Dubai: ఎడారి దేశంలో పాలరాతి ఆలయం

ఎడారి దేశం దుబాయ్‌లో హిందువుల కోసం ప్రత్యేకంగా పాలరాతితో నిర్మించిన దేవాలయం సందర్శకులను ఆకట్టుకుంటోంది.

Updated : 11 Nov 2022 10:53 IST

దుబాయ్‌లోని జెబెల్‌అలీలో ‘ఆరాధన గ్రామం’
ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న శ్రీవేంకటేశ్వరుడి విగ్రహం

ఈనాడు, అమరావతి: ఎడారి దేశం దుబాయ్‌లో హిందువుల కోసం ప్రత్యేకంగా పాలరాతితో నిర్మించిన దేవాలయం సందర్శకులను ఆకట్టుకుంటోంది. ఆలయానికి అనుమతులతోపాటు నిర్మాణంలోనూ యూఏఈ పాలకులు సహాయం అందించారు. దుబాయ్‌లోని జెబెల్‌అలీలో నిర్మించిన ఈ దేవాలయానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. 9 మతపరమైన పుణ్యక్షేత్రాలను కలిపి ‘ఆరాధన గ్రామం’ పేరుతో ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలో 16 దేవతా విగ్రహాలుండగా.. శ్రీవేంకటేశ్వరస్వామి విగ్రహం భక్తులను అమితంగా ఆకట్టుకుంటోంది. మందిరం మధ్యలో ఏర్పాటుచేసిన పెద్ద 3డీ ప్రింటెడ్‌ తామరపువ్వు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ ఆలయంలోనే సిక్కుల పవిత్రగ్రంథం గురుగ్రంథ్‌ సాహిబ్‌ సైతం ఉంది. దుబాయ్‌కు వెళ్లే భారతీయుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నందున మన దేశంతో ఉన్న అనుబంధాన్ని చాటుకునేలా యూఏఈ పాలకులు ఈ ఆలయాన్ని నిర్మించారు. వివిధ దేశాల నుంచి తెచ్చిన పాలరాతితో కట్టిన దేవాలయం భక్తులను ఆకర్షిస్తోంది. ఇటీవల దీన్ని దుబాయ్‌ మంత్రి షేక్‌ నహ్యాన్‌ బిన్‌ ముబారక్‌ అల్‌ నహ్యాన్‌ ప్రారంభించారు. ఈ వేడుకకు వివిధ మతాల నాయకులు, యూఏఈ ప్రభుత్వ ఉన్నతాధికారులు, దౌత్యవేత్తలు హాజరయ్యారు.


అద్భుతంగా నిర్మించారు

‘పాలరాతితో నిర్మించిన దేవాలయం చాలా అద్భుతంగా ఉంది. కట్టడాలు అమోఘంగా ఉన్నాయి. 16 రకాల దేవతా పాలరాతి విగ్రహాలు ఒక్కచోటే చూసే అవకాశం లభిస్తుంది.’

- డాక్టర్‌ సమాల సుధ మోహర్‌, తెలంగాణ ప్రవాసీ దుబాయ్‌


పర్యాటలకు కొత్త అనుభూతి

‘తెలుగు రాష్ట్రాల నుంచి దుబాయ్‌కి వచ్చే పర్యాటకులు సందర్శిస్తే కొత్త అనుభూతి కలుగుతుంది. ఆలయనిర్మాణం, దేవుళ్ల విగ్రహాలు చాలా బాగున్నాయి. అనుమతులిచ్చి, ప్రారంభించిన దుబాయ్‌ పాలకులకు ధన్యవాదాలు.’

- మోనిక ముక్కు, భక్తురాలు, దుబాయ్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని