AB Venkateswara Rao: హైకోర్టు ఆదేశించినా జీతభత్యాలు ఇవ్వలేదు

హైకోర్టు ఆదేశాల మేరకు సస్పెన్షన్‌ కాలానికి రాష్ట్ర ప్రభుత్వం తనకు జీతభత్యాలు ఇవ్వాల్సిఉండగా అవి చెల్లించలేదంటూ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టులో

Updated : 19 Aug 2022 08:06 IST

కోర్టుధిక్కరణ వ్యాజ్యం వేసిన సీనియర్‌ ఐపీఎస్‌ ఏబీ వెంకటేశ్వరరావు
సీఎస్‌ సమీర్‌శర్మకు నోటీసు జారీ

ఈనాడు, అమరావతి: హైకోర్టు ఆదేశాల మేరకు సస్పెన్షన్‌ కాలానికి రాష్ట్ర ప్రభుత్వం తనకు జీతభత్యాలు ఇవ్వాల్సిఉండగా అవి చెల్లించలేదంటూ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టులో కోర్టుధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు. ఉద్దేశపూర్వకంగా కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు సీఎస్‌ సమీర్‌శర్మను శిక్షించాలని కోరారు. న్యాయమూర్తులు జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు, జస్టిస్‌ ఎస్‌.సుబ్బారెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం ఈ వ్యాజ్యంపై విచారణ జరిపింది. ప్రతివాదిగా ఉన్న సీఎస్‌ సమీర్‌శర్మకు నోటీసు జారీచేసింది. కౌంటరు దాఖలు చేయడానికి సమయం కావాలని హోంశాఖ జీపీ మహేశ్వరరెడ్డి కోరగా, అంగీకరించినధర్మాసనం.. విచారణను సెప్టెంబరు 15కు వాయిదా వేసింది.

నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2020 ఫిబ్రవరి 8న జీవో జారీచేసింది. దానిపై జోక్యం చేసుకోవడానికి కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ (క్యాట్‌) నిరాకరించింది. దీంతో ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ఆయన సస్పెన్షన్‌ చట్టవిరుద్ధమంటూ.. సంబంధిత జీవోను కొట్టివేస్తూ హైకోర్టు 2020 మే 22న తీర్పు ఇచ్చింది. పిటిషనర్‌కు ఇవ్వాల్సిన అన్ని ఆర్థిక ప్రయోజనాలను కల్పించాలని ప్రభుత్వానికి తేల్చిచెప్పింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్‌(ఎస్‌ఎల్‌పీ) వేసింది. దాన్ని సుప్రీంకోర్టు ఈ ఏడాది ఏప్రిల్‌ 22న కొట్టేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం 2022 ఏప్రిల్‌ 22 నుంచి పూర్తిస్థాయి జీతభత్యాలు చెల్లించడం ప్రారంభించింది. హైకోర్టు ఆదేశించిన ప్రకారం సస్పెన్షన్‌ కాలానికి తనకు రావాల్సిన జీతభత్యాలు ఇవ్వాలని ఏబీ వెంకటేశ్వరరావు తాజాగా హైకోర్టులో కోర్టుధిక్కరణ వ్యాజ్యం దాఖలుచేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు జీతభత్యాలు ఇవ్వాలని సీఎస్‌కు లేఖలు రాసినా స్పందన లేదన్నారు. గురువారం జరిగిన విచారణలో పిటిషనర్‌ తరఫు న్యాయవాది నల్లూరి మాధవరావు వాదనలు వినిపించారు. పిటిషనర్‌కు ప్రభుత్వం బకాయిలను చెల్లించలేదన్నారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ప్రతివాదిగా ఉన్న సీఎస్‌ను పూర్తి వివరాలతో కౌంటరు వేయాలని ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని