తిరుమలకు బ్రహ్మోత్సవ శోభ

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. కొవిడ్‌ కారణంగా రెండేళ్లుగా బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది మాడ

Updated : 24 Sep 2022 06:39 IST

భక్తుల రద్దీ దృష్ట్యా సౌకర్యాల కల్పన

ఈనాడు, తిరుపతి, న్యూస్‌టుడే, తిరుమల: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. కొవిడ్‌ కారణంగా రెండేళ్లుగా బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది మాడ వీధుల్లో వాహనసేవలు నిర్వహించేందుకు తితిదే నిర్ణయించింది. భారీగా భక్తులు తరలిరానున్నందున అధికారులు తదనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. తొలిసారి బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులను సర్వదర్శనానికి మాత్రమే అనుమతించనున్నారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 27న ధ్వజారోహణంతో ప్రారంభమై 5న చక్రస్నానంతో ముగియనున్నాయి.

ప్రత్యేక ప్రవేశ దర్శనం, వీఐపీ బ్రేక్‌, వృద్ధులు, ప్రత్యేక ప్రతిభావంతుల దర్శనాలన్నీ రద్దు చేశారు. భక్తులందరికీ సర్వదర్శనం మాత్రమే కల్పించనున్నారు. దీనివల్ల రోజుకు లక్ష మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించవచ్చని అధికారుల అంచనా. సర్వదర్శనానికి ఆక్టోపస్‌ భవనం (గోగర్భం డ్యాం) మొదలుకొని శ్రీవారి సేవాసదన్‌ మీదుగా వరాహస్వామి అతిథి గృహాలు, కాంప్లెక్స్‌, లేపాక్షి మీదుగా క్యూలైన్‌ను ఏర్పాటుచేశారు. శిలాతోరణానికి వెళ్లే మార్గంలోని బాహ్య వలయ రహదారి మీదుగా నారాయణగిరి షెడ్లు, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ వరకు మరొకటి పెట్టారు. తద్వారా ఒకే మార్గంలో వెళితే తొక్కిసలాట జరిగే ప్రమాదముందని గుర్తించి క్యూలైన్లు ఏర్పాటుచేసినట్లు అధికారులు చెబుతున్నారు.

గ్యాలరీల్లోకి వెళ్లేలా..
మాడ వీధుల్లో విహరించే ఉత్సవమూర్తులను చూసేందుకు భారీ సంఖ్యలో భక్తులు గ్యాలరీల్లోకి వస్తారు. ఈ నేపథ్యంలో లోపలకు వెళ్లేవారు, వచ్చేవారితో గేట్ల వద్ద తొక్కిసలాట జరగకుండా క్యూలైన్లు ఏర్పాటుచేశారు.

* తిరుమలలో బసకు 7,300 గదులున్నాయి. వీటిల్లో కొన్నింటికి మరమ్మతు చేస్తున్నారు. వీటితోపాటు సుమారు 4.10 లక్షల చ.మీటర్ల విస్తీర్ణంలో పీఏసీలు ఉన్నాయి. వాటిల్లో 45 వేల మంది వరకు వసతి కల్పించవచ్చు. ఇవి కాకుండా తాత్కాలిక షెడ్లు ఏర్పాటుచేస్తామని అధికారులు చెబుతున్నారు. తరిగొండ వేంగమాంబ అన్నదాన సత్రంతోపాటు బయట పలు ప్రాంతాల్లో అన్నదానం చేయనున్నారు. కల్యాణకట్టలో సుమారు 60వేల మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించేలా ఏర్పాట్లు చేశారు.

* అన్ని ప్రధాన ప్రాంతాలను విద్యుత్తు దీపాలతో అలంకరించారు. అనంత పద్మనాభస్వామి ఆలయం, ఫల పుష్ప దర్శన ఏర్పాట్లు చేశారు.


అక్టోబరు 15 నుంచి యూకే, యూరప్‌లలో శ్రీనివాస కల్యాణాలు

ప్రపంచవ్యాప్తంగా పెద్దఎత్తున హిందూ ధర్మ ప్రచారం చేయడంలో భాగంగా అక్టోబరు 15 నుంచి నవంబరు 13 వరకు యూకే, యూరప్‌ దేశాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహించనున్నట్లు తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. స్థానిక అన్నమయ్య భవన్‌లో శుక్రవారం రాత్రి ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు.


Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts