పసిడికి ఆశపడి బంగరు జీవితానికి ముళ్లు.. 16 ఏళ్ల బాలికకు 40ఏళ్ల వ్యక్తితో పెళ్లి

వరుడు ఇచ్చిన బంగారం, డబ్బులకు ఆశపడి సొంత తల్లిదండ్రులే కుమార్తెకు బాల్యవివాహం చేసిన దారుణ ఘటన వైయస్‌ఆర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. బాధితురాలు సోమవారం....

Updated : 27 Sep 2022 12:48 IST

తల్లిదండ్రులపై ఎస్పీకి బాధితురాలి ఫిర్యాదు

కడప నేరవార్తలు, న్యూస్‌టుడే: వరుడు ఇచ్చిన బంగారం, డబ్బులకు ఆశపడి సొంత తల్లిదండ్రులే కుమార్తెకు బాల్యవివాహం చేసిన దారుణ ఘటన వైయస్‌ఆర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. బాధితురాలు సోమవారం ‘స్పందన’లో ఎస్పీ అన్బురాజన్‌ను ఆశ్రయించి వినతిపత్రం ఇవ్వడంతో విషయం వెలుగుచూసింది. కడప నగరానికి చెందిన బాలిక(16) తొమ్మిదో తరగతి వరకు చదివింది. ఓ యువకుడిని ప్రేమించింది. ఆమె తల్లిదండ్రులకు అతనంటే ఇష్టం లేదు. మరొకరితో వివాహం చేసేందుకు ఇటీవల యత్నించారు.

విషయం దిశ పోలీసులకు తెలియడంతో వారిని ఠాణాకు పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అమ్మాయికి 18 ఏళ్లు నిండాకనే పెళ్లి చేయాలని స్పష్టంచేశారు. కానీ... బాలికను ప్రొద్దుటూరుకు చెందిన 40 ఏళ్ల వయసున్న వ్యక్తికిచ్చి ఆగస్టులో పెళ్లి చేశారు. అతను ఆమె తల్లిదండ్రులకు ఏడు తులాల బంగారం, రూ.2 లక్షల నగదు ఇచ్చినట్లు సమాచారం. అతనితో కాపురం చేయడానికి బాలిక ఇష్టపడలేదు. సోమవారం తల్లిదండ్రులకు తెలియకుండా వచ్చి ఎస్పీకి స్పందనలో ఫిర్యాదు చేయగా, వెంటనే కేసు నమోదు చేయాలని దిశ పోలీసులను ఎస్పీ ఆదేశించారు. ఈ విషయమై దిశ ఠాణా డీఎస్పీ వాసుదేవన్‌ను వివరణ కోరగా బాల్యవివాహం జరిగిన మాట వాస్తవమేనన్నారు. మంగళవారం ఆధారాలు సేకరించిన తర్వాత కేసు నమోదు చేస్తామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని