రైల్వేజోన్‌ ఏర్పాటుపై ఊహాగానాలను నమ్మొద్దు

విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ ఏర్పాటుపై వస్తున్న ఊహాగానాలను నమ్మొద్దని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. బుధవారం కేంద్ర మంత్రివర్గ సమావేశం అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఓ పాత్రికేయుడి ప్రశ్నకు

Updated : 29 Sep 2022 07:27 IST

 రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌

డీపీఆర్‌పై సమీక్ష జరుగుతోందన్న రైల్వేశాఖ

రెండున్నరేళ్లుగా అధికారులది అదే మాట

ఈనాడు, దిల్లీ: విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ ఏర్పాటుపై వస్తున్న ఊహాగానాలను నమ్మొద్దని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. బుధవారం కేంద్ర మంత్రివర్గ సమావేశం అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఓ పాత్రికేయుడి ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ‘దయచేసి ఎలాంటి ఊహాగానాలనూ నమ్మొద్దు. ప్రభుత్వం వాగ్దానం చేసింది. మేం కట్టుబడి ఉన్నాం. ఇప్పటికే భూమి గుర్తించాం. నిర్మాణ అంచనా వ్యయాలు రూపొందించాం. ఇదివరకు భూమి ఎక్కడ లభిస్తుందన్న సమస్య ఉండేది. విశాఖ డీఆర్‌ఎం కార్యాలయ సమీపంలో భూమిని తీసుకోవడం ద్వారా ఆ సమస్యనూ అధిగమించాం. అన్నీ గుర్తించాం. అది ఫుల్‌ట్రాక్‌పై ఉంది’ అని మంత్రి పేర్కొన్నారు. మరోవైపు దక్షిణకోస్తా రైల్వేజోన్‌ ఏర్పాటుకోసం ఓఎస్‌డీ ఇచ్చిన నివేదికపై ప్రస్తుతం సమీక్ష జరుగుతున్నట్లు తూర్పుకోస్తా రైల్వే జోన్‌ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే.. ఇదే మాటను రైల్వేశాఖ రెండున్నరేళ్లుగా చెబుతూనే ఉంది. 2020 మార్చి 18వ తేదీన లోక్‌సభలో తెదేపా ఎంపీ రామ్మోహన్‌నాయుడు, వైకాపా ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి కొత్త జోన్‌ ఏర్పాటు గురించి అడిగిన ప్రశ్నకు అప్పటి మంత్రి పీయూష్‌గోయల్‌ లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో డీపీఆర్‌ ప్రస్తుతం రైల్వేబోర్డు ఆఫీసులో పరిశీలనలో ఉన్నట్లు చెప్పారు. ఈ సమాధానం ఇచ్చి ఇప్పటికి 31నెలలు అయింది. ఇప్పుడు కూడా దాదాపుగా అదే మాట చెబుతోంది. ‘విశాఖ కేంద్రంగా కొత్త రైల్వేజోన్‌ ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదించాక అక్కడ ఓఎస్‌డీని నియమించి.. ప్లానింగ్‌, ముందస్తు పనులు చేపట్టాలని ఆదేశించాం. ఆయన ఇచ్చిన నివేదికపై సమీక్ష జరుగుతోంది. కొత్త దక్షిణ కోస్తా రైల్వే జోన్‌, తూర్పు కోస్తా రైల్వేజోన్‌లో రాయగడ డివిజన్‌ ఏర్పాటు పనులను రూ.170 కోట్ల అంచనా వ్యయంతో 2020-21 బడ్జెట్‌లో కూడా చేర్చాం. ఇటీవల జోనల్‌ ప్రధాన కార్యాలయ ఆర్కిటెక్చరల్‌ ప్లాన్‌ను రైల్వేశాఖ పరిశీలన కోసం ఆర్కిటెక్ట్‌ సమర్పించారు’ అని తూర్పుకోస్తా రైల్వే తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని