కోనసీమ అల్లర్ల కేసు... సీబీఐకి ఇవ్వాలంటూ దాఖలైన పిల్‌ కొట్టివేత

కోనసీమ జిల్లా పేరు మార్పు వ్యవహారంలో అమలాపురంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టేసింది.

Published : 25 Jun 2022 05:02 IST

ప్రచారం కోసం దాఖలు చేసినట్లుంది: హైకోర్టు

ఈనాడు, అమరావతి: కోనసీమ జిల్లా పేరు మార్పు వ్యవహారంలో అమలాపురంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టేసింది. ఇలాంటి వ్యాజ్యాలు ప్రచారం కోసం లేదా రాజకీయ ప్రయోజనం కోసం దాఖలు చేస్తుంటారని వ్యాఖ్యానించింది. నిస్సార వ్యాజ్యాలు దాఖలుచేస్తే ఖర్చులు విధిస్తామని హెచ్చరించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. కోనసీమ అల్లర్లపై నమోదైన కేసుల దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ సామాజిక కార్యకర్త కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి హైకోర్టులో పిల్‌ వేశారు. న్యాయవాది శివప్రసాద్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. అల్లర్లలో అధికారపార్టీ కౌన్సిలర్‌ పాత్ర ఉందన్నారు. ఆ వాదనలపై ధర్మాసనం స్పందిస్తూ.. రాజకీయ వ్యవహారంతో తమకు సంబంధం లేదని, బాధ్యులపై పోలీసులు చర్యలు తీసుకుంటారని వ్యాఖ్యానించింది. నిరర్థక పిల్‌ వేసినందుకు రూ.25 లక్షలకు తక్కువ కాకుండా ఖర్చులు విధిస్తామని హెచ్చరించింది. ఖర్చులు వేయొద్దని న్యాయవాది అభ్యర్థించి, క్షమాపణలు చెప్పారు. దీంతో వ్యాజ్యాన్ని కొట్టేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని