logo

గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న

పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది.

Updated : 25 Apr 2024 09:54 IST

ప్యారిస్‌, న్యూస్‌టుడే: పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. ఇళయరాజా 4,500 పాటలు ఉపయోగించుకునేందుకు ఎకో, ఏఐజీ తదితర సంగీత సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ముగిసిన తర్వాత కూడా కాపీరైట్‌ పొందకుండా తన పాటలు ఉపయోగిస్తున్నారని ఇళయరాజా పిటిషన్‌ వేశారు. విచారించిన సింగిల్‌ జడ్జి.. నిర్మాత వద్ద హక్కు పొంది ఇళయరాజా పాటలు ఉపయోగించడానికి సంగీత సంస్థలకు అధికారం ఉందని, పాటలపై వ్యక్తిగతంగా ప్రత్యేక హక్కు ఇళయరాజాకు ఉండదని 2019లో ఉత్తర్వులు ఇచ్చారు. వాటికి వ్యతిరేకంగా ఇళయరాజా అప్పీల్‌ దాఖలు చేశారు. విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం ఇళయరాజా పాటలు ఉపయోగించుకునేందుకు సంగీత సంస్థలకు మధ్యంతర నిషేధం విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. 

అనంతరం సినిమా కాపీరైట్‌ నిర్మాత వద్ద ఉందని, వారితో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు పాటలు ఉపయోగించడానికి అధికారం ఉందని ఎకో తరఫున అప్పీల్‌ చేశారు. ఇది బుధవారం విచారణకు వచ్చింది. ఎకో సంస్థ తరఫున హాజరైన లాయరు.. సంగీతం సమకూర్చినందుకు ఇళయరాజాకు నిర్మాత వేతనం ఇవ్వడంతో ఆ హక్కు నిర్మాతకు చేరుతుందని తెలిపారు. నిర్మాత వద్ద హక్కు పొందడంతో పాటలు తమకు సొంతమైనవని పేర్కొన్నారు. అందుకు ఇళయరాజా తరఫున.. సంగీతం సమకూర్చడం అనేది క్రియేటివిటీ పని అని, కాపీరైట్‌ చట్టం వర్తించదని తెలిపారు. జోక్యం చేసుకున్న న్యాయమూర్తులు.. లిరిక్స్‌ లేకపోతే పాటలు లేవన్నారు. అలాంటప్పుడు పాటలకు గీతరచయిత హక్కు కోరితే ఏమవుతుందని ప్రశ్నించారు. అనంతరం విచారణ జూన్‌ రెండో వారానికి వాయిదా వేశారు. పాటల విక్రయం ద్వారా ఇళయరాజా పొందిన  మొత్తం ఎవరికి చెందుతుందనేది తుది తీర్పునకు లోబడి ఉంటుందని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు