ప్రగతి పథంలో... ప్రజా రథం

దుర్గమమైన మార్గాల్లో మైళ్లకు మైళ్ల దూరం కాలినడక.. కాస్త స్థితిమంతులైతే అశ్వాలు, మనుషులు మోసే పల్లకీలలో సవారీ.. కొన్నాళ్లకు మట్టి బాటలపై ఎడ్లబళ్లు.. గుర్రపు బళ్లు.. మనుషులు లాగే రిక్షాలు.. ఇలా సాగిన భారతీయుల

Updated : 12 Aug 2022 06:58 IST

ఆధునికీకరణ దిశలో రోడ్డు, రైలు మార్గాలు

అవకాశాలు సృష్టిస్తున్న విమానయానం

ఆశలు రేపుతున్న నౌకా రవాణా

వేగంగా విస్తరిస్తున్న రవాణా రంగం

దుర్గమమైన మార్గాల్లో మైళ్లకు మైళ్ల దూరం కాలినడక.. కాస్త స్థితిమంతులైతే అశ్వాలు, మనుషులు మోసే పల్లకీలలో సవారీ.. కొన్నాళ్లకు మట్టి బాటలపై ఎడ్లబళ్లు.. గుర్రపు బళ్లు.. మనుషులు లాగే రిక్షాలు.. ఇలా సాగిన భారతీయుల ప్రయాణం ఆధునిక కాలంలో అనేక విధాలుగా రూపాంతరం చెందింది. బస్సులు, రైళ్లు, ఆటోలు, ట్యాక్సీలు అందుబాటులోకి వచ్చాయి. స్వాతంత్య్రం వచ్చాక కూడా దశాబ్దాలపాటు ఇరుకు మార్గాలు, గతుకుల రహదారులపై పడుతూ లేస్తూ కొనసాగిన మన పయనం.. ఇప్పుడు విశాలమైన, నున్నని రోడ్లపై వేగంగా పరుగులు తీస్తోంది.

బ్రిటిష్‌ పాలకులు వారి వ్యాపార, పరిపాలన, వినోద అవసరాల మేరకు మాత్రమే రవాణా వసతుల్ని అభివృద్ధి చేశారు. స్వాతంత్య్రం వచ్చాక కూడా... కొన్నేళ్లపాటు చాలా గ్రామాలకు మెరుగైన రవాణా వ్యవస్థ లేదు. క్రమంగా ఈ పరిస్థితి మారింది. ఆర్థిక సరళీకరణ, ప్రభుత్వ నియంత్రణల సడలింపు, ప్రైవేటు భాగస్వామ్యంతో రవాణా వసతులు వేగంగా మెరుగుపడ్డాయి. జాతీయ రహదారుల్లో చాలా వరకు నాలుగు, ఆరు, ఎనిమిది వరుసలుగా రూపుదిద్దుకున్నాయి. ఎక్స్‌ప్రెస్‌ హైవేలు వచ్చాయి. రైలు మార్గాల ఆధునికీకరణ సాధ్యమైంది. రైళ్ల సంఖ్య, వేగం పెరిగాయి. ప్రైవేటు రంగంలో విమానాశ్రయాలు ఏర్పడ్డాయి. మెట్రో రైళ్లు వచ్చాయి. ఇలా 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఎంతో సాధించాం. ప్రగతిశీల ప్రపంచంలో మనం ఇంకా సాధించాల్సిన లక్ష్యాలేమిటి? అందుకు మన ముందున్న సానుకూలతలు ఏమిటి?


మెరుగైన రహదారులే దన్ను

దేశంలో 65% సరకు రవాణా, 80% ప్రజా రవాణా రోడ్డు మార్గాల్లోనే జరుగుతోంది. గత మూడు దశాబ్దాల నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త రహదారుల నిర్మాణం, పాతవాటి ఆధునికీకరణపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. దేశంలోని ప్రధాన నగరాలను, రాష్ట్రాల రాజధానులను, పారిశ్రామిక ప్రాంతాలను, నౌకాశ్రయాలను అనుసంధానం చేస్తూ నిర్మించిన రహదారులతో సరకు, ప్రజా రవాణా సులభతరమైంది. వాజ్‌పేయీ ప్రభుత్వ హయాంలో రహదారుల నిర్మాణానికి ప్రైవేటు పెట్టుబడుల్ని ప్రోత్సహించడం ప్రారంభించాక వాటి స్వరూపం మారింది.

* జాతీయ రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎన్‌హెచ్‌డీపీ), స్వర్ణ చతుర్భుజి, భారత్‌మాల పరియోజన ప్రాజెక్టుల కింద పెద్ద ఎత్తున రహదారుల అభివృద్ధి, విస్తరణ కార్యక్రమాలు చేపట్టారు. ఇలా 2020 డిసెంబరు నాటికి మొత్తం 43,174 కి.మీ. రహదారుల నిర్మాణం, విస్తరణ సాకారమైంది.

* భారత్‌మాల పరియోజన మొదటి దశ కింద రూ.1.63 లక్షల కోట్లతో 2,485 కి.మీ. పొడవైన కొత్త ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణం, రూ.1.97 లక్షల కోట్లతో 5,924 కి.మీ. పొడవైన గ్రీన్‌ఫీల్డ్‌ యాక్సెస్‌ కంట్రోల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణం మొదలైంది.


భారతీయ రైల్వే... ప్రగతికి మార్గం 

ఇప్పటికీ సామాన్యులకు అందుబాటులో, తక్కువ ధరలో రవాణా సదుపాయం కల్పిస్తున్నది భారతీయ రైల్వేనే. 

* 2021 మార్చి నాటికి దేశంలో 7,337 రైల్వే స్టేషన్లున్నాయి. భారతీయ రైల్వే ఏటా 810 కోట్ల మంది ప్రయాణికుల్ని గమ్యస్థానాలకు చేరుస్తోంది.

* దేశంలో మొదటి రైల్వే లైన్ల నిర్మాణం ఈస్ట్‌ ఇండియా కంపెనీ ప్రారంభించింది. 1853 ఏప్రిల్‌ 16న తొలి ప్రయాణికుల రైలు బొంబాయిలోని బోరిబందర్‌ నుంచి ఠాణె వరకు 34 కి.మీ. నడిచింది. భారతీయ రైల్వే చట్టాన్ని 1890లో అమల్లోకి తెచ్చారు. కాలక్రమంలో కంప్యూటర్‌ రిజర్వేషన్‌ విధానం, తత్కాల్‌ వంటివి ప్రారంభమయ్యాయి.


పౌర విమానయాన రంగానికి రెక్కలు

కేంద్రం ప్రవేశపెట్టిన ఉడాన్‌ వంటి కార్యక్రమాలు విమానయాన రంగం వృద్ధికి కొంత దోహదం చేస్తున్నాయి.

* దేశ జీడీపీలో వియానయాన రంగం వాటా 5%. ఈ రంగం 40 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది.

ఉత్తరాల రవాణాతో మొదలు

* భారత్‌లో మొదటి వాణిజ్య విమానం 1911 ఫిబ్రవరి 18న అలహాబాద్‌లోని ఒక పోలో గ్రౌండ్‌ నుంచి ఉత్తరాలు తీసుకుని యమునా నదిని దాటి 9.7 కి.మీ.లు ప్రయాణించి నైనిలో వాలింది. ప్రపంచంలో మొదటి అధికారిక ఎయిర్‌ మెయిల్‌ సర్వీస్‌గా ఆ ప్రయాణం రికార్డులకెక్కింది.  
* భారత్‌లో మొదట విమానాశ్రయాల నిర్మాణం 1924లో మొదలైంది.  1953 మార్చిలో భారత పార్లమెంట్‌ ఎయిర్‌ కార్పొరేషన్స్‌ చట్టాన్ని తీసుకొచ్చింది. విమానయాన పరిశ్రమను జాతీయీకరించింది. ప్రభుత్వం ఆధ్వర్యంలో దేశీయ విమానయాన సర్వీసుల కోసం ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌, అంతర్జాతీయ సర్వీసుల కోసం ఎయిర్‌ ఇండియాలను ఏర్పాటు చేసింది. 

దేశంలో మనుగడలో ఉన్న మొత్తం విమానాశ్రయాలు: 137

వాటిలో అంతర్జాతీయ విమానాశ్రయాలు: 24

దేశీయ విమానాశ్రయాలు: 103

కస్టమ్స్‌ విమానాశ్రయాలు: 10


వాణిజ్యానికి ఊతగర్ర.. ఓడరేవులు

క్రీస్తు పూర్వం నుంచీ భారతదేశ వాణిజ్యానికి జీవగర్రగా నిలిచింది నౌకాయానమే. దేశానికి 7,500 కి.మీ. సుదీర్ఘ సముద్రతీరం ఉండటం నౌకా వాణిజ్య విస్తృతికి దోహదం చేసింది. భారతీయ నౌకాశ్రయాలు కొన్ని వేల సంవత్సరాల నుంచి వాణిజ్య కేంద్రాలుగా అభివృద్ధి చెందాయి.

ప్రస్తుతం దేశంలో 13 పెద్ద ఓడరేవులు, సుమారు 200 చిన్న ఓడరేవులు ఉన్నాయి. భారతదేశ విదేశీ వాణిజ్యం అత్యధికంగా సముద్రమార్గంలోనే జరుగుతోంది. 2021 డిసెంబరు నాటికి దేశంలో 1,463 నౌకలు ఉన్నాయి. భారతదేశంలో ఉపరితల జలరవాణా అభివృద్ధికి అనుకూలమైన జలమార్గాలు 14,500 కి.మీ. మేర ఉన్నాయి.


ఆకాశంలో రైలు

ప్రధాన నగరాల్లో రద్దీని తట్టుకునేందుకు రోడ్డుకు అంతెత్తున పరుగెత్తే మెట్రో రైళ్లు ప్రజా రవాణాను సులభతరం చేస్తున్నాయి. దిల్లీ వంటి చోట్ల భూగర్భంలోనూ మెట్రో రైళ్లు నడుస్తున్నాయి.

* 1984లో కలకత్తా మెట్రో... దేశంలోని తొలి ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ లైన్‌గా పేరుగాంచింది. ఆ ఏడాది తొలి మెట్రో రైలు నడిచింది. ప్రస్తుతం 15 నగరాల్లో మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. 2024 లోపు మరో ఆరు నగరాల్లో వీటిని అందుబాటులోకి తీసుకొచ్చేలా నిర్మాణ పనులు జరుగుతున్నాయి.


చేయాల్సింది చాలా ఉంది

* రోడ్డు రవాణా రంగంలో అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడేందుకు భారత్‌ చేయాల్సింది చాలా ఉంది. జాతీయ రహదారుల విస్తరణ మరింత వేగం అందుకోవాలి. నాలుగు వరుసల రహదారుల్ని ఆరు, అంతకంటే ఎక్కువ వరుసల ఎక్స్‌ప్రెస్‌ వేలుగా విస్తరించాలి. అన్ని గ్రామాలకు మెరుగైన రవాణా సదుపాయం కల్పించాలి.

* 2024 నాటికి 26 గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణం పూర్తవుతుందని కేంద్రం ఇటీవల ప్రకటించింది. అవి పూర్తయితే... దిల్లీ నుంచి దేెహ్రాదూన్‌కు 2 గంటల్లో, హరిద్వార్‌ 2 గంటల్లో, జైపుర్‌ 2 గంటల్లో, చండీగఢ్‌ 2.5 గంటల్లో, అమృత్‌సర్‌ 4 గంటల్లో, శ్రీనగర్‌ 8 గంటల్లో, ముంబయి 12 గంటల్లో, చెన్నై నుంచి బెంగళూరుకు 2 గంటల్లో చేరుకోవచ్చు. ఇలాంటి అభివృద్ధి ప్రాజెక్టులు మరికొన్ని ప్రధాన నగరాలకూ అందుబాటులోకి తేవాలి.

* హైస్పీడ్‌ రైళ్ల పెంపుపై దృష్టి పెట్టాలి.

* దేశంలో సరకు రవాణాకు ప్రత్యేక ఫ్రైట్‌ రైలు కారిడార్ల నిర్మాణం పెద్ద ఎత్తున చేపట్టాల్సిన అవసరముంది. ప్రస్తుతం ఇలాంటివి రెండు మాత్రమే ఉన్నాయి. కొత్తగా ప్రతిపాదించిన వాటిని వేగంగా పూర్తి చేయాలి.

హైస్పీడ్‌ రైల్‌ కారిడార్లు కావాలి

ముంబయి-అహ్మదాబాద్‌ల మధ్య 508 కి.మీ. హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ పనులు జరుగుతున్నాయి. దాన్ని 2028కి పూర్తిచేసి, బుల్లెట్‌ రైలు నడపాలని కేంద్రం భావిస్తోంది. నేషనల్‌ రైల్‌ ప్లాన్‌ కింద దిల్లీ-వారణాసి, నాగ్‌పుర్‌-ముంబయి, దిల్లీ-అహ్మదాబాద్‌, దిల్లీ-అమృత్‌సర్‌, హైదరాబాద్‌-ముంబయి, వారణాసి-హౌరా, చెన్నై-మైసూర్‌ హైస్పీడ్‌ కారిడార్ల ప్రతిపాదనల్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఇటీవలే కొత్తగా హైదరాబాద్‌-బెంగళూరు, నాగ్‌పూర్‌-వారణాసి, అమృత్‌సర్‌-జమ్ము, పట్నా-గౌహతి మధ్య కూడా హైస్పీడ్‌ రైల్‌ కారిడార్లు ప్రతిపాదించారు. వీటన్నిటినీ వీలైనంత వేగంగా పట్టాలెక్కించాలి.

* ఉడాన్‌ పథకం ప్రారంభించాక కొత్తగా 68 విమానాశ్రయాలు ఏర్పాటయ్యాయి. వీటి సంఖ్యను 100కి పెంచాలన్న లక్ష్యం నెరవేరితే మరికొన్ని వేల మందికి విమాన ప్రయాణం అందుబాటులోకి వస్తుంది.

* దేశంలోని 31 ప్రధాన నగరాల్లో 2047 నాటికి రెండేసి విమానాశ్రయాలు ఉండాలన్న లక్ష్యమూ ఘనమైనదే.

* కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సాగర్‌మాల ప్రాజెక్టు దేశంలోని ఓడరేవుల ఆధునికీకరణ, కొత్త ఓడరేవుల నిర్మాణం, పోర్టులో అనుసంధానత పెంచడం, పోర్టు ఆధారిత పారిశ్రామికీకరణకు దోహదం చేస్తోంది. 2035 నాటికి రూ.5.54 లక్షల కోట్లతో 802 ప్రాజెక్టులు చేపట్టడం లక్ష్యం. రూ.94,712 కోట్ల విలువైన 181 ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తయ్యాయి. 2047 నాటికి మరికొన్ని కొత్త లక్ష్యాలతో పురోగమించాలి.

* ప్రస్తుతం దేశంలో ఉన్న పోర్టులు అవసరానికి సరిపడా లేవు. ఉన్నవి కూడా ఇరుకుగా మారిపోయాయి. కొత్త ఓడరేవుల నిర్మాణం వేగవంతం కావాలి.


‘‘మా దేశానికి అందుబాటులో ఉన్న సంపదతో మేం మెరుగైన రహదారులను నిర్మించుకోలేదు. అంత మంచి రహదారులు ఉండటం వల్లే సంపద సృష్టించగలిగాం’’

- అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్‌.ఎఫ్‌. కెన్నడీ


...ఒక దేశ ఆర్థిక ప్రగతికి రహదారులెంత ప్రధానమో తెలిపే వ్యాఖ్య ఇది.


2

ప్రపంచంలో అత్యంత పొడవైన రోడ్డు నెట్‌వర్క్‌ కలిగిన అమెరికా తర్వాత స్థానం మనదే


3

అతిపెద్ద దేశీయ పౌరవిమానయాన మార్కెట్లలో ప్రపంచంలో భారత్‌ స్థానం


4

అతిపెద్ద దేశీయ పౌరవిమానయాన మార్కెట్లలో ప్రపంచంలో  భారత్‌ ర్యాంకు


- ఈనాడు, అమరావతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని