Vizag Steel Plant: విశాఖ ఉక్కును ముంచేస్తున్నారు!

విశాఖ ఉక్కు కర్మాగారంపై నష్టజాతక సంస్థగా ముద్రవేసి అప్పనంగా ప్రైవేటుకు ఇవ్వాలన్న ప్రయత్నాలు జోరందుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Updated : 26 Oct 2022 10:29 IST

ఈ ఏడాది రూ.1,261 కోట్లకు పైనే నష్టాలు

పట్టించుకోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

కావాలనే ఇలా చేస్తున్నట్లు అనుమానాలు

ప్రశ్నార్థకంగా మారిన సంస్థ మనుగడ

ఈనాడు, విశాఖపట్నం: విశాఖ ఉక్కు కర్మాగారంపై నష్టజాతక సంస్థగా ముద్రవేసి అప్పనంగా ప్రైవేటుకు ఇవ్వాలన్న ప్రయత్నాలు జోరందుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలోనే అతిపెద్ద కర్మాగారమైన ‘విశాఖ ఉక్కు’ ఉసురు తీస్తున్నా... రాష్ట్ర ప్రభుత్వం స్పందించడంలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత కొన్ని నెలల నుంచి సంస్థ తీసుకుంటున్న నిర్ణయాలు కూడా ఆ ఆరోపణలకు బలం చేకూరేలా ఉంటున్నాయి. దీన్ని గమనించిన సంస్థ అధికార, ఉద్యోగ, కార్మిక సంఘాలు ప్రణాళికాబద్ధంగా కృషి చేయడంతో గత ఆర్థిక సంవత్సరం ఏకంగా రూ. 939 కోట్ల మేర లాభాలు వచ్చాయి. టర్నోవర్‌ కూడా రూ. 28,215 కోట్లు దాటింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మాత్రం ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా సంస్థ లాభాలు సాధించే అవకాశం లేకపోగా.. భారీ ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయేలా ఉంది.

* కర్మాగారం రూ. 20,000 కోట్లకు పైగా అప్పుల్లో కూరుకుపోయి ముడిసరకు కొనడానికీ తగిన     నగదు నిల్వలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతోంది. దేశంలోని కొన్ని ప్రైవేటు సంస్థలకు చేసినట్లు రుణమాఫీ చేసి ఉక్కును ఆర్థిక కష్టాల నుంచి బయట పడేయవచ్చు. కనీసం రుణాన్ని ఈక్విటీగా గానీ, ప్రిఫరెన్షియల్‌ ఈక్విటీగా గానీ మార్చినా సంస్థకు ఆర్థిక ఉపశమనం కలుగుతుంది. ఆ మేరకు ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా.. సంస్థ అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

* ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ. 1,261 కోట్ల వరకు నికరనష్టం వచ్చినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చి సంస్థ కార్యకలాపాలు సజావుగా సాగేలా చర్యలు తీసుకోకపోతే ఆర్థిక సంవత్సరం చివరికి భారీ నష్టాలు ఎదురయ్యే ముప్పు ఉంది.

* జనవరి నెలాఖరు నుంచి ఒక బ్లాస్ట్‌ఫర్నేస్‌ను మూసేశారు. ఫలితంగా ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. ప్రతిరోజూ సుమారు 20 వేల టన్నుల ద్రవ ఉక్కు తయారుచేసే సామర్థ్యం ఉన్నా 10,000 టన్నుల లోపే ఉత్పత్తి చేస్తున్నారు. సంస్థ సామర్థ్యాన్ని కేవలం 50 శాతం మాత్రమే ఉపయోగించుకుంటే దీర్ఘకాలంలో మరింత తీవ్రంగా నష్టాల్లో కూరుకుపోయే గండముంది. ఉన్నతాధికారులు ఎలాంటి ప్రత్యామ్నాయాలపైనా దృష్టి సారించడంలేదనే విమర్శలు వస్తున్నాయి.

* అధికారులు, ఉద్యోగులు, ఒప్పంద ఉద్యోగులు కలిసి సుమారు 30,000 మంది వరకు ఉన్నారు. వారందరికి సంబంధించిన సర్వీసు వ్యవహారాలు, ఇతర సంక్షేమ, ఆర్థిక వ్యవహారాలు పర్యవేక్షించే కీలకమైన డైరెక్టర్‌ (పర్సనల్‌) పోస్టును ఏడాదిన్నర నుంచి భర్తీ చేయలేదు.

* సంస్థ ఆర్థికంగా తీవ్రమైన సంక్షోభంలో ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవహారాలను, కార్యకలాపాలను పర్యవేక్షించే డైరెక్టర్‌ పోస్టును నాలుగు నెలలుగా భర్తీ చేయడంలేదు. గతంలో ఆ పోస్టులో విధులు నిర్వర్తించిన అధికారి అందుబాటులో ఉన్నప్పటికీ ఆయన పదవీకాలాన్ని పొడిగించకుండా తాత్సారం చేస్తున్నారు. ఫలితంగా సంస్థ ఆర్థిక పరిస్థితి మరింత అగమ్యగోచరంగా మారొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది.

* కర్మాగారంలో ఎలాంటి నూతన ప్రాజెక్టులు అమలు చేసే పరిస్థితి లేనప్పటికీ డైరెక్టర్‌ (ప్రాజెక్ట్స్‌) పోస్టును మాత్రం ఆగమేఘాలపై భర్తీ చేయడం చర్చనీయాంశమవుతోంది.

* సంస్థ ఉత్పత్తి కార్యకలాపాలను పర్యవేక్షించే డైరెక్టర్‌ (ఆపరేషన్స్‌) ఇటీవలే ఎం.ఒ.ఐ.ఎల్‌. సంస్థకు సీఎండీగా ఎంపికయ్యారు. దీంతో త్వరలో ఆ పోస్టు కూడా ఖాళీకానుంది.


ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం చేస్తున్నారు  

విశాఖ ఉక్కు కర్మాగారం నష్టాలపాలయ్యేలా ఉద్దేశపూర్వకంగా పలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. సంస్థ నిర్వహణలో కీలకమైన పోస్టులన్నీ వరుసగా ఖాళీ అవుతున్నా సమర్థులైన వారిని నియమించకుండా ఎందుకు తాత్సారం చేస్తున్నారు? ఒక బ్లాస్ట్‌ఫర్నేస్‌ పది నెలలుగా పనిచేయకపోయినా పట్టించుకోవడం లేదు. అప్పులు రూ. 20,000 కోట్లు దాటినా.. సంస్థను గట్టెక్కించడానికి అధికారుల దగ్గర ఎలాంటి ప్రణాళికా లేదు. రాష్ట్రంలోని అతిపెద్ద కర్మాగారాన్ని నిలువునా నష్టాలపాలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా కేంద్రంపై ఎలాంటి ఒత్తిడి తీసుకురావడంలేదు. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు జోక్యం చేసుకుని సంస్థ పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేసేలా, సంస్థపై రుణభారం, వడ్డీ భారం తగ్గేలా, రాయితీపై ముడిసరకు లభించేలా చర్యలు తీసుకోవాలి. సంస్థ ఉత్పత్తి కనీసం 80 శాతానికి పెరిగేలా చర్యలు తీసుకోకపోతే భారీ నష్టాలు తప్పవు.  

- జె.అయోధ్యరామ్‌, కో కన్వీనర్‌, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీRead latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు