ఏఎన్‌ఎంల సర్దుబాటులో గందరగోళం

గ్రామ సచివాలయాల్లో ఏఎన్‌ఎంల సర్దుబాటు వివాదాస్పదంగా మారుతోంది. గ్రామాల్లోని ఉప ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే రెగ్యులర్‌, అవుట్‌ సోర్సింగ్‌, యూరోపియన్‌ కమిషన్‌ ఏఎన్‌ఎం, పీహెచ్‌సీల్లో పనిచేసే ఓపీ ఏఎన్‌ఎంల్లో కొందరిని

Updated : 09 Aug 2022 05:53 IST

మార్గదర్శకాల్లో అస్పష్టత
పలుచోట్ల జిల్లాల్లో ఆందోళనలు
నిలిచిపోయిన కౌన్సెలింగ్‌  

ఈనాడు-అమరావతి: గ్రామ సచివాలయాల్లో ఏఎన్‌ఎంల సర్దుబాటు వివాదాస్పదంగా మారుతోంది. గ్రామాల్లోని ఉప ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే రెగ్యులర్‌, అవుట్‌ సోర్సింగ్‌, యూరోపియన్‌ కమిషన్‌ ఏఎన్‌ఎం, పీహెచ్‌సీల్లో పనిచేసే ఓపీ ఏఎన్‌ఎంల్లో కొందరిని గ్రామ/వార్డు సచివాలయాల్లో సర్దుబాటు చేసేందుకు సోమవారం కౌన్సెలింగ్‌కు ఏర్పాట్లు జరిగాయి. అయితే స్పష్టమైన మార్గదర్శకాలు లేక గందరగోళం నెలకొంది. పలు జిల్లాల్లో ప్రాథమిక దశలోనే కౌన్సెలింగ్‌ ఆగిపోయింది. కొన్నిచోట్ల ఏఎన్‌ఎంలు ఆందోళన వ్యక్తంచేశారు. కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు దూరప్రాంతాల నుంచి పూర్వ జిల్లా కేంద్రాలకు వచ్చిన వారు వ్యయప్రయాసలకు గురయ్యారు. కోస్తాలో కౌన్సెలింగ్‌ నిలిపేసి, సరైన మార్గదర్శకాలు ఇవ్వాలని అక్కడి అధికారులు ఉన్నతాధికారులను కోరారు.  ఉప ఆరోగ్య కేంద్రాల్లో రెగ్యులర్‌ ఏఎన్‌ఎం/అవుట్‌ సోర్సింగ్‌ ఏఎన్‌ఎం, పలుచోట్ల యూరోపియన్‌ కమిషన్‌ ఏఎన్‌ఎంలు పనిచేస్తున్నారు. పీహెచ్‌సీల్లో మెటర్నిటీ అసిస్టెంట్‌గా ఒక ఏఎన్‌ఎం ఉన్నారు. ఈ కేటగిరీల వారిని గ్రామ/వార్డు సచివాలయంలో ఖాళీగా ఉన్న గ్రేడ్‌-3 పోస్టుల్లో సర్దుబాటు చేయాలని, ఇదంతా సోమవారంలోగా పూర్తిచేయాలని ఉన్నతాధికారులు గతవారం ఉత్తర్వులు ఇచ్చారు. ఈ క్రమంలో ఏ కేటగిరీ వారికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలి? డిప్యుటేషన్‌ అయినందు వల్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? అనే దానిపై స్పష్టత లేదని జిల్లా అధికారులు పేర్కొంటున్నారు. మరోపక్క.. గ్రామ/వార్డు సచివాలయాల్లో పనిచేసే ఏఎన్‌ఎంలు స్టాఫ్‌నర్సు శిక్షణ కోసం వెళ్లారు. తిరిగి వచ్చాక వారి పరిస్థితి ఏమిటన్న దానిపైనా స్పష్టత కొరవడింది. సచివాలయాల్లో సర్దుబాట్లు అయ్యాక మిగిలే ఏఎన్‌ఎంలను పీహెచ్‌సీల్లో స్టాఫ్‌ నర్సు పోస్టుల ఖాళీల్లో సర్దుబాటు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అర్హతలు లేని వారిని అక్కడ ఎలా సర్దుబాటు చేయాలో అర్థం కావడంలేదని, మార్గదర్శకాలు స్పష్టంగా లేవని జిల్లా అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

దూర ప్రాంతాలకు వెళ్లడం ఎలా? : గత కొన్నేళ్లుగా ఉప ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న తమను సచివాలయాల్లో పనిచేయమంటే భవిష్యత్తులో తీవ్రంగా నష్టపోతామని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరిలో 20 ఏళ్ల నుంచి పనిచేస్తున్న వారు కూడా ఉన్నారు. వయసుపరంగా 50 ఏళ్లు దాటిన వారు మరికొందరు ఉన్నారు. దూర ప్రాంతాల్లో ఉన్న సచివాలయాలకు కేటాయిస్తే పరిస్థితి ఏమిటని వీరు నిలదీస్తున్నారు. సీనియారిటీకి గౌరవం ఇవ్వరా? అని ప్రశ్నిస్తున్నారు.  

స్పష్టత ఇస్తాంమంటున్న అధికారులు : కౌన్సెలింగ్‌ నిర్వహణ గందరగోళంగా మారడంపై ఉన్నతాధికారులు వివరణ ఇస్తూ ఏఎన్‌ఎంలకు ఉన్న సందేహాలకు తగ్గట్లుగా జిల్లాల్లో చర్యలు తీసుకోకపోవడం వల్లే సమస్యలు తలెత్తాయని పేర్కొన్నారు. సచివాలయాల్లో పనిచేసేందుకు వెళ్లినా.. వారికి వైద్య ఆరోగ్య శాఖ ద్వారానే వేతనాలు అందుతాయని తెలిపారు. ఒకటి, రెండు రోజుల్లో స్పష్టమైన ఉత్తర్వులు ఇస్తామని తెలిపారు. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్టులో ఖాళీలు ఉండకూడదన్న ఉద్దేశంతో వీరిని సచివాలయాలకు పంపే క్రమంలో ఈ గందరగోళం నెలకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని