వినియోగించే కొండ, కోయ, కువి, ఆదివాసి ఒరియా, సవర, సుగాలి భాషల్లో వాచకాలను ప్రత్యేకంగా రూపొందించాం. గిరిజన ప్రాంతాల్లో ఉన్న పిల్లలకు మాతృభాషలోనే విద్యాబోధన అందించాలన్నది ప్రభుత్వ ఆలోచన. పాఠ్యాంశాలను అర్థం చేసుకోడానికి తెలుగును కూడా వారి భాషలోనే బోధిస్తాం. వారి సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ప్రతిబింబించేలా వాచకాలు రూపొందించాం. గిరిజనులు మాతృభాష ద్వారా తెలుగుపై పట్టు సాధించేలా చేస్తాం. తర్వాత ఆంగ్లం సులువుగా అర్హం చేసుకుంటారు. దీనికోసం రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) సహకారంతో విద్యాశాఖ, గిరిజన శాఖలోని ట్రైబల్‌ కల్చరల్‌ రీసెర్చి, ట్రైనింగ్‌ మేనేజ్‌మెంట్‌ ఆధ్వర్యంలో మూడు వర్క్‌షాప్‌లు నిర్వహించాం. రిసోర్స్‌పర్సన్ల నుంచి వచ్చిన సూచనల ఆధారంగా మూడు వాచకాలను రూపొందించాం. గిరిజన భాషలోనే బోధన ఉండటం వల్ల వారిలో భయం పోతుంది’ అని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని