సంక్షిప్త వార్తలు (14)

తిరుమల వేంకటేశ్వరస్వామిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.శ్యామ్‌సుందర్‌ కుటుంబ సభ్యులతో కలిసి శనివారం దర్శించుకున్నారు.

Updated : 16 Oct 2022 06:19 IST

శ్రీవారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి

తిరుమల, తిరుచానూరు - న్యూస్‌టుడే: తిరుమల వేంకటేశ్వరస్వామిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.శ్యామ్‌సుందర్‌ కుటుంబ సభ్యులతో కలిసి శనివారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు తితిదే అధికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శనం చేయించారు. అనంతరం తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారిని కూడా న్యాయమూర్తి దర్శించుకున్నారు.

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి శనివారం సాయంత్రానికి క్యూలైన్‌లో వచ్చిన భక్తులు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయి రింగ్‌ రోడ్డులోని కృష్ణతేజ అతిథి భవనం వరకు వేచి ఉన్నారు. వీరికి దాదాపు 20 గంటల్లో స్వామివారి దర్శనం లభిస్తుందని తితిదే అధికారులు తెలిపారు.


అమరావతి రైతుల పాదయాత్రకు.. సిక్కోలులో సంఘీభావ ర్యాలీ

గార, న్యూస్‌టుడే: అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ శ్రీకాకుళం జిల్లా గార మండలంలో శనివారం ర్యాలీ నిర్వహించారు. తెదేపా నేత గొండు శంకరరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో స్థానిక రైతులు, నాయకులు భాగస్వాములయ్యారు. సుమారు 800 మంది శ్రీకూర్మం కూడలి నుంచి 3 కి.మీ మేర నడుచుకుంటూ ఆలయానికి వెళ్లారు. వర్షం పడుతున్నప్పటికీ ముందుకుసాగారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. శ్రీకూర్మం ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద కొబ్బరికాయలు కొట్టి స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమరావతే ఏకైక రాజధాని అని ప్రకటించే వరకు పోరాటం కొనసాగిస్తామని  ఆలయ ప్రాంగణంలో ప్రమాణం చేశారు.


కవయిత్రి కొలకలూరి స్వరూపరాణి కన్నుమూత

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రముఖ కవయిత్రి కొలకలూరి స్వరూపరాణి(80) ఒంగోలులోని తన స్వగృహంలో శనివారం ఉదయం కన్నుమూశారు. అనారోగ్యానికి గురైన ఆమె కొంతకాలంగా చికిత్స పొందుతున్నారు. ఆమె స్వగ్రామం బాపట్ల జిల్లా అమృతలూరు మండలం గోవాడ. వృత్తిరీత్యా ఒంగోలులో స్థిరపడి... ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉపాధ్యాయినిగా పని చేశారు. నన్నయ్య మహిళ విమర్శనాత్మక గ్రంథం, చంద్ర గ్రహణం నవల, గంగావతరణ శివ తాండవం అనే సంగీత ప్రధాన ద్విపద కావ్యం, ప్రణయ కుంతి, ప్రబోధం, స్త్రీపర్వం, వాయు నందన శతకంతో పాటు... సంస్కృతంలో ఉన్న శ్రీవేంకటేశ్వర సుప్రభాతాన్ని పద్య రూపంలో తెలుగులోకి అనువదించారు. పద్యం, వచన, గేయ ప్రక్రియల్లో పలు రచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలతో పాటు పలు అవార్డులు అందుకున్నారు. ప్రస్తుతం ఆమె నవ్యాంధ్ర రచయితల సంఘం, ప్రకాశం జిల్లా రచయితల సంఘంలో సభ్యురాలిగా ఉన్నారు. ఆమెకు భర్త, కుమారుడు, కుమార్తె ఉన్నారు. స్వరూపరాణి భౌతికకాయానికి పలువురు నివాళులర్పించారు.


సీఐడీ చీఫ్‌ సునీల్‌కుమార్‌పై కేంద్రానికి ఫిర్యాదు

పౌరులను కేసుల్లో ఇరికిస్తున్నారని హైకోర్టు న్యాయవాది లేఖ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ ఏపీ సీఐడీ అదనపు డైరెక్టర్‌ జనరల్‌ సునీల్‌కుమార్‌ దారుణాలకు పాల్పడుతున్నారని హైకోర్టు న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ ఆరోపించారు. పౌరులపై తప్పుడు కేసులు పెడుతూ చిత్రహింసలకు గురిచేస్తున్నారని కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ కార్యదర్శికి శనివారం ఆయన లేఖ రాశారు. ‘ఆంధ్రప్రదేశ్‌లోని సీఐడీ విభాగం కళంకిత అధికారులకు కేంద్రంగా మారింది. సునీల్‌కుమార్‌ అధికార దుర్వినియోగానికి వ్యతిరేకంగా గతంలో పెనుమాక సుబ్బారావు అనే వ్యక్తి హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేశారు. కొందరు పౌరులపై ప్రతీకారం తీర్చుకోవడానికి సీఐడీ పోలీసులను ఆయన ఉపయోగించుకుంటున్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలి’ అని లక్ష్మీనారాయణ లేఖలో కోరారు.


ధర్మాన భూదందాలపై న్యాయపోరాటం చేస్తాం

జై భీమ్‌ భారత్‌ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్‌కుమార్‌

ఈనాడు, అమరావతి: ఉత్తరాంధ్రలో మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన భూదందాలపై న్యాయపోరాటం చేయాలని జై భీమ్‌ భారత్‌ పార్టీ నిర్ణయించిందని ఆ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్‌కుమార్‌ తెలిపారు. ‘పేదలు, ఎస్సీ, ఎస్టీలు, మాజీ సైనికోద్యోగులను భయపెట్టి, పదీ పరకా ఇచ్చి భూముల్ని దక్కించుకుని.. వందల కోట్ల వ్యాపారం చేస్తుంటే ఉపేక్షించే ప్రసక్తే లేదు’ అని హెచ్చరించారు. ఉత్తరాంధ్రను దోచుకున్న నేతలే వెనకబాటు అంటూ ఇప్పుడు ప్రజల్ని రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. శనివారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు.


దస్తగిరి గన్‌మన్‌ సస్పెన్షన్‌

వాహనం కొన్నారనే అభియోగం

ఈనాడు డిజిటల్‌, కడప: మాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక సాక్షి, అప్రూవర్‌గా మారిన డ్రైవర్‌ దస్తగిరి వద్ద గతంలో గన్‌మన్‌గా పనిచేసిన పుష్పరాజ్‌ను ఎస్పీ అన్బురాజన్‌ సస్పెండ్‌ చేశారు. ఏఆర్‌ విభాగానికి చెందిన గన్‌మన్‌ అవినీతి, అక్రమాలకు పాల్పడి వాహనం కొన్నట్లు ప్రాథమిక విచారణలో తేలినందున సస్పెండ్‌ చేసినట్లు ఎస్పీ శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా, సర్వీసు రూల్స్‌కు విరుద్ధంగా వాహనం కొన్నట్లు అభియోగాలున్నాయని వివరించారు. ఆయన  కొన్న వాహనం దస్తగిరి వాడుకుంటున్నట్లు తెలుసుకుని సస్పెండ్‌ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.


4 బంగారు గనుల లీజులకే బిడ్లు దాఖలు

ఆరింటికి స్పందన కరవు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో పది బంగారు గనుల లీజుల్లో ఖనిజాన్వేషణ కోసం గనులశాఖ టెండర్లు పిలిస్తే నాలుగింటికే స్పందన వచ్చింది. ఆరింటిలో ఎవరూ బిడ్లు వేయలేదు. శ్రీసత్యసాయి జిల్లా రామగిరిలో ఉత్తర, దక్షిణ క్షేత్రాలు(బ్లాక్‌లు), రొద్దం మండలం బొక్సంపల్లిలో ఉత్తర, దక్షిణ క్షేత్రాలు, కదిరి మండలం జౌకులలో ఏ, బీ, సీ, డీ, ఈ, ఎఫ్‌ క్షేత్రాల్లో కలిపి 97.4 చదరపు కి.మీ. పరిధిలో బంగారు నిక్షేపాల ఖనిజాన్వేషణ లైసెన్సుల జారీకి గనులశాఖ టెండర్లు పిలిచింది. ఇందులో రామగిరి, బొక్సంపల్లిలోని 4 బ్లాకులకు బిడ్లు దాఖలయ్యాయి. మూడింటికి నాలుగేసి బిడ్లు, ఒకదానికి మూడు బిడ్లు వచ్చాయి. కనీసం మూడు బిడ్లు దాఖలైతేనే టెండర్లను పరిగణలోకి తీసుకుంటారు. దీంతో మొత్తం నాలుగు లీజులకు సంబంధించి దాఖలైన బిడ్ల సాంకేతిక అర్హతలను అధికారులు పరిశీలించనున్నారు.

నాలుగింట 6 టన్నుల బంగారం

రామగిరిలో నాలుగు టన్నులు, బొక్సంపల్లిలో రెండు టన్నుల మేర బంగారు నిల్వలు ఉంటాయని గనులశాఖ అంచనా వేసింది. టెండరు దక్కించుకునే సంస్థలు.. రెండు, మూడేళ్లలో ఖనిజాన్వేషణ చేసి, ఎంత మేరకు నిల్వలు ఉన్నాయనే ఖచ్చితమైన అంచనాతో నివేదిక రూపొందించాల్సి ఉంటుంది. దాని ఆధారంగా ఆ విస్తీర్ణం వరకు లీజు మంజూరు చేస్తారు. భూమి నుంచి 50 మీటర్ల దిగువకు వెళ్లేకొద్ది బంగారు నిక్షేపాలు ఉంటాయని భావిస్తున్నారు. ఇందులో అండర్‌ గ్రౌండ్‌ మైనింగ్‌ చేయనున్నారు. టన్ను మట్టి తవ్వితీస్తే అందులో 3 నుంచి 4 గ్రాముల బంగారం లభిస్తుందని గనులశాఖ అంచనా వేసింది. జౌకులలోని ఆరు క్షేత్రాల్లో అత్యధికంగా 10 టన్నుల బంగారు నిక్షేపాలు ఉంటాయని అంచనా వేసినా, ఎవరూ టెండర్లు వేసేందుకు ఆసక్తి చూపలేదు.


‘ఉత్తమ అవార్డులకు’ విద్యార్థుల ఎంపిక

ఈనాడు, అమరావతి: ఉన్నత విద్యామండలి ప్రకటించిన ‘ఉత్తమ విద్యార్థి అవార్డు’, ‘కమ్యూనిటీ సర్వీస్‌ అవార్డు’కు విద్యార్థులను జ్యూరీ శనివారం ఎంపిక చేసింది. ఉత్తమ విద్యార్థి అవార్డుకు 105 దరఖాస్తులు రాగా.. వీరిలో 16మందిని తుది పోటీకి ఎంపిక చేశారు. వీరిలోనుంచి నలుగురిని జ్యూరీ ఖరారుచేసింది. కమ్యూనిటీ సర్వీస్‌ అవార్డుకు మరో నలుగుర్ని ఎంపిక చేసింది. ఈ ఫలితాలను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.


ఆరోగ్యశ్రీ చికిత్సల ధరలు పెంచాలి

ఆసుపత్రుల యాజమాన్య సంఘం

ఈనాడు, అమరావతి: ఆరోగ్యశ్రీ ట్రస్టు కింద రోగులకు అందించే చికిత్సల ధరలు పెంచాలని రాష్ట్ర కార్పొరేట్‌  ఆసుపత్రుల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంలో గత పదేళ్ల నుంచి చికిత్సల ధరలు పెంచలేదని శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందే వారి సంఖ్య అత్యధికంగా ఉన్నందున నేరుగా ఫీజుల వసూళ్లు, బీమా సంస్థల కింద ప్రయోజనం పొందే వారు తక్కువ సంఖ్యలో ఉన్నారని పేర్కొంది. ఈ నేపథ్యంలో పెరుగుతున్న నిర్వహణ ఖర్చుల వల్ల ఆసుపత్రులు నడపడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని వెల్లడించింది. భారంగా మారిన వ్యయాలు పరిగణనలోనికి తీసుకొని చికిత్సల ఫీజులు 20% వరకు పెంచాలని కోరింది.


నూతన ఆవిష్కరణలకు నాంది పలకాలి

పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌కుమార్‌

ఈనాడు, అమరావతి: నూతన ఆవిష్కరణలతో విద్యాభివృద్ధికి నాంది పలకాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌కుమార్‌ సూచించారు. విజయవాడలో రెండు రోజులపాటు జరిగిన యూడైస్‌ ప్లస్‌ ప్రాంతీయ కార్యశాలకు ఏపీతోపాటు తెలంగాణ, తమిళనాడు, కేరళ, అండమాన్‌ నికోబర్‌ దీవులు, పుదుచ్చేరికి చెందిన అధికారులు హాజరయ్యారు. ఈ కార్యశాల ముగింపు సందర్భంగా శనివారం ఆయన మాట్లాడుతూ విద్యాభివృద్ధికి అన్ని రాష్ట్రాలు బాగా కృషి చేస్తున్నాయని, ఆయా రాష్ట్రాల్లోని ఉత్తమ విధానాలు, కొత్త ఆలోచనలను పంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ గణాంక ప్రచురణల విభాగం డిప్యూటీ డైరెక్టర్‌ వెంకటరమణ హెగ్డే, గ్రంథాలయ శాఖ డైరెక్టర్‌ ప్రసన్న కుమార్‌ పాల్గొన్నారు.


పరీక్షల విధానంలో మార్పునకు చర్యలు: ప్రతాప్‌రెడ్డి

ఈనాడు, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల విద్యార్థులకు ‘తరగతి గది ఆధారిత అంచనా(సీబీఎస్‌)’ పరీక్షలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి డైరెక్టర్‌ ప్రతాప్‌రెడ్డి తెలిపారు. విద్యార్థులు పరీక్షల్లో సమాధానాలు రాయడం, పాఠాలను అర్థం చేసుకోవడంలో ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని, బోధన ప్రక్రియలో మార్పులు చేయడానికి ఈ విధానం అవలంబిస్తున్నట్లు వెల్లడించారు.ఇందుకోసం ఎడ్యుకేషనల్‌ ఇన్‌సేటివ్స్‌ అనే సంస్థతో కలిసి పని చేస్తున్నామని తెలిపారు. ఈ పరీక్ష విధానంలో 15మార్కులకు ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు, ఐదు మార్కులకు రాత ప్రశ్నలు ఉంటాయని, విద్యార్థులు చేసే సాధారణ తప్పులను గుర్తించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని వెల్లడించారు.


అమరావతికి మద్దతుగా అజ్‌మేర్‌ దర్గాకు చాదర్‌

మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూఖ్‌ షిబ్లీ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలని కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు చేసిన చాదర్‌ను అజ్‌మేర్‌ దర్గాకు తీసుకెళ్లనున్నట్లు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూఖ్‌ షిబ్లీ తెలిపారు. విజయవాడలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చాదర్‌ను తీసుకుని సోమవారం ప్రత్యేక బస్సులో అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్ర ప్రాంతానికి వెళ్తామన్నారు. అక్కడ యాత్రలో ఊరేగింపు చేసిన తర్వాత అజ్‌మేర్‌కు బయలుదేరతామని వెల్లడించారు. మాట తప్పను...మడమ తిప్పను అనే సీఎం జగన్‌.. రాజధాని అమరావతి విషయంలో చేసిందేమిటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. మూడు రాజధానుల పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.


దీపావళికైనా వేతనాలు ఇవ్వకుంటే ఆందోళన: ఎన్‌హెచ్‌ఎం జేఏసీ

ఈనాడు, అమరావతి: దీపావళి పండగ నాటికి కూడా గత నెల వేతనాలు చెల్లించకుంటే ఆందోళన చేపట్టేందుకు కార్యాచరణ ఖరారు చేస్తామని రాష్ట్ర జాతీయ ఆరోగ్య మిషన్‌ జేఏసీ వెల్లడించింది. గత ఆగస్టులో ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారం వేతనాలు పెంచలేదని శనివారం ఓ ప్రకటనలో ఆవేదన వ్యక్తంచేసింది. కొత్త వేతనాలు ఖరారు చేయకపోగా...సెప్టెంబరు వేతనాలు ఇప్పటివరకు ఇవ్వనందున ఆర్థికంగా ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని జేఏసీ ఛైర్మన్‌ దయామణి వెల్లడించారు.  


నీట్‌ పీజీ డెంటల్‌ ప్రవేశాలకు కటాఫ్‌ తగ్గింపు

ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: జాతీయ వైద్యమండలి తాజాగా నీట్‌ పీజీ డెంటల్‌-2022 ప్రవేశాలకు కటాఫ్‌ మార్కులను తగ్గించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని దంతవైద్య కళాశాలల్లో ఉన్న పీజీ ఎండీఎస్‌ సర్వీస్‌, నాన్‌-సర్వీస్‌ సీట్ల ప్రవేశానికి ఈనెల 16 నుంచి 18వ తేదీ సాయంత్రంలోగా దరఖాస్తు చేసుకోవాలని డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ డాక్టర్‌ సీహెచ్‌ శ్రీనివాసరావు తెలిపారు. జనరల్‌ కేటగిరీ (అన్‌ రిజర్వుడు) విభాగంలో గతంలో ఉన్న 263 కటాఫ్‌ మార్కుల నుంచి 174కు, ఎస్సీ/ఎస్టీ, బీసీ కేటగిరీలో 227 నుంచి 138, అన్‌రిజర్వుడు- పిడబ్ల్యుడి విభాగంలో 245 నుంచి 157 మార్కులకు కుదించారు. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

మెడికల్‌ ప్రవేశాల్లో స్కౌట్స్‌ విద్యార్థులకు అవకాశం

రాష్ట్రంలో భారత స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ ధ్రువపత్రాలున్న విద్యార్థులు ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో కన్వీనర్‌ కోటా ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చని డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పత్రాలను ఈ నెల 20వ తేదీ సాయంత్రం 6 గంటల్లోగా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని