కర్నూలులో న్యాయరాజధాని ఏర్పాటు చేయాలి

శ్రీబాగ్‌ ఒప్పందం ప్రకారం రాయలసీమకు రావాల్సిన రాజధానిని అమరావతికి తరలించి గత పాలకులు తీవ్ర అన్యాయం చేశారని రాయలసీమ విద్యార్థి ఐకాస నాయకులు సునీల్‌రెడ్డి, శ్రీరాములు, చంద్రప్ప, ప్రశాంత్‌ పేర్కొన్నారు.

Published : 02 Nov 2022 04:44 IST

ఆత్మగౌరవ ర్యాలీలో రాయలసీమ విద్యార్థి ఐకాస నాయకుల డిమాండు

కర్నూలు ఎన్టీఆర్‌ సర్కిల్‌ (బి.క్యాంపు), న్యూస్‌టుడే: శ్రీబాగ్‌ ఒప్పందం ప్రకారం రాయలసీమకు రావాల్సిన రాజధానిని అమరావతికి తరలించి గత పాలకులు తీవ్ర అన్యాయం చేశారని రాయలసీమ విద్యార్థి ఐకాస నాయకులు సునీల్‌రెడ్డి, శ్రీరాములు, చంద్రప్ప, ప్రశాంత్‌ పేర్కొన్నారు. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలంటూ విద్యార్థి, యువజన, ఉద్యోగ, మేధావులు, న్యాయవాద సంఘాల ఐకాస ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన ఆత్మగౌరవ ర్యాలీ కర్నూలులోని రాజ్‌విహార్‌ సెంటర్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు సాగింది. ఐకాస నాయకులు మాట్లాడుతూ.. గతంలో కర్నూలులో రాజధాని ఉండగా దానిని హైదరాబాద్‌కు తరలించి మోసం చేశారని, అందుకే నవంబరు 1ని రాయలసీమ విద్రోహ దినంగా ప్రకటించినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ మరోసారి విడిపోకూడదని పాలకులు అనుకుంటే తక్షణమే కర్నూలులో న్యాయరాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్రం న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలన్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు రాయలసీమలోని రాజకీయ పార్టీలన్నీ తీర్మానం చేసి కేంద్రానికి లేఖలు రాయాలని ఐకాస నాయకులు కోరారు. నవంబరు చివరి వారంలో న్యాయ రాజధాని కోసం లక్ష గొంతుకల పొలికేక సభ నిర్వహిస్తామని వెల్లడించారు. నారాయణ విద్యా సంస్థల డీన్‌ లింగేశ్వరరెడ్డి, సి.వి.రామన్‌ విద్యా సంస్థల అధినేత చంద్రశేఖర్‌, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు, ఎంవీఎస్‌ అధ్యక్షుడు వెంకటేశ్‌, బార్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు ఎం.ఆర్‌.కృష్ణ, కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం అధ్యక్షులు ఏసుదాసు, విశ్రాంత తహసీల్దారు రోషన్‌ అలీ, ఐకాస నేత అజయ్‌కుమార్‌, రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల నేతలు సూర్య, మహేంద్ర, నాగరాజు, రామరాజు, శివ, సురేష్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని