మళ్లీ తడ‘బడి’

పేదరికం కారణంగా ఏ తల్లీ తన పిల్లలను బడికి పంపలేని దుస్థితి రాకూడదని, పాఠశాలల్లో డ్రాపౌట్స్‌ను తగ్గించాలనే ఉద్దేశంతోనే అమ్మఒడి అమలు చేస్తున్నాం.

Updated : 02 Oct 2022 06:20 IST

ఏకంగా 1.73 లక్షల మంది పిల్లలు డ్రాపౌట్‌ 

ప్రభుత్వ పాఠశాలల్లో ఆందోళనకర పరిస్థితి

పిల్లలను గుర్తించాలని గ్రామ, వార్డు సచివాలయ శాఖకు లేఖ

పేదరికం కారణంగా ఏ తల్లీ తన పిల్లలను బడికి పంపలేని దుస్థితి రాకూడదని, పాఠశాలల్లో డ్రాపౌట్స్‌ను తగ్గించాలనే ఉద్దేశంతోనే అమ్మఒడి అమలు చేస్తున్నాం.

-సీఎం జగన్‌మోహన్‌రెడ్డి


గతేడాదితో పోల్చితే ఈసారి 2.25 లక్షల మంది విద్యార్థులు బడి మానేశారు(డ్రాపౌట్‌). ప్రధానోపాధ్యాయులు, విద్యాశాఖలోని ఇతర ఉద్యోగుల ప్రయత్నాలతో 52 వేల మంది తిరిగి చేరారు. మిగతా 1.73 లక్షల మందిని గుర్తించి, బడికి తీసుకురావాలని పాఠశాల విద్య కమిషనర్‌ కోరారు’

-కలెక్టర్లకు రాసిన లేఖలో గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్‌


ఈనాడు, అమరావతి: అమ్మఒడి, విద్యా కానుక పథకాల కారణంగా బడి మానేసే విద్యార్థుల సంఖ్య తగ్గిందని, సర్కారు బడులకు వచ్చే వారు పెరిగారని ప్రభుత్వం ఇంతవరకు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని తేలిపోయింది. 2021-22 విద్యా సంవత్సరంతో పోల్చితే ఈ ఏడాది 2.25 లక్షల మంది బడి మానేసినట్లు పాఠశాల విద్యాశాఖ గణాంకాలు చెబుతున్నాయి. కొందరు ప్రధానోపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు చేసిన కృషితో 52 వేల మంది వెనక్కి వచ్చారు. ఇంకా 1.73 లక్షల మంది వివరాలు తెలియరాలేదు. వీరిలో ప్రాథమిక పాఠశాల నుంచి పదో తరగతి వరకు ఉన్నారు. జులై 5వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఈ లెక్కన 80 రోజులకుపైగా ఇన్ని లక్షల మంది బడులకు రావడం లేదు. దాంతో ఇలాంటి పిల్లలను గుర్తించి, వారిని తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలంటూ గ్రామ, వార్డు సచివాలయాల శాఖకు పాఠశాల విద్యాశాఖ లేఖ రాసింది. ఈ మేరకు విద్య, సంక్షేమ సహాయకులు, గ్రామ, వార్డు వాలంటీర్ల సాయం తీసుకోవాలని  కలెక్టర్లకు సంబంధిత డైరెక్టర్‌ శన్‌మోహన్‌ ఆదేశాలు జారీ చేశారు. బడిమానేసిన పిల్లల ఇళ్లకు వాలంటీర్లు వెళ్లి వారి తల్లిదండ్రులకు ప్రేరణ కల్పించాలని ఆదేశించారు. 4-14 ఏళ్ల వయస్సులోపున్న పిల్లలందర్నీ బడిలో చేర్పించాలని కలెక్టర్లకు సూచించారు.

వద్దు... వద్దంటున్నా విలీనం

రవాణా సమస్యతో కొందరు విద్యార్థులు బడి మానేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. పిల్లలకు బడి దూరంగా ఉంటే రావడం మానేస్తారనే విషయం తెలిసినా ప్రభుత్వం ఈ ఏడాది తరగతుల విలీనం చేసింది. ఇలా చేస్తే డ్రాపౌట్లు పెరుగుతారని ఎంతమంది చెప్పినా వినలేదు. ఇప్పుడదే జరిగింది. మొత్తం 1,73,416 మంది పిల్లల పేర్లు, వారి తల్లిదండ్రుల ఫోన్‌ నంబర్లు, వారి పాఠశాలల వివరాలతో సహా విద్యాశాఖ అందించింది. వీటి ఆధారంగా విద్యార్థులను గుర్తించాలని వార్డు, గ్రామ సచివాలయాల శాఖను కోరింది. కొందరు సీజనల్‌ పనుల కోసం వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారని, తల్లిదండ్రులు చదువుకోకపోవడం, విద్యార్థులకు ఆసక్తి లేకపోవడం, కుటుంబ పనులు, ఆరోగ్య సమస్యలతో కొందరు విద్యార్థులు బడి మానేశారని వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని