పర్యావరణహిత పెట్టుబడులకే ప్రాధాన్యం

రాష్ట్రంలో హరిత ఇంధనం (గ్రీన్‌ ఎనర్జీ) వినియోగంతో పాటు విద్యుత్‌ వాహన తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి అమర్‌నాథ్‌ పేర్కొన్నారు.

Published : 06 Aug 2022 05:27 IST

పరిశ్రమల శాఖ మంత్రి అమర్‌నాథ్‌

వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరంతో వర్చువల్‌ సమావేశం

పాల్గొన్న ఈవీ తయారీ పరిశ్రమల సీఈవోలు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో హరిత ఇంధనం (గ్రీన్‌ ఎనర్జీ) వినియోగంతో పాటు విద్యుత్‌ వాహన తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి అమర్‌నాథ్‌ పేర్కొన్నారు. అంతర్జాతీయ పెట్టుబడులకు అనువైన ప్రాంతంగా 2050 నాటికి రాష్ట్రాన్ని తీర్చిదిద్దనున్నట్లు వెల్లడించారు. వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరంతో వర్చువల్‌ విధానంలో నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. ‘పర్యావరణహిత పెట్టుబడులకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా విద్యుత్‌ వాహనరంగం (ఈవీ) అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తాం. రవాణా మార్గాల అనుసంధానం, సహజవనరులు, నైపుణ్య మానవ వనరులున్న దృష్ట్యా ఈ రంగంలో పెట్టుబడులకు అవకాశం ఉంది’ అని పేర్కొన్నారు.

హరిత విద్యుత్‌ వినియోగాన్నిపెంచడమే లక్ష్యం
రాష్ట్ర ఇంధన వినియోగంలో 2030 నాటికి హరిత ఇంధన వాటా 45% ఉండాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ వెల్లడించారు. 2023 నాటికి 10.8 గిగావాట్ల హరిత విద్యుత్‌ సామర్థ్యం లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. ప్రజారవాణా వ్యవస్థలో 50% విద్యుత్‌ వాహనాలను వినియోగించే దిశగా కసరత్తు చేస్తున్నట్లు రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు పేర్కొన్నారు. ఆర్టీసీలో ఉన్న 7వేల బస్సుల్లో.. సుమారు వెయ్యి బస్సులను విద్యుత్‌ వాహనాలుగా మార్చే ప్రతిపాదన ఉందన్నారు. వాణిజ్య, ప్రజారవాణా రంగాల్లో కలిపి 10 లక్షల విద్యుత్‌ వాహనాలను తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించిందని పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ సృజన గుమ్మళ్ల వెల్లడించారు. హరిత ఇంధన వినియోగాన్ని పెంచినప్పుడే పర్యావరణహిత పరిశ్రమల స్థాపన సాధ్యమని రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (ఏపీఐఐసీ) వైస్‌ఛైర్మన్‌, ఎండీ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. రాష్ట్రంలో గత ఏడాది 26వేలుగా ఉన్న విద్యుత్‌ వాహనాల అమ్మకాలు ఈ ఏడాది 77 వేలకు పెరిగాయన్నారు. ఈ సమావేశంలో పలు ఈవీ తయారీ కంపెనీల సీఈవోలు, మూవింగ్‌ ఇండియా ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని